Telugu Global
Telangana

న్యూఇయర్‌ వేడుకలు.. పోలీసుల ఆంక్షలు

నియమ నిబంధనలు పాటించాలని ఆదేశాలు జారీ

న్యూఇయర్‌ వేడుకలు.. పోలీసుల ఆంక్షలు
X

న్యూఇయర్‌ వేడుకలకు నగరం సిద్ధమౌతున్నది. ఈ వేడుకల దృష్ట్యా పోలీసులు పటిష్ట ఏర్పాటు చేశారు. నగరంలో పోలీసులు ఆంక్షలు పెట్టారు. భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈవెంట్స్‌ నిర్వాహకులు నియమ నిబంధనలు పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. సమయం దాటిన తర్వాత ఈవెంట్స్‌ నిర్వహిస్తే చర్యలు తప్పవంటున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

వేడుక నిర్వహించే ప్రదేశంలో సీసీ కెమెరా నిఘా ఉండాలని పోలీసులు పేర్కొన్నారు. పార్కింగ్‌ స్థలాలను అనువుగా ఉండే విధంగా చూసుకోవాలని సూచిస్తున్నారు. వేడుకలు ముగిసిన తర్వాత అందరిని ఒకేసారి బైటికి పంపకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అందరూ ఒకేసారి వస్తే తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉన్నదన్నారు. వేడుకల్లో మాదక ద్రవ్యాల పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఎవరికైనా పాజిటివ్‌ వచ్చినట్లయితే నిర్వాహకులకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 260 చెక్‌ పాయింట్స్‌ పెట్టారు. ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 5 చెక్‌ పాయింట్లు ఏర్పాటు చేశారు. డ్రంకన్‌ డ్రైవ్‌ తనిఖీల కోసం ఎస్‌ఐ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు పనిచేస్తాయని అధికారులు తెలిపారు.

డ్రగ్స్‌, గంజాయి వినియోగాన్ని అరికట్టడానికి ప్రత్యేక నిఘా పెట్టారు. డ్రగ్‌ డిటెక్షన్‌ టెస్టింగ్‌ కిట్లను అందుబాటులో పెట్టామని పోలీసులు తెలిపారు. గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోనూ పోలీసులు డ్రగ్‌ డిటెక్షన్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. లంగర్ హౌస్‌, బేగంపేట ఫ్లై ఓవర్‌ మినహా ట్యాంక్‌ బండ్‌, నెక్లెస్‌ రోడ్‌తో పాటు మిగిలిన అన్ని ఫ్లైఓవర్స్‌, మూసివేయనున్నట్లు అధికారులు చెప్పారు.

నేటి రాత్రి 8 నుంచి రేపు ఉదయం 7 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ టెస్టులు చేయనున్నారు.

మద్యం తాగి మొదటి సారి పట్టుబడితే రూ.10వేల ఫైన్, 6 నెలల జైలు శిక్ష విధిస్తాంటున్నారు. రెండోసారి పట్టుబడితే ₹15వేల జరిమానా, జైలు శిక్ష, 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేస్తామన్నారు. డ్రగ్స్ సేవించి దొరికితే నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామన్నారు.

First Published:  31 Dec 2024 12:38 PM IST
Next Story