ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంపై ఎన్‌డీఎస్‌ఏ దర్యాప్తు చేయాలే
మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కూలిన ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) దర్యాప్తు చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో చేపడుతున్న ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కూలిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు, చేతగాని తనానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేయక చేయక ఒక ప్రాజెక్టు పనులు మొదలు పెడితే ఆరంభంలోనే అంతం చేశారని.. ఇదీ కాంగ్రెస్ పాలకుల ఘనత అన్నారు. నిన్న సుంకిశాల రీటైనింగ్ వాల్.. ఈరోజు ఎస్‌ఎల్‌బీసీ సొరంగం కుప్పకూలడం కాంగ్రెస్ కమిషన్ సర్కారు వైఫల్యానికి నిదర్శనమన్నారు. ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. నాలుగు రోజులుగా కొద్ది కొద్దిగా మట్టి కూలుతుందని గుర్తించినా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ఈరోజు పెను ప్రమాదం సంభవించిందన్నారు. ప్రమాదంలో గాయపడిన కార్మికులకు మెరుగైన చికిత్స అందించాలన్నారు. టన్నెల్‌లో ఎప్పటికప్పుడు డీ వాటరింగ్ చేయడంతో కరెంట్ సరఫరా పునరుద్దరించాలని, శిథిలాలు తొలగించి సొరంగం లోపల చిక్కుకున్న కార్మికులను క్షేమంగా బయటకు తీసుకురావాలన్నారు.