నల్గొండలో బీఆర్‌ఎస్ రైతు మహాధర్నాకు అనుమతి నిరాకరణ
ధర్నాకు అనుమతి ఇవ్వకుంటే గ్రామసభలనే నిరసన వేదికలుగా మారుస్తామని హెచ్చరిక
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండలో బీఆర్‌ఎస్ పార్టీ తలపెట్టిన రైతు మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నెల 21న పట్టణ కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్ వద్ద జరగనున్న ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. దీనికి సంబంధించి జిల్లా నాయకులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో గ్రామసభలు, సంక్రాంతి రద్దీ కారణంగా బందోబస్తు ఇవ్వలేమంటూ జిల్లా పోలీసులు ధర్నాకు అనుమతి నిరాకరించారు. దీంతో బీఆర్‌ఎస్ నాయకులు మండిపడుతున్నారు. అనుమతి కోసం హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
కేటీఆర్ అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకింత భయం? అని బీఆర్‌ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. రైతుల పక్షాన పోరాడుతున్నందుకు ఎందుకిన్ని ఆంక్షలు? ప్రజా పాలనలో ప్రతిపక్షాలకు నిరసన తెలిపే హక్కు లేదా? అని నిలదీస్తున్నారు.ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్నా నిర్వహించిన తీరుతామని స్పష్టం చేస్తున్నారు. గతంలో ఎన్నో నిరసన కార్యక్రమాలు గడియారం సెంటర్‌లో జరిగాయని గుర్తు చేస్తున్నారు. అప్పుడు లేని అభ్యంతరాలు కొత్తగా ఇపుడు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారని మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నాకు అనుమతి ఇవ్వకుంటే మంగళవారం నుంచి జరగనున్న గ్రామసభలనే నిరసన వేదికలుగా మారుస్తామని హెచ్చరించారు.