మహాపూజలతో ప్రారంభమైన నాగోబా జాతర
భక్తజన సంద్రంగా మారిన కేస్లాపూర్
ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్లో ఆదివాసీల ఇలవేల్పు నాగోబా జాతర ప్రారంభమైంది. పుష్యమి అమావాస్య అర్ధరాత్రి జరిగిన మహాపూజకు వివిధ రాష్ట్రాల నుంచి ఆదివాసీలు, గిరిజనులే కాకుండా గిరిజనేతరులు భారీగా తరలిరావడంతో కేస్లాపూర్ భక్తజన సంద్రంగా మారిపోయింది. మెస్రం వంశీయుల పూజల మధ్య గంగా జలంతో నాగోబాను అభిషేకించారు. అనంతరం ఆ గంగా జలాన్ని భక్తులపై చల్లి పరోపకార హితాన్ని చాటిచెప్పారు. ప్రభుత్వ ప్రతినిధులుగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, దండె విఠల్, జిల్లా కలెక్టర్ రాజార్షిషా, ఎస్పీ గౌష్ ఆలం, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 31న నాగోబా సన్నిధిలో గిరిజన దర్బార్ జరగనున్నది. ఈ దర్బార్‌కు రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, సీతక్క హాజరవుతున్నట్లు దేవాదాయ శాఖ ప్రకటించింది. ఫిబ్రవరి 4వ తేదీ వరకు జాతర కొనసాగనున్నది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచే కాకుండా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి మెస్రం వంశీలయులు, ఆదివాసీలు భారీగా తరలివస్తారని ప్రభుత్వ యంత్రాంగం అంచనా వేసింది.
చేన్ల లో పండిన పప్పు, బియ్యమే నైవేద్యం
నాగోబా జాతర ఆదివాసీ, ఆచార, వ్యవహారాలకు ప్రాణప్రదంగా నిలుస్తుంది. నాగోబాకు సమర్పించే నైవేద్యం తయారీలోనూ సంప్రదాయ పద్ధతులకే ప్రాధాన్యం ఉన్నది. మార్కెట్లో లభించే సరుకులను కాకుండా చేన్ల లో పండించే బియ్యం, పెసర, సెన, పప్పుతో పాటు ఆవు పాలు, పెరుగు, నెయ్యితో కలిపి సామూహికంగా తయారు చేసే నైవేద్యాన్ని నాగోబాకు సమర్పించడం ఆచారంగా వస్తున్నది. తర్వాత అందరికి పంచిపెట్టే నియమం ఉన్నది.