ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డికి చుక్కెదురు!
ప్రజావాణి ఫైల్ ను తిప్పిపంపిన ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ
ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డికి చుక్కెదురు అయ్యింది. ప్రజావాణిలో తమ దృష్టికి వచ్చిన సమస్యను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫైల్ పంపారు. ప్రజావాణి నుంచి ఫైల్ వస్తే, చిన్నారెడ్డి దానిపై ఎండార్స్ చేసి పంపితే క్లియర్ చేయాలా అనుకున్న సదరు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆ ఫైల్ ను తిప్పిపంపేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మహత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో వారానికి రెండు రోజులు నిర్వహిస్తోన్న ప్రజావాణిని ప్రభుత్వంలోని వివిధ శాఖలు సీరియస్ గా తీసుకోవడం లేదని స్పష్టమవుతోంది. ముఖ్యమంత్రి చూస్తున్న మంత్రిత్వ శాఖకు ప్రజావాణి నుంచి వచ్చిన అర్జీని కూడా తిప్పిపంపారు అంటే ఆ శాఖ పనితీరు ఎలా ఉందో అర్థమవుతోంది. మున్సిపల్ శాఖకు షాడో మంత్రిని తానేనని చెప్తూ రేవంత్ సన్నిహితుడు ఒకరు మైత్రివనం పక్కనే ఉన్న స్వర్ణజయంతి కాంప్లెక్స్‌లో అడ్డా పెట్టి తనకు కమీషన్లు ఇస్తేనే తప్ప ఫైళ్లు క్లియర్ చేసేది లేదని తెగేసి చెప్తున్నాడు. తాను ఇషారా ఇస్తే తప్ప ఏ ఒక్క ఫైల్ కూడా క్లియర్ చేయొద్దని ఇద్దరు సీనియర్ అధికారులు సదరు షాడో మినిస్టర్ అల్టిమేటం కూడా ఇచ్చారు. దీంతో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖతో పాటు హెచ్‌ఎండీఏలో గుట్టలు గుట్టలుగా ఫైళ్లు పేరుకుపోతున్నాయి.
మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట్ మండలం పోతాయిపల్లెకు చెందిన పిట్టు ఇందిర తమకు చెందిన 12.02 ఎకరాల ఓపెన్ ల్యాండ్ ను రెసిడెన్షియల్ ల్యాండ్ గా కన్వర్షన్ చేయాలని కోరుతూ 2023లో దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తును పరిశీలించిన అధికారులు ఆ భూమిని రెసిడెన్షియల్ గా కన్వర్షన్ చేయడానికి అవసరమైన నిర్దేశిత చార్జీలు చెల్లించాలని సూచించారు. 2023 నవంబర్ 14న చాలన్ రూపంలో అర్జీదారు రూ.97,56,265.20 రూపాయలు చెల్లించారు. ఆమె కన్వర్షన్ చార్జీలు చెల్లించారు కాబట్టి సదరు భూమిని రెసిడెన్షియల్ ల్యాండ్ గా మార్చాలని కోరుతూ హెచ్‌ఎండీఏ ప్లానింగ్ డైరెక్టర్ అప్పటి ఎంఏయూడీ స్పెషల్ సీఎస్ కు లేఖ రాశారు. 13 నెలల క్రితమే అర్జీదారు ప్రభుత్వానికి కన్వర్షన్ చార్జీలు చెల్లించినా ఇప్పటి వరకు ల్యాండ్ కన్వర్షన్ చేయలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలా ల్యాండ్ కన్వర్షన్ కోసం చేసుకున్న దరఖాస్తులను పెద్ద సంఖ్యలో పెండింగ్‌లో పెట్టారు.
ఏడాది గడిచినా తమ భూమిని కన్వర్షన్ చేయకపోవడంతో అర్జీదారు ఈనెల 17న ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ జి. చిన్నారెడ్డిని కలిసి తన గోడు చెప్పుకున్నారు. స్పందించిన చిన్నారెడ్డి సదరు అర్జీని పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టాలని కోరుతూ ఆ అర్జీపై ఎండార్స్ చేసి అదే రోజు ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపారు. సదరు దరఖాస్తును ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ తిప్పిపంపారు. ప్రజావాణి నుంచి అలా ఎంఏయూడీకి దరఖాస్తు వెళ్లడం.. అంతేవేగంగా సదరు అర్జీ వెనక్కి రావడం చకచకా జరిగిపోయాయి. ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు, వారి కుటుంబ సభ్యులు చెప్తే తప్ప ఎంఏయూడీలో ఫైళ్లు క్లియర్ చేయడం లేదనే ఆరోపణలకు ప్రజావాణి సిఫార్సును తిరుగుటపాలో పంపడం బలాన్ని చేకూరుస్తుంది.