నేను ఆఖరి రెడ్డి సీఎం అయినా ఓకే
కులగణనలో తప్పులు చేయలేదు : సీఎం రేవంత్ రెడ్డి

కొందరు అంటున్నట్టుగా తానే తెలంగాణకు ఆఖరి రెడ్డి సీఎం అయినా ఓకేనని.. కుల గణనలో ఎలాంటి తప్పులు చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన కుల గణన, ఎస్సీ వర్గీకరణపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ సందర్భంగా సీఎం మాట్లాడారు. తమ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టేందుకు క్రమశిక్షణ గల ముఖ్యమంత్రిగా తాను బాధ్యత తీసుకున్నానని.. ఇది తన నిబద్ధత అని చెప్పారు. తన కోసం, తన పదవి కోసం కుల గణన చేయలేదని.. త్యాగానికి సిద్ధపడే కులాల లెక్కలు పక్కగా తేల్చామన్నారు. కొందరు ఆరోపిస్తున్నట్టుగా కులగణనలో ఎలాంటి తప్పులు జరగలేదన్నారు. కులగణన సర్వేను తప్పుపడితే బీసీలు శాశ్వతంగా నష్టపోతారని హెచ్చరించారు. కులగణన సర్వే జరగకూడదని మోదీ, కేసీఆర్ కలిసి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. నరేంద్రమోదీ పుట్టుకతో బీసీ కాదని.. ఆయన గుజరాత్ సీఎం అయ్యాకే ఆయన కులాన్ని బీసీల జాబితాలో చేర్చారని చెప్పారు. ఆయన సర్టిఫికెట్ ప్రకారమే బీసీ అని.. మనస్తత్వం మాత్రం అగ్రకులానిదని చెప్పారు. కులాల లెక్కలు అధికారికంగా ఉంటే సుప్రీం కోర్టుకు చెప్పి ఒప్పించవచ్చన్నారు. కులగణనలో పాల్గొనాలని కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు ఇండ్ల ముందు మేలుకొలుపు డప్పు కొట్టాలని బీసీ సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. వాళ్లు సర్వేలో పాల్గొనకపోతే సామాజిక బహిష్కరణే శిక్ష అని హెచ్చరించారు.