Telugu Global
Telangana

స్థానిక సంస్థల ఎన్నికలపై నేడు కీలక సమావేశాలు

నోటాపై రాజకీయపార్టీలతో ఈసీ, ఎన్నికల సన్నద్ధతపై కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో సీఎం సమీక్ష

స్థానిక సంస్థల ఎన్నికలపై నేడు కీలక సమావేశాలు
X

రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం నేడు సమావేశం కానున్నది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నాయి. నేడు కీలక సమావేశాలు జరగబోతున్నాయి. ప్రధానంగా ఈసారి జరగబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ ఎన్నికల్లో నోటా ఉండాలా వద్దా అన్నది నేడు సమావేశంలో చర్చించనున్నారు. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో వార్డు సభ్యులనేవి ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నాయి. ఒకరే పోటీలో ఉన్నప్పుడు ఏకగ్రీవంగా ప్రకటించాలా? ఒకరితో పాటు నోటాన కూడా పెట్టి పోలింగ్‌ నిర్వహించాలా? అనే అంశంపై చర్చించనున్నారు. రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు నిర్దేశాల ప్రకారం కచ్చితంగా నోటా అనేది ఉండాలి అన్నది కొన్ని సంఘాలు, సామాజికవేత్తలు చెబుతున్నారు. కాబట్టి నోటా పెడితే ఏకగ్రీవం అయినా పోలింగ్‌ నిర్వహించాల్సి ఉంటుంది. అందుకే నోటా ఉండాలా వద్దా అన్నది రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని ఎన్నికల సంఘం తీసుకోనున్నది. ఇప్పటికే దీనిపై అభిప్రాయాలు తెలుపాలని నవంబర్‌లోనే ఎన్నికల సంఘం అన్నిపార్టీలకు లేఖ రాసింది. అయితే పార్టీల నుంచి స్పందన రాకపోవడంతో నేడు నేరుగా సమావేశం నిర్వహించాలని నిర్ణయించిది.

అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్‌ రెడ్డి, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి సీతక్క, సీఎస్‌ శాంతికుమారిలతో కలిసి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో నేడు సమీక్ష నిర్వహించనున్నారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఒక నివేదిక ఇచ్చింది. ఇందులో ఎస్సీ, ఎస్టీలు పోగా 50 శాతం మాత్రమే రిజర్వేషన్లు ఉండాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఎస్సీ , ఎస్టీలు పోగా మిగతావన్నీ బీసీలకు ఇవ్వాలని ప్రతిపాదించింది. అయితే దీన్ని గ్రామాలను యూనిట్‌గా తీసుకోవాలా? మండలాలను యూనిట్‌గా తీసుకోవాలా? రాష్ట్ర స్థాయిలో ఏఏ అంశాలను యూనిట్‌గా తీసుకోవాలనే అంశాలతో పాటు ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని సేకరించడానికి సీఎం నేడు కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. సమావేశం అనంతరం ఎన్నికలపై ఒక స్పష్టత వస్తుంది .అలాగే యంత్రాంగం కూడా పూర్తిస్థాయిలో సిద్ధమౌతున్నది. జిల్లా స్థాయిలో ఏర్పాట్లన్నీ ఏవిధంగా ఉండాలి? ఒకవేళ ఎన్నికల షెడ్యూల్‌ వస్తే ఓటర్‌ జాబితా, పోలింగ్‌ కేంద్రాలు, సిబ్బందికి అవసరమయ్యే శిక్షణ వంటివి ఏవిధంగా నిర్వహించాలి చర్చించనున్నారు. ముఖ్యంగా గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో ఏ విధంగా రిజర్వేషన్లు ఖరారు చేయాలనే అంశాలపై కలెక్టర్లతో ఎంసీహెచ్‌ఆర్‌డీలో కీలకమైన శిక్షణ శిబిరం కొద్దిసేపట్లో ప్రారంభం కానున్నది. నేడు కీలకమైన సమావేశాల తర్వాత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కీలక అజెండాతో పాటు రోడ్‌మ్యాప్‌ సిద్ధం కానున్నది. అలాగే సాయంత్రం ఆర్థికశాఖ, దేవాదాయ శాఖ అధికారులతో సీఎం సమావేశం కానున్నారు.

First Published:  12 Feb 2025 12:12 PM IST
Next Story