అక్రమ అరెస్టులు.. నిరుద్యోగుల వీపులు పగలగొట్టడమే రేవంత్ తెచ్చిన మార్పు
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ వద్ద మాజీ మంత్రి హరీశ్ రావు
అక్రమ అరెస్టులు.. నిర్బంధాలే రేవంత్ రెడ్డి తెచ్చిన మార్పు అని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. గురువారం ఉదయం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద తమ విధులకు హరీశ్ రావు ఆటంకం కలిగించారని చెప్తూ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆయనను పోలీస్ స్టేషన్‌లోనే నిర్బంధించారు. కాసేపట్లో బయటికి పంపిస్తామని ఒకసారి, రిమాండ్ చేస్తామని మరోసారి లీకులు ఇస్తూ కాలం వెళ్లదీశారు. చివరికి రాత్రి 8 గంటల సమయంలో ఆయనను ఠాణా నుంచి బయటకు పంపారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ బయట హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. బూటకపు హామీలు, మార్పు మార్పు అంటూ అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి అశోక్ నగర్‌లో నిరుద్యోగుల వీపులు పగలగొట్టిండు.. గిరిజనుల ఇండ్లపైకి అర్ధరాత్రి పోలీసులను పంపి అఘాయిత్యాలకు ఒడిగట్టిండు.. నిర్బంధాలు.. అక్రమ అరెస్టులతో ఇందిరమ్మ రాజ్యం అంటూ ఎమర్జెన్సీని తీసుకువచ్చాడని మండిపడ్డారు. ''పోలీసులను అతిగా ప్రయోగించిన ఏ ప్రభుత్వమూ నిలబడలేదని గుర్తుంచుకో రేవంత్ రెడ్డీ.. రాష్ట్రంలో ఇవాళ కేసులు, ఎఫ్ఐఆర్‌లు పోలీస్టేషన్‌లలో తయారవుత లేవు, గాంధీభవన్లో తయారవుతున్నయ్.. ఎవరిని అరెస్టు చేయాలో గాంధీభవన్ లోనే నిర్ణయిస్తున్నరు..'' అన్నారు.
రేవంత్ రెడ్డి శాశ్వతం కాదన్న విషయం పోలీసులు గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. ''రేవంత్ రెడ్డి సైకోలాగా ప్రవర్తిస్తున్నడు.. పగ, ప్రతీకారంతో శాడిస్టిక్ ప్రెషర్ తో పనిచేస్తున్నడు.. ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెట్టాలని టార్గెట్ పెట్టుకున్నడు.. ఏడాది పాలనలో కేసీఆర్ కట్టిన ఫ్లై ఓవర్లు, ఎస్టీపీలు, కాళోజీ కళాక్షేత్రం నువ్వు ప్రారంభిస్తున్నవు తప్ప, నీ ఏడాది పాలనలో ఒక భవనం కట్టినవా..'' అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజా పాలన కాదు, రాక్షస పాలన నడుస్తోందని.. అక్రమ అరెస్టులు తప్ప మరే గ్యారంటీ అమలవుతలేవన్నారు. దేశంలో ప్రతిపక్ష నాయకుడిని తనను ఎందుకు అరెస్టు చేస్తున్నారని రాహుల్ గాంధీ అంటున్నారని.. తెలంగాణలో సీఎం రేవంత్ అదే తరహాలో లగచర్లకు వెళ్తున్న శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారిని అరెస్టు చేయించారని గుర్తు చేశారు. ''రాహుల్ గాంధీ మాటలు చెప్పడం కాదు.. ముందు మీ ముఖ్యమంత్రిని బాగు చేయ్, లేదంటే మార్చెయ్.. లగచర్లకు ప్రతిపక్ష నాయకుడు మధుసూధనారి , పీఓడబ్లూ సంధ్య ఇతరులు పోతే నీ ప్రభుత్వం ఏం చేసింది.. వారిపట్ల దారుణంగా ప్రవర్తించి, అవమానించింది..'' అన్నారు.
ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదని.. అందుకే ఫ్రస్ట్రేషన్‌లో ఏది పడితే అది మాట్లాడుతున్నాడని అన్నారు. అధికారంలో ఉన్నన్ని రోజులు డబ్బులు సంపాదించాలే.. ప్రతిపక్షాల మీద కేసులు పెట్టాలే అనుకుంటున్నడు తప్ప పాలన చేయడం లేదన్నారు. ప్రతిపక్షం సలహాలు ఇవ్వాలని అడుగుతున్న రేవంత్.. తామిచ్చిన ఏ సలహాలు పాటించాడో చెప్పాలన్నారు. బాండ్ పేపర్లపై రేవంత్, భట్టి ఇద్దరు సంతకాలు చేసి హామీలిచ్చారని.. వాటిలో ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ డిమాండ్ చేసినట్టుగానే ఏడాదికి మూడుసార్లు రైతుబంధు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ''నీవొక ఫ్యాక్షనిస్టులా వ్యవహరిస్తున్నవు.. ఈ రాష్ట్రంలో చట్టం కాంగ్రెస్ పార్టీ చుట్టం అయిపోంది.. పోలీసులు, హోం గార్డుల సమస్యలు ఎందుకు పరిష్కరిస్త లేవు.. 7 నెలల నుంచి పోలీసులకు టీఏలు ఇస్తలేవెందుకు.. స్టేషన్ అలవెన్సులు ఇస్తలేవు, సీసీ కెమెరాలు బాగు చేస్తలేవు.. రైతులకు మద్దతు ధర లేదు, బోనస్ బోగస్ అయింది.. రుణమాఫీ సగం మందికి ఎగ్గొట్టినవు, రైతుబంధు ఎప్పుడిస్తవో చెప్పడం లేదు.. అవ్వా తాతలకు పింఛన్ పెంచి ఎందుకిస్తలేవు.. అసెంబ్లీలో మమ్మల్ని మాట్లాడనిస్తున్నవా.. కేసీఆర్ పేరెత్తకుండా నువ్వు ఉపన్యాసమిచ్చినవా.. నువ్వు మర్యాద లేకుండా బూతులు తిడితే మేం భరించాలా, నీకు సూచనలివ్వాలా..'' అని మండిపడ్డారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై అక్రమంగా కేసులు పెట్టి అరెస్టు చేయించారని తెలిపారు. అపాయింట్ మెంట్ తీసుకొని పోలీస్ స్టేషన్ కు వెళితే ట్రెస్ పాస్ ఎలా అవుతుంది.. అదేమన్నా ప్రైవేట్ ప్రాపర్టీయా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఇంట్లో చొరబడి, తలుపులు పగులగొట్టి ఎలా అరెస్టు చేస్తారని నిలదీశారు. ఉదయమే అరెస్టు చేస్తే ఇప్పటి వరకు కోర్టులో ఎందుకు ప్రవేశపెట్టలేదని ప్రశ్నించారు. ''కౌశిక్ మీద ఏ సెక్షన్లు పెట్టాల్నో గాంధీ భవన్ నుంచి, సీఎం రేవంత్ నుంచి పోలీసులకు ఇంకా ఆదేశాలు రాలేదా.. అందుకే ఈ ఆలస్యం చేస్తున్నారా.. ఇది ప్రజా పాలన కాదు, రాక్షసపాలన, పోలీసు పాలనగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలను, మహిళలను అరెస్టు చేశారు. వాళ్లందరినీ వెంటనే విడుదల చేయాలి.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని బేషరతుగా విడుదల చేయాలి.. పోలీసులు రాజ్యాంగానికి లోబడి, చట్టానికి లోబడి పనిచేయాలని కోరుతున్నాం.. కౌశిక్ రెడ్డిని విడుదల చేసే వరకూ బీఆర్ఎస్ పార్టీ నిద్రపోదు'' అని తేల్చిచెప్పారు.