చట్టం అందరికీ సమానమే అయితే రేవంత్ సోదరులను ఎందుకు అరెస్టు చెయ్యలే
వాళ్లను కనీసం పోలీస్ స్టేషన్ కు పిలవలేరా : మాజీ మంత్రి హరీశ్ రావు
చట్టం అందరికీ సమానమే అనేది నిజమైతే కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్యకు కారకులైన రేవంత్ రెడ్డి సోదరులను ఎందుకు అరెస్టు చేయడం లేదని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్‌ను ఆయన గురువారం కిమ్స్ ఆస్పత్రిలో పరామర్శించారు. అనంతరం హాస్పిటల్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకునే ముందు రాసిన లేఖలో రేవంత్ సోదరుల గురించి రాశారని.. వాళ్లను పోలీసులు ఇప్పటి వరకు కనీసం పోలీస్ స్టేషన్ కు కూడా పిలువలేదన్నారు. సినీ ఇండస్ట్రీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య చర్చల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో అందరికీ తెలుసన్నారు. ప్రేమానురాగాలతో మనసులు గెలవాలే తప్ప భయాందోళనలు సృష్టించి కాదన్నారు. శ్రీతేజ్‌ను కేసీఆర్ సూచనతో పరామర్శించామని చెప్పారు. శ్రీతేజ్ కోలుకుంటున్నారని, వైద్యానికి స్పందిస్తున్నారని డాక్టర్లు చెప్పారన్నారు. తొక్కిసలాటలో మృతిచెందిన రేవతి మరణానికి ప్రగాఢ సానుభూతి చెప్తున్నామన్నారు.
చిన్నారి పరామర్శకు వచ్చి రాజకీయాలు మాట్లాడటం మంచిది కాదని.. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై నెపం నెడుతున్న నేపథ్యంలో మాట్లాడక తప్పడం లేదన్నారు. సంధ్య థియేటర్ ఘటన జరిగిన పది రోజులకు సీఎం ,మంత్రులు స్పందించారని గుర్తు చేశారు. గురుకులాల్లో చనిపోతున్న పిల్లల కుటుంబాలను రేవంత్ రెడ్డి, ఆయన మంత్రివర్గం ఎందుకు పరామర్శించలేదో చెప్పాలన్నారు. గురుకులాల పిల్లల మాతృ మూర్తుల శోకాన్ని సీఎం ఎందుకు గుర్తించడం లేదని నిలదీశారు. అంతకుముందు నిమ్స్ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మాజీ ఎంపీ మందా జగన్నాథం ను హరీశ్ రావు పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, బండారు లక్ష్మారెడ్డి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు.