Telugu Global
Telangana

రేవంత్ రెడ్డికి కాదు ఆయన తాతకు కూడా భయపడను

పసలేని పనికిమాలిన కేసులు పెడుతున్నరు : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

రేవంత్ రెడ్డికి కాదు ఆయన తాతకు కూడా భయపడను
X

రేవంత్‌ రెడ్డికి కాదు.. ఆయన తాతకు కూడా భయపడబోనని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. సోమవారం తెలంగాణ భవన్‌ లో ఆయన మీడియాతో చిట్‌ చాట్‌ చేశారు. తనపై పసలేని. పనికిమాలిన కేసులను ప్రభుత్వం పెడుతుందన్నారు. అవినీతే లేనప్పుడు అవినీతి నిరోధక శాఖ పేరుతో కేసులు పెడుతున్నారని, ఎన్ని అక్రమ కేసులు పెట్టిన న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు. ప్రభుత్వ నిర్ణయంగా, మంత్రిగా నిధుల చెల్లింపుపై తాను నిర్ణయం తీసుకున్నాననే మాటకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. ఈ కేసులో అవినీతి జరగలేదని మంత్రి పొన్నం ప్రభాకర్‌ చెప్పారని.. ఎక్కడ అవినీతి జరిగిందని అడిగితే ముఖ్యమంత్రి చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాడని చెప్పారు. ఫార్ములా ఈ ప్రతినిధి రేవంత్‌ ను కలిసిన ఫొటోను తాను బయట పెట్టడంతో అధికారులను సీఎం బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నాడని, సస్పెండ్‌ చేస్తానని బెదిరిస్తున్నాడని తెలిపారు. వాళ్లను కలిసిన విషయం రేవంత్‌ ఎందుకు ఏడాది పాటు దాచి ఉంచాడని, వాళ్లపై ఎందుకు కేసులు పెట్టలేదని ప్రశ్నించారు. తాను ఫార్ములా ఈ ప్రతినిధుల నుంచి డబ్బులు తీసుకొపని అనుచిత లబ్ధిపొందానని ఆరోపణలు చేస్తున్న రేవంత్‌ రెడ్డి ఆ సంస్థపై కేసులకు ఎందుకు వెనుకాడుతున్నాడో చెప్పాలన్నారు.

ఫార్ములా - ఈతో ఒప్పందం రద్దు చేసుకోవడానికి కేబినెట్‌ అనుమతి ఉందా అని ప్రశ్నించారు. ఇందులో రూ.600 కోట్ల అవినీతి అని సీఎం అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ప్రొసీజర్‌లో పొరపాట్లు ఉంటే సంబంధిత సంస్థ దగ్గరికి వెళ్లాలే తప్ప అవినీతి కేసులతో సాధించేది ఏమిటో చెప్పాలన్నారు. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్‌ పేరు ప్రతిష్టలు నిలిపేందుకే ఫార్ములా -ఈ సంస్థకు డబ్బులు చెల్లించామన్నారు. ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌నే కొట్టేయాలని తాను కోర్టును ఆశ్రయించానని, అదే ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడీ కేసులు పెట్టిందని చెప్పారు. తనకు ఈడీ నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమేనన్నారు. ఎఫ్‌ఐఆర్‌ ను హైకోర్టు కొట్టేస్తే ఏం జరుగుతుందో చూడాలన్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు టోల్‌ టెండర్ల లీజ్‌ ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అవినీతి జరిగినప్పుడు ఎందుకు అగ్రిమెంట్‌ రద్దు చేయడం లేదో చెప్పాలన్నారు. తనను జైలుకు పంపాలని రేవంత్‌ రెడ్డి అనేక ప్రయత్నాలు చేశారని, కానీ ఏ ఒక్కటి ఫలించలేదన్నారు. కేసులు అనుమానాల మీద నిలబడవని.. ఆధారాలు ఉంటేనే నిలబడుతాయన్నారు. రేవంత్‌ చెప్తోన్న అబద్ధాలను మీడియా యథాతథంగా ప్రచురిస్తుందన్నారు. అసెంబ్లీలోనూ అబద్ధాలు మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌ ఒక్కరేనన్నారు.

ఏడాదిగా ప్రతికూల రాజకీయ పరిస్థితులు ఉన్నా విజయవంతంతగా పూర్తి చేసుకున్నామని తెలిపారు. కాంగ్రెస్‌ కార్యకర్తలే తమ ప్రభుత్వంపై సంతృప్తితో లేరని చెప్పారు. ప్రజలను మోసగించాలనే కుట్రలతోనే కాంగ్రెస్‌ కొత్త సంవత్సరాన్ని ప్రారంభించబోతుందని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ గడిచిన ఏడాదిని ఎన్నికల ధోకా నామ సంవత్సరంగా చెప్తే బాగుంటుందని అన్నారు. గ్యారంటీలు, హామీలు శాపాలై కాంగ్రెస్‌ పార్టీకి చుట్టుకోబోతున్నాయని తెలిపారు. రైతు భరోసా ఎవరికి ఇవ్వాలనే విషయంలో ప్రభుత్వానికే స్పష్టత లేదన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.72 వేల కోట్లను సాఫీగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిందని తెలిపారు. ఒక్క పంటకే రైతుభరోసా ఇవ్వాలని, పోడు భూములు సహా రెండో పంట సాగు చేయని రైతులకు నగదు సాయాన్ని ఎగవేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. కోర్టు కేసుల పేరు చెప్పి బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా తప్పించుకోవాలని చూస్తోందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ మోసాలను ప్రజాఉద్యమాలతో ప్రజల ముందు పెడుతామన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ సంతాపం కోసం అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తే తాము సమర్థించామని, తెలంగాణ బిడడ్డ పీవీకి ఢిల్లీలో స్మారకచిహ్నం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశామన్నారు. హామీలు అమలు చేసే వరకు ఈ ప్రభుత్వం వెంట పడుతామన్నారు.

త్రీడీ అంటే.. డిస్ట్రక్షన్‌, డిస్ట్రాక్షన్‌, డైవర్షన్‌ ఈ మూడు విధానాలే ఈ ప్రభుత్వ విధానమన్నారు. హైడ్రా పేరుతో విధ్వంసానికి పాల్పడ్డారన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి నీళ్లు.. నిధులు.. నియామకాలు నినాదాలు అయితే కేడీ ముఖ్యమంత్రి త్రీడీ ఫార్ములా ఇంకోలా ఉందన్నారు. రేవంత్ రెడ్డి ప్రజల కోసం కాకుండా అల్లుడి కోసం అన్నదమ్ముల కోసం బావమరిది కోసం పనిచేస్తున్నాడని తెలిపారు. ప్రజలతో పాటు సోషల్ మీడియా కార్యకర్తలపై ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టడానికే ఈ ప్రభుత్వానికి సంవత్సర కాలం గడిచిపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి, అరాచకాలను ఢిల్లీ సాక్షిగా ఎండగట్టామన్నారు. సివిల్‌ సప్లయీస్‌ స్కాం, అమృత్‌ టెండర్ల కుంభకోణం, మంత్రి పొంగులేటిపై ఈడీ దాడి తదితర అంశాల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రేవంత్‌ రెడ్డికి రక్షణగా నిలుస్తూ కాపాడుతోందన్నారు. కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు రేవంత్‌ కు రక్షణ గోడగా అడ్డుగా నిలుస్తున్నారని తెలిపారు. 2025లో పార్టీని మరింత బలోపేతం చేస్తామని, సభ్యత్వ నమోదు చేపడుతామని, కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. పార్ట అధ్యక్షుడిని ఎన్నుకుంటామని తెలిపారు. బూత్‌ నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని బలోపేతం చేస్తామన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామన్నారు. టీచర్‌, గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రిపుల్‌ ఆర్‌ కోసం చేసిందేమి లేదన్నారు. ఒక్క ప్రాజెక్టు కూడా చేపట్టకుండానే ఏడాదిలో రూ.1.39 లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. ఏడాదిలో ఇంత భారీ మొత్తం అప్పు చేయడం దేశంలోనే ఒక రికార్డ్‌ అన్నారు. మిగుల్‌ బడ్జెట్‌ ఉన్న రాష్ట్రాన్ని ఇలా అప్పుల పాలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాసమస్యలపై నుంచి డైవర్షన్‌ కోసమే సినిమా వాళ్లపై రేవంత్‌ రెడ్డి మాట్లాడరని, ఆయనకు చిత్తశుద్ధి ఉంటే గురుకులాల్లో చనిపోయిన విద్యార్థుల గురించి, ఆటోడ్రైవర్ల కుటంబాలకు ఎక్స్‌ గేషియా చెల్లింపుల గురించి మాట్లాడాలన్నారు. ఒక్క ఘటనను అడ్డం పెట్టుకొని సినిమా వాళ్ల నుంచి సెటిల్మెంట్‌ చేసుకొని ఇప్పుడు సైలెంట్‌గా ఉన్నాడన్నారు. మృతిచెందిన హాస్టళ్లు, గురుకులాల విద్యార్థలతో పాటు ఆత్మహత్యలు చేసుకున్న, వివిధ కారణాలతో చనిపోయిన ఆటోడ్రైవర్ల కుటుంబాలకు ప్రభుత్వం రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

First Published:  30 Dec 2024 3:49 PM IST
Next Story