Telugu Global
Telangana

ప్రగతి పరుగులపై హైడ్రా వేటు!

గణనీయంగా పడిపోయిన రాష్ట్ర ఆదాయం

ప్రగతి పరుగులపై హైడ్రా వేటు!
X

తెలంగాణ ప్రగతి పరుగులపై హైడ్రా బుల్డోజర్‌ వేటు వేసింది. రియల్‌ ఎస్టేట్‌ రంగం కుదేలవడంతో రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయింది. స్టేట్‌ ఓన్‌ రెవెన్యూ, సెంట్రల్‌ ట్యాక్సెస్‌లో షేర్‌, ట్యాక్స్‌ రెవెన్యూ, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌, నాన్‌ ట్యాక్స్‌ రెవెన్యూ కలుపుకుంటే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో ఖజానాకు చేరింది రూ.1,12,307.30 కోట్లు మాత్రమే. కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్) కు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ఆదాయ వ్యయ గణాంకాల్లో ఆర్థిక పరిస్థితి దిగజారుతున్నట్టు తేటతెల్లమైంది. హైడ్రా పేరుతో నిర్మాణం పూర్తయిన రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులను కూల్చేయడం, ఎఫ్‌టీఎల్‌.. బఫర్‌ జోన్‌లలో ఉన్న అన్ని నిర్మాణాలు కూల్చేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి స్వయంగా ప్రకటించడంతో తెలంగాణలో రియల్‌ ఎస్టేట్‌ రంగం గణనీయంగా దెబ్బతిన్నది. మూసీ బ్యూటిఫికేషన్‌ పేరుతో కూల్చివేతలు సామన్యుల్లో కంగారు పుట్టించాయి. ప్రభుత్వ చర్యలతో మధ్య తరగతి ప్రజలు రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడి అంటేనే హడలెత్తిపోయే పరిస్థితిని రేవంత్‌ సర్కారు కల్పించింది. రియల్‌ ఎస్టేట్‌ అంటే ఒక్క ప్లాట్లు, భూముల అమ్మకాలు మాత్రమే కాదు.. నిర్మాణ రంగం కూడా హైడ్రా వేటుకు తల్లడిల్లిపోతోంది. దాని పర్యావసనం రాష్ట్ర ఆదాయంపై ప్రస్ఫుటంగా పడింది.

2023 -24 ఆర్థిక సంవత్సరంలో మొదటి తొమ్మిది నెలలు అంటే ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ వరకు రూ.1,25,022.72 కోట్ల ఆదాయం సమకూరితే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల్లో వచ్చిన ఆదాయం రూ.1,12,307.30 కోట్లకు తగ్గింది. అంటే 2024 -25 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ నాటికి రాష్ట్ర ఆదాయం రూ.12,694.42 కోట్లు ఆదాయం తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రిసీట్స్‌ రూ.2,21,242.23 కోట్లుగా బడ్జెట్‌ లో అంచనా వేశారు. 2022 -23 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రెవెన్యూ రాబడి రూ.1,59,350.30 కోట్లు కాగా, 2023 -24 ఆర్థిక సంవత్సరంలో రూ.1,78,172.95 కోట్లకు పెరిగింది. నిరుడు చివరి మూడు నెలల్లో రూ.53 వేల కోట్ల ఆమ్దానీ రాష్ట్ర ఖజానాకు సమకూరింది. ఈలెక్కన చూసుకున్నా రెవెన్యూ రిసీట్స్‌ రూపంలో రాష్ట్ర ఆదాయం రూ.1.65 లక్షల కోట్లు దాటే అవకాశమే లేదు. అంటే నిరుటితో పోల్చినా రూ.13 వేల కోట్ల ఆదాయం తగ్గే అవకాశం ఉంది. 2023 -24 ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం కోట్లు రూ.10,654 కోట్లు కాగా ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో రూ.7,524.42 కోట్లు మాత్రమే వచ్చింది. నిరుటితో పోల్చితే ఏకంగా రూ.3,129.58 కోట్ల ఆదాయం తగ్గిపోయింది. స్టాపుంలు, రిజిస్ట్రేషన్ల ద్వారా 2023 - 24లో రెవెన్యూ రాబడి డిసెంబర్‌ నాటికి 57.59 శాతంగా ఉండగా, ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి 41.28 శాతానికి పడిపోయింది. జీఎస్టీ రూపంలో రాష్ట్ర ఖజానాకు రూ.37,664.91 కోట్లు, సేల్స్‌ ట్యాక్స్‌ రూపంలో రూ.24,035.11 కోట్లు, స్టేట్‌ ఎక్సైజ్‌ డ్యూటీస్‌ రూపంలో రూ.14,078.39 కోట్లు, సెంట్రల్‌ ట్యాక్సెస్‌లో స్టేట్‌ షేర్‌ రూపంలో రూ.12,785.95 కోట్లు, అదర్‌ ట్యాక్సెక్స్‌ అండ్‌ డ్యూటీస్‌ రూపంలో 5,958.88 కోట్లు, నాన్‌ ట్యాక్స్‌ రెవెన్యూ రూపంలో 5,487.88 కోట్లు, సెంట్రల్‌ గ్రాంట్స్‌ రూపంలో రూ.4,771.44 కోట్ల ఆదాయం సమకూరింది. జీఎస్టీ, సేల్స్‌ ట్యాక్స్‌, ఎక్సైజ్‌ శాఖల ఆదాయం లేకపోతే రాష్ట్ర ఆమ్దానీ మరింత క్షీణించేది.

2024 -25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు అతి ఎక్కువగా ఆదాయం సమకూరింది అప్పుల రూపంలోనే.. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.59,625.21 కోట్ల అప్పు తీసుకుంటామని బడ్జెట్‌లో ప్రతిపాదించగా ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ నాటికే రూ.48,178.93 కోట్ల అప్పులు తీసుకున్నారు. గతంలో తీసుకున్న అప్పుల వడ్డీల చెల్లింపునకు తొమ్మిది నెలల్లో రూ.19,556.61 కోట్లు ఖర్చు చేశారు. ఉద్యోగుల జీతాలు చెల్లించడానికి 31,584.35 కోట్లు, పెన్షన్లకు 12,585.37 కోట్లు, సబ్సిడీల చెల్లింపునకు రూ.9,701.50 కోట్లు ఖర్చు చేశారు. స్టేట్‌ ఓన్‌ రెవెన్యూ, జీఎస్టీ, కేంద్ర పన్నుల్లో వాటా, అప్పుల రూపంలో మొత్తంగా రాష్ట్ర ఖజానాకు ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ వరకు రూ.1,60,518.11 కోట్ల ఆదాయం సమకూరగా అందులోగా రూ.1,57,404.54 కోట్లు వివిధ రూపాల్లో ఖర్చు చేశారు. 2024 -25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్‌ రూ.2,75,890.69 కోట్లుగా ప్రతిపాదించారు. గత ప్రభుత్వం వాస్తవాలకు దూరంగా బడ్జెట్‌ ప్రవేశపెట్టిందని.. తాము వాస్తవిక బడ్జెట్‌ ప్రవేశ పెడుతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభిస్తూనే చెప్పారు. గవర్నర్‌ ప్రసంగంలోనూ ఇదే అంశాన్ని స్ట్రెస్‌ చేసి చెప్పారు. కానీ ఏ లెక్కన చూసుకున్నా ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలల్లో రూ.1.25 కోట్ల ఆదాయం రాబట్టడం ఆచరణ సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. బడ్జెట్‌ బయట అవతల అప్పులు చేయడం, రాష్ట్ర సంపదను తాకట్టుపెట్టి సంక్షేమ పథకాలు అమలు చేయడం తప్ప రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇంకో మార్గం కూడా కనిపించడం లేదు. పదేళ్ల పాటు పరుగులు పెట్టిన రాష్ట్ర ఖజానా హైడ్రా వేటుకు విలవిల్లాడుతున్నా ప్రభుత్వం నిస్సిగ్గుగా రాష్ట్రానికి మస్తుగా ఆదాయం వస్తోందని చెప్తూ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది.

First Published:  24 Jan 2025 4:07 PM IST
Next Story