బీసీల జనాభా ఎలా తగ్గింది.. ప్రభుత్వం సమాధానం చెప్పితీరాలి
అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేటీఆర్
రాష్ట్రంలో బీసీల జనాభా ఎలా తగ్గిందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ నిలదీశారు. మంగళవారం అసెంబ్లీలో సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుల సర్వేపై చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీకి అనుగుణంగా స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ అమలు చేయడానికి అసెంబ్లీ ప్రత్యేక శాసనసభ సమావేశాల్లో బిల్లు తెస్తారేమోనని రాష్ట్రంలోని బలహీనవర్గాల సోదరులు అనుకున్నారని తెలిపారు. కానీ వారి నమ్మకాన్ని ఈ ప్రభుత్వం వమ్ము చేసిందన్నారు. ఈ రోజు సభలో సీఎం తన స్టేట్‌మెంట్‌లో వెల్లడించిన వివరాలనే కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారని.. ఆ వివరాలు చెప్పడానికే అయితే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఎందుకని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన రోజు ప్రజలు తమ వివరాలు వెల్లడించొద్దని ఈరోజు సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డినే ప్రజలకు పిలుపునిచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుల సర్వే పేరుతో 57 రకాల వివరాలు ఇవ్వాలని కోరితే ప్రజలు ఆ వివరాలు ఎలా ఇస్తారని.. కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం లేకనే పలువురు సర్వేకు దూరంగా ఉన్నారని అన్నారు.
సమగ్ర కుటుంబ సర్వే ఎక్కడుందని సీఎం అంటున్నారని.. ప్రభుత్వ వెబ్‌సైట్ నుంచే దానిని తీసుకొని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడరని చెప్పారు. సమగ్ర కుటుంబ సర్వేలో కోటి మూడు లక్షల 95 వేల కుటుంబాలు పాల్గొన్నాయని, మూడు కోట్ల 68 లక్షల మంది ప్రజలు తమ వివరాలు వెల్లడించారని తెలిపారు. ఒక్క రోజులోనే రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటికి ఎన్యూమినేటర్స్ వెళ్లి అద్భుతంగా సర్వే చేశారని తెలిపారు. సీఎం అసెంబ్లీని మిస్ లీడ్ చేస్తూ మాట్లాడుతున్నారని అన్నారు. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం బీసీల సంఖ్య ఒక కోటి 85 లక్షల 61 వేల 856 మంది అని.. అంటే 51 శాతం మంది బీసీలని తెలిపారు. ముస్లింలలోని 10 శాతం బీసీలను కూడా కలుపుకుంటే సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం తెలంగాణలోని బీసీల సంఖ్య 61 శాతమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీనే ఈ ప్రభుత్వ సర్వే రిపోర్టును తగలబెట్టండి అని చెప్తున్నారు.. ఇంకా గలీజుగా మాట్లాడారని గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాలు తమ జనాభా 51 శాతం నుంచి 46 శాతం ఎలా అయ్యిందని ప్రశ్నిస్తున్నారని.. ఒక కోటి 64 లక్షలకు బీసీ జనాభా ఎలా తగ్గిందని నిలదీస్తున్నారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఒక్కరే కాదు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కూడా బయట ఇదే ప్రశ్న అడుగుతున్నారని చెప్పారు. బీసీ రిజర్వేషన్లు పెంచే బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా ఏదో ఒక స్టేట్‌మెంట్ చదివేసి ఇదేదో చారిత్రాత్మకం అని చెప్పుకోవడం ఏమిటని నిలదీశారు. ఈ ప్రభుత్వ చర్యలను బీసీలు ఎప్పటికీ ఒప్పుకోబోరన్నారు.