డిప్యూటీ సీఎం భట్టికి హరీశ్ రావు చాలెంజ్
అబద్ధాలపై స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామాకు సిద్ధమా అని సవాల్
అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మాజీ మంత్రి హరీశ్ రావు చాలెంజ్ విసిరారు. అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం చెప్పినవి అబద్ధాలని తాను నిరూపిస్తానని.. అది తప్పని నిరూపిస్తే ఇక్కడే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. డిప్యూటీ సీఎం అబద్ధాలు చెప్పినందుకు రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. రాష్ట్ర అప్పులపై గురువారం అసెంబ్లీలో జరిగిన లఘు చర్చ సందర్భంగా హరీశ్ రావు డిప్యూటీ సీఎం ప్రస్తావించిన అంశాలకు సుదీర్ఘంగా సమాధానం ఇచ్చారు. ''ఫామ్ మెకనైజేషన్, డ్రిప్, స్ప్రింక్లర్లకు మేం ఒక్క రూపాయి ఇవ్వలేదని డిప్యూటీ సీఎం అన్నారు.. రైతులకు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టలేదన్నారు. గురుకుల విద్యార్థుల మెస్ చార్జీలు ఒక్కసారి కూడా పెంచలేదు అని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారు. ఈ అసెంబ్లీ సాక్షిగా నేను ఛాలెంజ్ విసురుతున్నాను. మేం ఇవ్వలేదని మీరు రుజువు చేస్తే ఇక్కడే స్పీకర్ ఫార్మాట్లో నేను నా రాజీనామా ఇచ్చి వెళ్లిపోతాను.. మీరు అబద్ధం చెప్పినట్టయితే, మీరు కూడా స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేయాలి. మెస్ చార్జీలు మేం పెంచింది నిజం, డ్రిప్, ఫామ్ మెకనైజేషన్ కు డబ్బులు ఇచ్చింది నిజం. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బీమాకు 2018 -19లో – రూ. 883 కోట్లు, 2019- 20లో రూ.950 కోట్లు, 2020-21లో- రూ.1456 కోట్లు, 2021-22లో - రూ.1166 కోట్లు, 2022-23లో రూ.1139 కోట్లు కట్టింది. ఆర్థికమంత్రి భట్టి సభను పక్కదారి పట్టించే విధంగా మాట్లాడకూడదు..'' అన్నారు.
కాంగ్రెస్ గోరంతలను కొండతలు చేసి గోబెల్స్ ప్రచారం చేస్తోందని, బీఆర్‌ఎస్ హయాంలో చేసిన అప్పులు రూ.4.17 లక్షల కోట్లేనని తేల్చిచెప్పారు. శ్వేతపత్రంలో 6.71 లక్షల కోట్లు అనేది అబద్ధమన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలోనూ అదే తీరు అన్నారు. ''మేం మాట్లాడుతుండగా అధికార పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను దొంగ దొంగ అని అనడం పద్ధతి కాదు. శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు దీన్ని మీరు సమర్థిస్తారా? ప్రభుత్వ ఆస్తులు అమ్మడం లేదు అని ఆర్ధికమంత్రి చెప్పారు. 2024 జూన్ 26న రంగారెడ్డి జిల్లాలో గచ్చిబౌలి సర్వే నెంబర్ 25లో ఉన్న 400 ఎకరాల భూమిని ఎకరా రూ.75 కోట్ల చొప్పున రూ. 30 వేల కోట్లకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అమ్మింది. ఇదే భూమిపై టీజీఐఐసీ రూ.20 వేల కోట్లు అప్పు తెచ్చేందుకు కాళ్లకు బలపం కట్టుకొని తిరుగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నేరుగా అమ్మకుండా టీజీఐఐసీ ద్వారా భూములు అమ్మే ప్రయత్నం చేస్తుందని చెప్పకనే చెప్పారు..'' అన్నారు. ''ఆర్థిక మంత్రి రెండు రూపాల్లో సభను నడిపారు. ఒకటి గతంలో సభలో పెట్టిన శ్వేత పత్రంపై, రెండోది ఆర్బీఐ రిపోర్ట్ పై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన ఫైనాన్స్ వైట్ పేపర్లో బీఆర్ఎస్ హయాంలో 6,71,756 కోట్ల అప్పులు చేసిందని చెప్పారు. ఈ రోజు కూడా సభలో మీరు పెట్టిన రిపోర్టులో కూడా ఏడాది కాంగ్రెస్ పాలనలో రూ. 1,27,208 కోట్లు కాంగ్రెస్ అప్పు చేసిందని చెప్పారు. మొదటి ఆర్థిక సంవత్సరమే రూ. 1,27,208 కోట్లు అప్పు చేశారంటే.. ఐదేళ్లలో రూ. 6 లక్షల 38వేల కోట్ల అప్పు అవుతుంది. ఎఫ్ ఆర్ బీ ఎం లిమిట్ పెరిగితే ఐదేళ్లలో ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తామని మీరు పెట్టిన రిపోర్టు ఆధారంగానే ఒప్పుకున్నారు..'' అని వివరించారు.
2014లో రెవెన్యూ మిగులు రూ. 369 కోట్లు ఉంటే, 2022 - 23లో మిగులు రూ. 5,994 కోట్లకు పెరిగిందని, 2023 -24 బడ్జెట్‌లో రెవెన్యూ మిగులు రూ.1,704 కోట్లు అని డిప్యూటీ సీఎం ఇదే సభలో చెప్పారని గుర్తు చేశారు. తాము రెవెన్యూ సర్ ప్లస్‌గానే రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పజెప్పామన్నారు. 2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు రాష్ట్ర బడ్జెట్ రూ. 68 వేల కోట్లు ఉంటే దశ దిశ లేని రాష్ట్రాన్ని దేశంలో అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి. రూ. 2 .93 లక్షల కోట్లకు బడ్జెట్ పెంచి మీకు అప్పజెప్పామన్నారు. 2014 స్టేట్ ఓన్ రెవెన్యూ రూ.35,770 కోట్లు మాత్రమేనని 2023లో దానిని రూ. 1,53,837 కోట్లకు పెంచామన్నారు. 2014లో రెవెన్యూ ఎక్సపెండిచర్ రూ.62 వేల కోట్లు ఉంటే.. 2022 -23లో 2,04,085 కోట్లకు పెంచామన్నారు. పర్ క్యాపిటా ఇన్‌కం 2014లో రూ.1.24 లక్షలు ఉంటే రూ.3,56,564 కోట్లకు పెంచామన్నారు. జీసీడీపీని రూ.4.51 లక్షల కోట్ల నుంచి రూ.15.10 లక్షల కోట్లకు పెంచామన్నారు. కరోనాతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిన లాంటి ప్రత్యేక పరిస్థితులను ఎదుర్కొన్నామని గుర్తు చేశారు. 2020- 21లో రూ.17,568 కోట్లు, 2021-22లో రూ. 10,724 కోట్లు ప్రత్యేకంగా అప్పు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ఉదయ్ స్కీం పేరుతో కేంద్రం బలవంతంగా రుద్దిన అప్పు రూ.9 వేల కోట్లు అని, కేంద్రం కరోనా సమయంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా రాష్ట్రంపై అదనంగా రూ.40 వేల కోట్ల అప్పుల భారం పడిందన్నారు.
రూ.6.71 లక్షల కోట్ల అప్పులో ఉమ్మడి రాష్ట్రం నుండి తెలంగాణకు వారసత్వంగా వచ్చిన అప్పు రూ. 72,658 కోట్లు అని, ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన అప్పులు ఇంకో రూ.15 వేల కోట్లు అని వివరించారు. 2023 డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేసిన రూ.15,118 కోట్ల అప్పును కూడా బీఆర్‌ఎస్ ఖాతాలోనే వేశారని తెలిపారు. రూ.99,385 కోట్ల అప్పును బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేయకున్నా తమపై రుద్దుతున్నారని తెలిపారు. ఎఫ్‌ఆర్‌బీఎం అప్పు రూ. 3,89,673 కోట్లు, కార్పొరేషన్‌ల అప్పులు రూ. 1,27,208 కోట్లు, గవర్నమెంట్ గ్యారెంటీ లోన్స్, కట్టాల్సిన అవసరం లేనివి రూ. 95 వేల కోట్లు. గవర్నమెంట్ గ్యారెంటీ ఇవ్వనిది, గవర్నమెంట్ కట్టాల్సిన అవసరం లేనివి రూ. 59 వేల కోట్లు అప్పులు ఉన్నాయని తెలిపారు. గవర్నమెంట్ కట్టాల్సిన అవసరం లేని అప్పులే 1,54,876 కోట్లు అని వివరించారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు రూ.4,08,902 కోట్లు ఇచ్చామని, ఇందులో ఒక్క రైతుబంధుకే రూ.73,162 కోట్లు, రుణమాఫీకి రూ.28 వేల కోట్లు, రైతుబీమాకు రూ.5,465 కోట్లు, విద్యుత్ సబ్సిడీల కోసం రూ.65 వేల కోట్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూ.2.37 లక్షల కోట్లు ఖర్చు చేశామన్నారు. అందుకే ఈ రోజు రాష్ట్రం వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందిందన్నారు. తెలంగాణ వచ్చిన నాటు 68 లక్షల టన్నుల వరి పండితే ఇప్పుడు 1.68 లక్షల కోట్ల టన్నులకు పెరిగిందన్నారు. సాగు విస్తీర్ణం 1.31 లక్షల ఎకరాల నుంచి 2.28 లక్షల కోట్ల ఎకరాలకు పెరిగిందన్నారు.
ఔటర్ రింగురోడ్డు పైన తాను విచారణ కోరుకున్నా విచారణ చేస్తామని ముఖ్యమంత్రి లేచి చెప్పారు. విచారణకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ముఖ్యమంత్రి ఎంత కన్వీనెంట్‌గా మాట మారుస్తారనేది అసెంబ్లీ సాక్షిగా ఈ రోజు రుజువైందన్నారు. డిప్యూటీ సీఎం పదేపదే లేచి ఓఆర్ఆర్ అమ్ముకున్నారని అంటే ఆ ఒప్పందాన్ని రద్దు చేయండి అని కోరామన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పులు చేసి రాష్ట్ర ఆస్తులను పెంచిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులను గతంలో తాము కట్టామన్నారు. తొమ్మిదిన్నరేండ్లలో అప్పులు, మిత్తీలకు రూ.3 లక్షల కోట్లు చెల్లించామన్నారు. నిరుద్యోగం, పేదరికాన్ని బీఆర్‌ఎస్ ప్రభుత్వం గణనీయంగా తగ్గించిందన్నారు. తలసరి ఆదాయం, జీఎస్‌డీపీ, భారీగా పెంచామన్నారు. అన్ని రంగాలకు నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇచ్చామన్నారు. ''ప్రశ్నించే గొంతులను నొక్కి అక్రమ కేసులు పెట్టడమే కాంగ్రెస్ ప్రభుత్వ నైజంగా మారింది.. ఈ రాష్ట్రం కోసం పనిచేసిన కేటీఆర్ పైన మీరు తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. • సభలో వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తుంటే, మీరు దాన్ని డైవర్షన్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు.. రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు జలయజ్ఞాన్ని ధన యజ్ఞం అని ఆరోపించారు.. కేటీఆర్ రాష్ట్ర ఇమేజ్ పెంచేందుకు ఫార్ములా కార్ రేసింగ్ తీసుకువచ్చారు.. ఈ మొత్తం వ్యవహారం పారదర్శకంగా జరిగింది.. ప్రభుత్వం చెప్తున్నదే నిజమని అనుకుంటే అసెంబ్లీ చర్చ పెట్టి వాస్తవాలు చెప్పండి..'' అని డిమాండ్ చేశారు.