Telugu Global
Telangana

ప్రజలకు ఆరోగ్య శ్రీ వైద్యం అందకుండా చేస్తారా

సీఎం రేవంత్‌ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఫైర్‌.. బహిరంగ లేఖ

ప్రజలకు ఆరోగ్య శ్రీ వైద్యం అందకుండా చేస్తారా
X

తెలంగాణ ప్రజలకు ఆరోగ్య శ్రీ వైద్య సేవలు అందకుండా చేస్తారా అని సీఎం రేవంత్‌ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఫైర్‌ అయ్యారు. ఆరోగ్య శ్రీ, ఫీ రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించకపోవడంతో పేదలు వైద్యం, విద్యకు దూరమయ్యే దుస్థితి నెలకొందన్నారు. ఈమేరకు గురువారం సీఎం రేవంత్‌ రెడ్డికి కేంద్ర మంత్రి సంజయ్‌ బహిరంగ లేఖ రాశారు. విద్య, వైద్యంపై కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరు ఆందోళనకు గురి చేస్తోందన్నారు. ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచినట్టు గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేసే పరిస్థితి తీసుకువచ్చిందన్నారు. కాంగ్రెస్‌ ఏడాది పాలనలో రూ.వెయ్యి కోట్ల ఆరోగ్య శ్రీ బకాయిలు పేరుకుపోయాయన్నారు. ప్రభుత్వ చేతగానితనం, నిర్లక్ష్యంతో పేదలు వైద్యం అందక అల్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఫీ రీయింబర్స్‌మెంట్‌ పథకం ఉద్దేశాన్ని ఈ ప్రభుత్వం నీరుగారుస్తోందన్నారు. బకాయిలు చెల్లించకపోవడంతో కాలేజీలు మూతపడే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోతే విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వబోమని కాలేజీల యాజమాన్యాలు తెగేసి చెప్తున్నాయని.. సీఎం చేతగాని తనంతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌ అంధకారంలో పడిందన్నారు. రూ.380 రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లిస్తామని టోకెన్లు జారీ చేసి నెలలు గడుస్తున్నా చెల్లింపులు చేయడం లేదన్నారు. రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వన్‌ టైం సెటిల్‌మెంట్‌ పద్ధతిలో క్లియర్‌ చేస్తామని ప్రభుత్వం చెప్పడం సిగ్గు చేటు అన్నారు. అవేమన్నా బ్యాంకులోన్లా వన్‌ టైం సెటిల్‌మెంట్‌ చేసుకోవడానికి అని ప్రశ్నించారు. బకాయిలు ఇవ్వకపోగా ఓటీఎస్‌ పేరుతో కోత విధిస్తామని చెప్పడం మరింత దుర్మార్గమన్నారు.

రూ.2.75 లక్షల కోట్ల బడ్జెట్‌లో రూ.8 వేల కోట్లు చెల్లించి పేదలకు విద్య, వైద్యం అందించి ఆదుకోలేరా అని నిలదీశారు. విదేశీ పర్యటనలు, ఢిల్లీ పర్యటనలు, మూసీ పునరుజ్జీవం, ఫోర్త్‌ సిటీ పేరుతో వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వానికి పేదల బకాయిలు చెల్లించడానికి చేతులు రావడం లేదా అని మండిపడ్డారు. పేదల ప్రాణాలు, పేదింటి బిడ్డల చదువంటే ప్రభుత్వానికి ఎంత చిన్నచూపు ఉందో దీనితోనే తేటతెల్లమవుతుందన్నారు. వెంటనే ఆరోగ్య శ్రీ, ఫీ రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని.. జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

First Published:  9 Jan 2025 8:05 PM IST
Next Story