బీసీలకు ఇచ్చిన హామీలను విస్మరిస్తే ఊరుకోం
ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏది : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
బీసీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తే ఊరుకోబోమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌తో పాటు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. తెలంగాణ వడ్డెర సంఘం నాయకులు బుధవారం ఎమ్మెల్సీ కవితతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కేబినెట్‌లో ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని కోరారు. అన్ని జిల్లా కేంద్రాల్లో రూ.50 కోట్లతో బీసీ ఐక్యత భవనాలు నిర్మిస్తామన్న హామీపై ఈ ప్రభుత్వం కనీస చర్యలు చేపట్టలేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీని అమలు చేయడంలో తాత్సారం వద్దన్నారు. కులవృత్తులు చేసే వారిని ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
ఫుడ్ పాయిజన్ ఘటనలపై ఆందోళన
జగిత్యాల జిల్లా సారంగాపూర్ కస్తూర్బా పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో ఆరుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురవడం ఆందోళన కలిగించిందని కవిత అన్నారు. రాష్ట్రంలో ప్రతి రోజు ఏదో ఒక చోట ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతున్నారని అన్నారు. దీంతో సంక్షేమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయాందోళనలు నెలకొన్నాయన్నారు. పిల్లలకు కనీసం నాణ్యమైన ఆహారం పెట్టకపోవడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనం అన్నారు. విద్యా శాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, ఏడాది కాలంలో ఒక్కసారి కూడా సంక్షేమ పాఠశాలలకు వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించలేదన్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునే ప్రయత్నమే చేయలేదన్నారు. సీఎం ఇకనైనా స్పందించి గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లను సందర్శించాలని డిమాండ్ చేశారు. ఆయా విద్యాసంస్థలలో పరిస్థితులపై రివ్యూ చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.