Telugu Global
Telangana

మల్లన్నసాగర్‌ నుంచే హైదరాబాద్‌ కు తాగునీరు

జలమండలి బోర్డు మీటింగ్‌ లో సీఎం రేవంత్‌ రెడ్డి

మల్లన్నసాగర్‌ నుంచే హైదరాబాద్‌ కు తాగునీరు
X

కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మల్లన్న సాగర్ రిజర్వాయర్‌ నుంచే హైదరాబాద్‌ కు తాగునీటిని సరఫరా చేసే గోదావరి ఫేజ్‌ -2 ప్రాజెక్టు చేపట్టాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. 2050 నాటికి హైదరాబాద్‌ మహానగరంలో పెరిగే జనాభాకు అనుగుణంగా తాగునీటి వసతులు కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. శుక్రవారం ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ లో జలమండలి బోర్డు మీటింగ్‌ లో సీఎం మాట్లాడారు. తాగునీటి సౌకర్యాల కల్పనతో పాటు మురుగునీటి తరలించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఇందుకోసం ఏజెన్సీలు, కన్సల్టెన్సీలతో స్టడీ చేయించాలని సూచించారు. హైదరాబాద్‌ లో 9,800 కి.మీ.ల డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌ వర్క్‌ ఉందని, దీని ద్వారా 13.79 లక్షల ట్యాప్‌ కనెక్షన్లతో నీటిని సరఫరా చేస్తున్నామని అధికారులు వివరించారు. గోదావరి ఫేజ్‌ (మల్లన్నసాగర్) ద్వారా ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌ లకు నీటిని తరలించే ప్రాజెక్టుపై సమావేశంలో చర్చించారు. కొండపోచమ్మసాగర్‌ కు బదులుగా మల్లన్నసాగర్‌ నుంచే ఈ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించారు. మల్లన్నసాగర్‌ నుంచి 15 టీఎంసీలకు బదులుగా 20 టీఎంసీలు తరలించేలా మార్పులు చేశారు. కొత్త ప్రాజెక్టులకు తక్కువ వడ్డీతో లోన్లు తెచ్చుకునే మార్గాలు అన్వేషించాలని, అందుకు అనుగుణంగా డీపీఆర్‌లు తయారు చేయాలని ఆదేశించారు. 1965లో ఏర్పాటు చేసిన మంజీరా పైపులైన్ల స్థానంలో కొత్త పైప్‌లైన్‌లు వేయాలన్నారు. సమావేశంలో సీఎం అడ్వైజర్ వేం నరేందర్‌ రెడ్డి, సీఎస్‌ శాంతికుమారి, ఫైనాన్స్‌ స్పెషల్‌ సీఎస్‌ రామకృష్ణారావు, ఎంఏయూడీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ దానాకిషోర్‌, జలమండలి ఎండీ అశోక్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

First Published:  3 Jan 2025 5:11 PM IST
Next Story