రుణాల పునర్వ్యస్థీకరణకు ఆదేశాలు ఇవ్వండి
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు భట్టి విజ్ఞప్తి
తెలంగాణ ప్రభుత్వం వివిధ కార్పొరేషన్‌ల ద్వారా తీసుకున్న రుణాలను పునర్వ్యస్థీకరించేలా ఆర్థిక సంస్థలకు ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కోరారు. శనివారం ఢిల్లీలోని ఆర్థిక మంత్రి నివాసంలో నిర్మలా సీతారామన్ తో భట్టి సమావేశమయ్యారు. కేంద్రం నుంచి తెలంగాణ ప్రభుత్వానికి రావాల్సిన 408.48 కోట్లు వెంటనే చెల్లించాలని కోరారు. వెనుకబడిన జిల్లాలకు బీఆర్‌జీఎఫ్ నిధులు ఇవ్వాలని, 2014 -15 ఆర్థిక సంవత్సరంలో సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీంల నిధుల విడుదలలో జరిగిన పొరపాటును సరి చేయాలని, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఎక్సెస్ లోన్‌కు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. భట్టి వెంట ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఫైనాన్స్ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు, ఢిల్లీ తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తదితరులు ఉన్నారు.