Telugu Global
Telangana

కేసీఆర్‌ ను ఎదుర్కోలేకనే మాపై తప్పుడు కేసులు

మాది భయపడే రక్తం కాదు.. భయపెట్టే రక్తం : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

కేసీఆర్‌ ను ఎదుర్కోలేకనే మాపై తప్పుడు కేసులు
X

కేసీఆర్‌ ను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేకనే తనపై, కేటీఆర్‌ పై అక్రమ కేసులు పెట్టారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం నిజామాబాద్‌ లోని సుభాష్‌ నగర్‌ లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం పార్టీ శ్రేణులనుద్దేశించి మాట్లాడారు. తాము తప్పు చేయలేదని.. ఎవరికీ భయపడే ప్రసక్తే లేదన్నారు. తమది భయపడే రక్తం కాదని.. భయపెట్టే రక్తమని అన్నారు. తాను నిప్పులాంటి నిజామాబాద్‌ బిడ్డనని.. ఎన్ని ఇబ్బందులు, కష్టాలు ఎదురైనా ఎత్తిన పిడికిలి దించబోనని అన్నారు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా నిప్పు కణికల్లా బయటకు వస్తారన్నారు. కేంద్రాన్ని ఎదురించి ప్రశ్నించినందుకే బీజేపీ తప్పుడు కేసులు పెట్టిందన్నారు. ఇక రాష్ట్రంలో పెడుతోన్న అక్రమ కేసుల గురించి చెప్పాల్సిన అవసరం లేదన్నారు. సీఎం పేరు మర్చిపోయినా.. రైతులు భూములు ఇవ్వకపోయినా కేసులు పెడుతున్నారని, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఎందుకింత భయమని ప్రశ్నించారు. పరిపాలన భారం ఎత్తుకున్నోడు ఓపికతో ఉండాలని సూచించారు.




ప్రజల ఇబ్బందులను పరిష్కరించడానికే అధికారం ఇచ్చారన్న విషయాన్ని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మరిచిపోయాయన్నారు. పోరాడి రాష్ట్రాన్ని తెచ్చినోళ్లం ప్రజల కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా నిలబడి కొట్లాడుతామన్నారు. విద్యార్థినులకు స్కూటీలు, మహిళలకు నెలకు రూ.2,500, కళ్యాణలక్ష్మీ కింద తులం బంగారం ఎప్పుడిస్తారో చెప్పాలన్నారు. మైనార్టీలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. ఎన్నికలకు ముందు ఎన్నో పలికిన కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా పింఛన్లు పెంచలేదన్నారు. ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తేనే ఈ ప్రభుత్వం కదిలే పరిస్థితి ఉందని, గ్రామ గ్రామాన కాంగ్రెస్‌ నాయకులను ప్రజలు నిలదీయాలన్నారు. పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్ పోయి.. కాంగ్రెస్ ఫ్రెండ్లీ పోలీసింగ్ నడుస్తోందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన మంచి పనులను ఈ ప్రభుత్వం కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసాపై ప్రభుత్వం మాట్లాడడం లేదని, గురుకులాలనునపడానికి కూడా ప్రభుత్వానికి చేతకావడం లేదన్నారు. ఇప్పటికే 57 మంది పిల్లలను పొట్టనపెట్టుకున్నారు.. ఇంకెంత మందిని పొట్టనపెట్టుకుంటారని ప్రశ్నించారు. ఉద్యోగాల పేరుతో యువతను సీఎం తప్పదోవ పట్టిస్తున్నారని, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ కేసీఆర్‌ పరీక్షలు పెట్టిన ఉద్యోగాలకే నియామక పత్రాలు ఇస్తోందన్నారు.




రాష్ట్రంలో రాబోయే రోజుల్లో గులాబీ జెండా శకమేనని.. అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి కట్టుగా పని చేసి గులాబీ జెండాను నిలబెట్టుకోవాలన్నారు. మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నామని చెప్పి ఉన్న బస్సులను తగ్గించారని, ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం లేదన్నారు. చంద్రబాబు శిష్యుడ్‌ రేవంత్‌ అని.. అందుకే తెలంగాణ తల్లి స్థానంలో కాంగ్రెస్‌ మాతను ఏర్పాటు చేశారన్నారు. మన తెలంగాణ తల్లి మనకు కావాల్సిందేనన్నారు. మనది తెలంగాణ తల్లి అని.. వాళ్లది కాంగ్రెస్‌ తల్లి అన్నారు. రేవంత్‌ రెడ్డి తెలంగాణ బిడ్డలపై పొట్ట కొట్టుడే కాదు మన సంస్కృతిపైనా దాడి చేస్తున్నాడని అన్నారు. ఎన్ని కేసులు, నిర్బంధాలు పెట్టినా భయపడేది లేదన్నారు. నిజామాబాద్‌ పవర్‌ ను సీఎం రేవంత్‌ రెడ్డికి చూపిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్‌ సురేశ్‌ రెడ్డి, మాజీ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్‌, జీవన్‌ రెడ్డి, గణేశ్‌ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

First Published:  29 Dec 2024 2:08 PM IST
Next Story