రాష్ట్రాల పనితీరును పరిగణనలోకి తీసుకోకుండా పునర్విభజనా?
ఇది ప్రజాస్వామ్య, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమన్న కేటీఆర్

దేశంలో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తే.. ఆయా రాష్ట్రాలు అందిస్తున్న ఆర్థిక భాగస్వామ్యానికి అనుగుణంగా చేపట్టాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయవద్దన్న తమిళనాడు సీఎం స్టాలిన్ వ్యాఖ్యలకు ఆయన మద్దతు తెలిపారు. ఈ మేరకు కేటీఆర్ 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. దేశ అవసరాలకు తగినట్లు కుటుంబ నియంత్రణను బాగా అమలుచేసిన దక్షిణాది రాష్ట్రాలను శిక్షించడం తగదని కేటీఆర్ పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల పనితీరును పరిగణనలోకి తీసుకోకుండా పునర్విభజన చేయడం ప్రజాస్వామ్య, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. దేశ నిర్మాణంలో తెలంగాణ, దక్షిణాది రాష్ట్రాలు అమలు చేస్తున్న కృషిని ఎవరూ విస్మరించలేరని పేర్కొన్నారు. దేశ జనాభాలో తెలంగణ కేవలం 2.8 శాతం మాత్రమే ఉండగా.. జీడీపీకి 5.2 శాతం భాగస్వామ్యం అందిస్తున్నదని కేటీఆర్ వివరించారు.