Telugu Global
Telangana

బాకీలు పడ్డ కాంగ్రెస్‌ను బండకేసి కొట్టాలి

బాకీల ప్రభుత్వాన్ని గ్రాడ్యుయేట్లు, టీచర్లు, ఉద్యోగులు ప్రశ్నించాలన్న కేంద్ర మంత్రి

బాకీలు పడ్డ కాంగ్రెస్‌ను బండకేసి కొట్టాలి
X

రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా కరీంనగర్ లోని మైత్రి రెసిడెన్సీ లో ఈరోజు బీజేపీ సోషల్ మీడియా వాలంటీర్ల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఉమ్మడి కరీంనగర్ - నిజామాబాద్ - అదిలాబాద్ - మెదక్ నియోజకవర్గ బీజేపీ బలపరచిన అభ్యర్థి అంజిరెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్య, పాల్గొన్నారు. పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించడం కోసం చేపట్టాల్సిన కార్యాచరణను బీజేపీ సోషల్ మీడియా వాలంటీర్ల కు దిశా నిర్దేశం చేశారుఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ... తెలంగాణలో నడుస్తున్నది బాకీల కాంగ్రెస్ పాలన అని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు ఇస్తామన్న పెన్షన్ లు, రైతు భరోసా, నిరుద్యోగ భృతి, యువతులకు స్కూటీలు, ఆడబిడ్డలకు తులం బంగారం.. ఇలా అన్నీ బాకీలు పడ్డ కాంగ్రెస్ సిగ్గులేకుండా ఓట్ల కోసం వస్తున్నదని మండిపడ్డారు. బాకీల ప్రభుత్వాన్ని గ్రాడ్యుయేట్లు, టీచర్లు, ఉద్యోగులు ప్రశ్నించాలన్నారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాకీల కాంగ్రెస్ ను బండకేసి కొట్టాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు.

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాకముందు ఎన్ని హామీలు ఇచ్చింది? ఏ విధంగా మోసం చేసిందో మనందరికీ తెలుసన్నారు. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చింది. 20 వేల మంది ఉద్యోగాలు ఇచ్చారు. 50 వేల మందికి ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఒక్కో నిరుద్యోగికి రూ. 56 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. టీచర్లకు డీఏలు ఇస్తామన్నారు. ఒక్క డీఏ ఇచ్చి 5 డీఏలు పెండింగ్‌లో పెట్టారు. పీఆర్‌సీ ప్రకటిస్తామన్నారు. పీఆర్‌సీ సమావేశమే లేదని దుయ్యబట్టారు. బడ్జెట్‌లో విద్యకు 15 శాతం కేటాయిస్తామని చెప్పి ఆరు శాతం మాత్రమే కేటాయించారు. ప్రభుత్వ పాఠశాలల్లో వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఉపాధ్యాయులు పని ఒత్తిడితో బాధపడుతున్నారు. రైతులు, మహిళలు, విద్యార్థుల ఇలా అందరికీ బాకీ పడ్డదని, అందుకే ఈ కాంగ్రెస్‌ పార్టీని బండకేసి కొట్టాలని బండి సంజయ్‌ పిలుపునిచ్చారు.

First Published:  17 Feb 2025 7:25 PM IST
Next Story