Telugu Global
Telangana

నల్గొండ బిడ్డలను జీవశ్చవాలుగా మార్చిందే కాంగ్రెస్‌

ఇక్కడి నుంచే కాంగ్రెస్‌ వ్యతిరేక పోరాటం ప్రారంభం : కేటీఆర్‌

నల్గొండ బిడ్డలను జీవశ్చవాలుగా మార్చిందే కాంగ్రెస్‌
X

నల్గొండ బిడ్డలను ఫ్లోరైడ్‌తో జీవశ్చవాలుగా మార్చిందే కాంగ్రెస్‌ పార్టీ అని బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఈ జిల్లా నుంచి కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక పోరాటం ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు. నల్గొండ పట్టణంలోని క్లాక్‌ టవర్‌ సెంటర్‌లో నిర్వహించిన రైతు మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు మహాత్మాగాంధీ కాలేజీ వద్ద బీఆర్‌ఎస్‌ శ్రేణులు, విద్యార్థులు కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి క్లాక్‌ టవర్‌ సెంటర్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ, పోరాటాల పురిటి గడ్డ అయిన నల్లగొండనే రాష్ట్రంలో రైతుల తిరుగుబాటుకు వేదిక కావాలని పిలుపునిచ్చారు. "కేసీఆర్ పాలనలో రైతుబంధు డబ్బులు టింగ్‌ టింగ్‌ మని బ్యాంకు ఖాతాలో పడేవి. ఇప్పుడు రేవంత్ రెడ్డి రైతులను నిలువునా మోసం చేస్తున్నరు.. కేసీఆర్‌ 2 పంటలకే ఇస్తుండు.. మూడో పంటకు ఇస్తా అని రేవంత్‌ మోసం చేసిండు.. జనవరి 26న రాత్రి 12 గంటలకు డబ్బులు వేస్తామని చెప్పిండు కానీ ఇప్పటి వరకు రూపాయి పడలేదు. రుణమాఫీ, రైతుబంధు, బోనస్ అన్నీ భోగస్ అయినయ్‌.. కాంగ్రెస్ ప్రభుత్వం 2023 యాసంగి పంటకు 2,500 బాకీ పెట్టింది.. వానాకాలం ఒక్కో ఎకరానికి 7,500 ఎగబెట్టింది.. ఒక్కో రైతుకు ఎకరానికి రూ.17,500 బాకీ పడ్డది..'' అన్నారు.




రైతుబంధు ఎగవేయడానికి రేవంత్‌ రెడ్డి అనేక కుట్రలు చేస్తున్నాడని.. మార్చి 31 వరకు రైతుభరోసా వేస్తామని చెప్తున్నారు కానీ అది ఏ సంవత్సరమో చెప్పడం లేదన్నారు. గ్రామాల్లోకి కాంగ్రెస్‌ నాయకులు వస్తే ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా నుంచే కాంగ్రెస్‌ను చీల్చి చెండాడాలని పిలుపునిచ్చారు. రాజ్ భవన్‌ ముందు ధర్నా చేస్తే లేని ఇబ్బంది నల్గొండలో రైతు ధర్నా చేస్తే వస్తదని అనుమతి ఇవ్వలేదన్నారు. ఈ ధర్నాకు అనుమతిచ్చిన హైకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్‌ ప్రభుత్వంలో మంచి వసతులు ఉండేవని.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక గొడ్డుకారం పెడుతున్నారని మహాత్మాగాంధీ కాలేజీ విద్యార్థులు చెప్పారన్నారు. నల్గొండ ఐటీ టవర్‌ కళ తప్పిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నాకు వచ్చిన జానాలను చూస్తుంటే విజయోత్సవ సభలా అనిపిస్తోందన్నారు. ప్రజాశక్తి ముందు ప్రపంచంలో ఏ శక్తి కూడా గొప్పది కాదన్నారు. నల్గొండ పక్కనే కృష్ణమ్మ ఉండి కూడా ఫలితం లేకుండా పోయిందన్నారు. ''పాలమూరు నల్లగొండ పంటలన్ని ఎండిపాయే అని కేసీఆర్ పాట రాసిండు.. సూడు సూడు నల్లగొండ.. గుండె నిండా నల్లబండ అని..ఫ్లోరైడ్‌ గురించి పాట రాశారు'' అని గుర్తు చేశారు.

పంజాబ్‌, హర్యానాను తలదన్నేలా తెలంగాణ వరి పండించేలా కేసీఆర్‌ రాష్ట్రాన్ని తీర్చిదిద్దారని తెలిపారు. వరి ఉత్పత్తిలో తెలంగాణలో నల్గొండను నంబర్‌ వన్‌ చేశారని తెలిపారు. కృష్ణా, గోదావరిలో ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టేలా ప్రాజెక్టులు తలపెట్టారని చెప్పారు. ప్రపంచమే ఆశ్చర్యపోయేలా కాళేశ్వరం కట్టారని.. దాని ద్వారా చివరి మడి వరకు నీళ్లిచ్చిన నాయకుడు కేసీఆర్‌ అన్నారు. ''పాలిచ్చే ఆవును వద్దనుకొని తన్నే దున్నపోతును తెచ్చుకుని.. ఇబ్బంది పడుతున్నామని పెదకాపర్తి రైతు చెప్పిండు'' అని తెలిపారు. రైతుల మీద ప్రేమ ఉంది కాబట్టే కేసీఆర్‌ 12 సార్లు రైతుబంధు సాయం రూపంలో రూ.73 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశారని అన్నారు. పంచాయతీ, స్థానిక సంస్థల ఓట్ల కోసమే రేవంత్‌ రెడ్డి కొత్త డ్రామాకు తెరతీసిండని అన్నారు. ''రుణమాఫీపై బయట మొరుగుడు కాదు.. ఏ ఊరు పోదామో చెప్పు.. ఏ ఊర్లో అయినా వందశాతం రుణమాఫీ అయ్యిందని చెప్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్‌ విసిరిన.. చడీచప్పుడు లేదు..'' అని మండిపడ్డారు. రైతు రుణమాఫీ రూ.40 వేల కోట్లు అని ఒకసారి, రూ.31 వేల కోట్లు అని ఇంకోసారి చెప్పారని.. కేబినెట్‌ మీటింగ్‌ లో రూ.26 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని తీర్మానం చేసి ఇప్పటి వరకు రూ.12 వేల కోట్లు కూడా మాఫీ చేయలేదన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 410 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, 55 మంది గురుకుల విద్యార్థులు వివిధ కారణాలతో చనిపోయారని తెలిపారు. చేనేత కార్మికులు 35 మంది ఆత్మహత్య చేసుకున్నారని, ఆటోడ్రైవర్లు వంద మంది చనిపోయారని వివరించారు. కాంగ్రెస్‌కు ఓటేసినందుకు ఐదేళ్ల శిక్ష విధించారని ఆందోళన వ్యక్తం చేశారు. యాదాద్రి గుడిని కేసీఆర్‌ అత్యంతద్భుతంగా తీర్చిదిద్ది ఆయన రుణం తీర్చుకున్నారని, అతిపెద్ద థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ను ఈ జిల్లాలో ఏర్పాటు చేశారని తెలిపారు. కార్యకర్తలు, నాయకులు అధైర్య పడొద్దని భవిష్యత్‌ బీఆర్‌ఎస్‌దేనని చెప్పారు. కార్యకర్తలు, నాయకులకు పార్టీ ఎళ్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రైతు మహాధర్నాలో మాజీ మంత్రులు జగదీశ్‌ రెడ్డి, నిరంజన్‌ రెడ్డి, శాసన మండలిలో ప్రతిపక్షనేత మధుసూదనాచారి, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

First Published:  28 Jan 2025 3:40 PM IST
Next Story