కులగణన, ఎస్సీ వర్గీకరణపై జనంలోకి కాంగ్రెస్
స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం : రేపు ఎమ్మెల్యేలతో సీఎం, పీసీసీ చీఫ్ భేటీ
కులగణన, ఎస్సీ వర్గీకరణపై జనంలోకి వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. కులగణన పూర్తి చేయడంతో పాటు ఎస్సీ వర్గీకరణపై నిర్ణయం తీసుకున్నామనే విషయాన్ని ప్రజలకు వివరించనుంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో గురువారం ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో నిర్వహించే ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ దీపాదాస్ మున్షీ, మంత్రులు పాల్గొననున్నారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల ఎమ్మెల్యేలతో సమావేశమవుతారు. 15 నిమిషాల బ్రేక్ తర్వాత 4.15 నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు కరీంనగర్, వరంగల్ ఎమ్మెల్యేలతో, 5.30 నుంచి 6.30 వరకు నల్గొండ, హైదరాబాద్, మెదక్ జిల్లాల ఎమ్మెల్యేలతో, 6.45 నుంచి రాత్రి 7.45 వరకు రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల ఎమ్మెల్యేలతో సమావేశమవుతారు. కులగణన, ఎస్సీ వర్గీకరణను ప్రజలకు వివరించడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపైనా సీఎం సహా ముఖ్య నేతలు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు.