రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో.. ఊడుతుందో?
కుల గణనతో కాంగ్రెస్ కొరివితో తలగోక్కుంటుంది : కేంద్ర మంత్రి బండి సంజయ్

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో.. ఊడుతుందోనని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పనులు చూస్తుంటే ప్రతి ఒక్కరికీ అదే అనుమానం కలుగుతుందన్నారు. సోమవారం కరీంనగర్ లో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల తరపున నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి తప్పులు చేయాలని ఐఏఎస్ అధికారులను ప్రోత్సహించడం ఏమిటని ప్రశ్నించారు. తాను ఒక్క తప్పు చేయాలని చెప్తో ఐఏఎస్ లు మూడు, నాలుగు తప్పులు చేస్తున్నారని వ్యాఖ్యానించడం సిగ్గు చేటన్నారు. ముఖ్యమంత్రిగా ఉండి అవినీతి, అక్రమాలను కట్టడి చేయాల్సింది పోయి ఆయనే తప్పులు చేయాలని అధికారులకు చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య చీలిక వచ్చిందని.. కొందరు మంత్రులు సొంత దుకాణాలు ఓపెన్ చేసి 15 శాతం చొప్పున కమీషన్లు దండుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో నిరుద్యోగికి రూ.56 వేల నిరుద్యోగ భృతి, ప్రతి మహిళకు స్కూటీ, పెళ్లి అయిన యువతులకు తులం బంగారం, ఉద్యోగులకు పీఆర్సీ, నాలుగు డీఏలు, రైతులకు రైతుభరోసా, బోనస్, రుణమాఫీ బాకీ పడిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే బాకీల సర్కారు అని ఎద్దేవా చేశారు. మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కులగణన పేరుతో కాంగ్రెస్ పార్టీ కొరివితో తలగొక్కోంటోందన్నారు. బీసీ జాబితాలో ముస్లింలను చేర్చి బిల్లు పంపితే కేంద్రం ఎట్లా ఆమోదిస్తుందని ప్రశ్నించారు. ''ముస్లింలతో కూడిన బీసీ బిల్లును ఆమోదించడానికి మేమేమైనా ఎడ్డోళ్లమా? ముస్లింలను బీసీల్లో ఎట్లా కలుపుతారు? మేం మొలదారం కట్టుకుంటాం. మాకు గోత్రం ఉంటది. వాళ్లతో మాకు పోలికేంది? ముస్లింలను బీసీ జాబితా నుంచి తీసివేస్తే ఆ బిల్లును ఆమోదింపజేసే బాధ్యత మేం తీసుకుంటాం. లేకుంటే ఆమోదించే ప్రసక్తే లేదు. ముస్లింలను బీసీల్లో కలిపి అన్యాయం చేస్తున్నారు. కొందరు క్రైస్తవులు ఎస్సీ సర్టిఫికేట్లు తీసుకుంటూ ఎస్సీలకు నష్టం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా బీసీ, ఎస్సీ సంఘాలేం చేస్తున్నాయి? ఎందుకు స్పందించడం లేదు? ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ముకాయడమే మీ పనా? ఒక వర్గానికి కొమ్ముకాయాలని హిందూ సమాజానికి తీరని నష్టం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో మేధావులంతా గుణపాఠం చెప్పాలని కోరుతున్నా..'' అన్నారు. నిరుద్యోగులు, ఉద్యోగుల పక్షాన కొట్లాడింది బీజేపీనేనని.. వాళ్ల ఓట్లు అడిగే హక్కు కూడా తమ పార్టీకే ఉందన్నారు.