Telugu Global
Telangana

తెలంగాణను నీటి సంక్షోభంలోకి నెట్టేసిన కాంగ్రెస్‌ సర్కారు

భూగర్భ జలాలు గణనీయంగా తగ్గడంపై మాజీ మంత్రి హరీశ్‌ రావు ఆందోళన

తెలంగాణను నీటి సంక్షోభంలోకి నెట్టేసిన కాంగ్రెస్‌ సర్కారు
X

తెలంగాణను కాంగ్రెస్‌ ప్రభుత్వం తన వైఫల్యాలతో నీటి సంక్షోభంలోకి నెట్టేసిందని మాజీ మంత్రి హరీశ్‌ రావు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గణనీయంగా పడిపోయిన భూగర్భ జలమట్టంపై శనివారం 'ఎక్స్‌' వేదికగా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోనే తెలంగాణను భూగర్భ జలాల సంరక్షణలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆదర్శంగా నిలిపితే.. కాంగ్రెస్‌ పాలన వైఫల్యంతో భూగర్భ జలాలు మళ్లీ పాతాళానికి చేరాయన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలో పదేళ్లలో భూగర్భ జలాలు 56 శాతం పెరిగాయన్నారు. మిషన్‌ కాకతీయ ద్వారా 27 వేలకు పైగా చెరువులను పునరుద్దరించడంతో 15 లక్షల ఎకరాలకు సాగునీటి భరోసా దక్కిందని. 8.93 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం పెరిగిందని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ముందు చూపులేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా రెండు మీటర్లకు పైగా భూగర్భ జలమట్టం పడిపోయిందన్నారు. యాదాద్రి జిల్లాలో 2.71 మీటర్లు, రంగారెడ్డి, మహబూబ్‌ నగర్‌ సహా ఇతర జిల్లాల్లోనూ భూగర్భ జల మట్టం భారీగా తగ్గిపోయిందన్నారు. 120 కి.మీ. పొడవునా గోదావరి నది పూర్తిగా ఎండిపోయిందని.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ వైఫల్యమే దీనికి కారణమన్నారు. మేడిగడ్డతో పాటు కాళేశ్వరం బ్యారేజీలు రాష్ట్రానికి నీటి భద్రత కల్పిస్తే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరుతో ఇప్పుడు తాగునీటికి నీళ్లు అందని దుస్థితి నెలకొందన్నారు. రాష్ట్రంలోని రిజర్వాయర్లలో నీటిమట్టాలు గణనీయంగా తగ్గిపోతున్నాయని.. ప్రభుత్వం ఇకనైనా మేల్కొనకపోతే రాబోయే రోజుల్లో తాగునీటికి ఇబ్బుందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

First Published:  15 Feb 2025 2:36 PM IST
Next Story