బీసీలకు సీఎం క్షమాపణ చెప్పాలే
కాంగ్రెస్ సర్కారు సర్వే తప్పుల తడక అని ఒప్పుకోవడాన్ని స్వాగతిస్తున్నాం : కేటీఆర్
![బీసీలకు సీఎం క్షమాపణ చెప్పాలే బీసీలకు సీఎం క్షమాపణ చెప్పాలే](https://www.teluguglobal.com/h-upload/2025/02/12/1402879-ktr.webp)
రాష్ట్రంలోని బీసీల జనాభాను తగ్గించి చూపించి వారిని మానసికంగా వేధింపులకు గురి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలందరికీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కారు చేసిన కులగణన సర్వే తప్పుల తడక అని రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఒప్పుకోవడాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రకటనపై బుధవారం ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. ప్రభుత్వం అసమగ్రంగా సర్వే చేసిందన్న విషయాన్ని బీఆర్‌ఎస్ తో పాటు బీసీ సంఘాలు ముక్తకంఠంతో అభ్యంతరం తెలిపినా ఈ ప్రభుత్వం వినిపించుకోలేదని.. అసంపూర్తి లెక్కలనే అసెంబ్లీలో చదివి వినిపించారని తెలిపారు. బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేయకపోవడం ముమ్మాటికీ తప్పేనన్నారు. ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు చేస్తామన్న సర్వేనైనా సమగ్రంగా చేయాలని, బీసీలకు చట్టబద్దంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలన్నారు. తూతూమంత్రంగా తీర్మానం చేసి.. బీసీ రిజర్వేషన్లను కేంద్రం పరిధిలోకి నెట్టేయాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయకుండా వంచించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీలు నమ్మే పరిస్థితిలో లేరనే విషయాన్ని ఈ ముఖ్యమంత్రి గుర్తు పెట్టుకోవాలన్నారు.