Telugu Global
Telangana

ప్రధాని మోడీ డైరెక్షన్ లో పనిచేస్తున్న సీఎం రేవంత్

కల్వకుంట్ల కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడమే బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల లక్ష్యం

ప్రధాని మోడీ డైరెక్షన్ లో పనిచేస్తున్న సీఎం రేవంత్
X

రేవంత్ రెడ్డికి కేసీఆర్ ఫోబియా పట్టుకుంది. పరిపాలన పక్కన పెట్టీ కేసీఆర్ పై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నాడని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. అప్పుల పై తప్పుడు లెక్కలు చెప్తూ కాలం వెళ్లదీస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..రేవంత్ రెడ్డి అంతులేని అబద్ధాలు చెబుతున్నారు. నెలకు రూ. 6,500 కోట్ల వడ్డీ కడుతున్నామని అబద్ధాలు చెబుతున్నారు. అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కనీసం ఇప్పుడైనా నిజాలు చెప్పాలన్నారు. కాగ్ నివేదిక ప్రకారం ఏ నెల కూడా రూ. 2,600 కోట్లకు మించి వడ్డీ కట్టలేదు మరి రూ. 6,500 కోట్లు కడుతున్నామని సీఎం ఎందుకు అబద్ధాలు చెబుతున్నారు? అని ప్రశ్నించారు. అబద్దాలు పదేపదే చెబితే నిజమవుతాయేమోనన్న భమలో సీఎం ఉన్నారు. రాష్ట్ర ఆదాయంపై కూడా రేవంత్ రెడ్డి తప్పుడు లెక్కలు చెబుతున్నారు. ప్రతీ నెల రూ. 18 వేల కోట్ల ఆదాయం వస్తున్నదని సీఎం చెబుతున్నారు.కానీ కాగ్ ప్రకారం రూ. 12 వేల కోట్లకు మించి ఈ ఏడాది ఆదాయం రాలేదు. మరి ఈ అబద్ధపు లెక్కలు ఎందుకు చెప్తున్నట్లు? ఎవరిని మభ్యపెట్టడానికి చెబుతున్నారు? నిలదీశారు. ఆదాయం పడిపోవడానికి ప్రధాన కారణం హైడ్రా అన్నారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 18 వేల కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ హైడ్రా విధ్వంసం వల్ల దాని ద్వారా ఆదాయం రూ. 5,800 కోట్లకు పడిపోయిందన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని కాంగ్రెస్ ప్రభుత్వం సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నదని ధ్వజమెత్తారు. ప్రధానిని కలిసిన సీఎం కొత్త విషయాలపై వినతులు ఇవ్వలేదన్నారు.

బీఆర్ఎస్ హయాంలో ఎస్ఎల్‌బీసీ పనులే జరగలేదని సీఎం పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. కేసీఆర్ విశాల హృదయం తెలవాలంటే ఎస్ఎల్బీసీ విషయంలో అర్థమవుతుందని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఈ ప్రాజెక్టుపై కేసీఆర్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఎస్ఎల్‌బీసీ టన్నెల్ విషయంలో అప్పటి ప్రతిపక్ష నేత జానారెడ్డికి ముందుపెట్టి కేసీఆర్ కాంట్రాక్టరుకు రూ. 100 కోట్లు అడ్వాన్స్ ఇచ్చారు. కొవిడ్‌ తర్వాత కాంట్రాక్టరు పనులు చేపట్టలేమంటే మళ్లీ రూ. 100 కోట్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది అన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు 30 ఏళ్లలో రూ. 3,340 కోట్లు ఖర్చుచేస్తే ..కేవలం 10 ఏళ్లలో కేసీఆర్ రూ. 3,890 కోట్లు పెట్టారు. ఇంత ఖర్చు పెట్టి 11 కిలోమీటర్ల మేర టన్నెల్ తవ్విస్తే ముఖ్యమంత్రి అబద్ధాలు చెబుతున్నారు. సొంత జిల్లాలో, సొంత ఊరు పక్కన విపత్తు జరిగితే పట్టించుకోకుండా సీఎం ఢిల్లీ వెళ్లారు. 8 మంది ప్రాణాలు చిక్కుకుంటే ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారానికి వెళ్లారని మండిపడ్డారు.

ప్రధాని మోడీ డైరెక్షన్ లో సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు. ఆయన ఆర్ఎస్ఎస్ సీఎంగా వ్యవహరిస్తున్నారు ప్రతీ విషయంలో బీజేపీతో సీఎం రేవంత్ రెడ్డి కలిసి పనిచేస్తున్నారు. అహంకారానికి, కుటుంబ పాలనకు కేరాఫ్ అడ్రస్ ఎనుముల రేవంత్ రెడ్డి మారారని దుయ్యబట్టారు. బీజేపీ నాయకులే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దగ్గరుండి కాపాడుతున్నారు. అందుకే మేము వాస్తవాలు బయటపెట్టగానే బీజేపీ నాయకులు మమ్మల్నే విమర్శిస్తారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య భాగస్వామ్యం ఉన్నదని ఆరోపించారు. ఢిల్లీ వేదికగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య దోస్తీ బట్టబయలైంది. ప్రధానిని కలిసిన తర్వాత కేసీఆర్, కేటీఆర్‌పై కేసులు పెడుతామని రేవంత్ రెడ్డి అంటున్నారు.లేనిపోని విషయాలు తెచ్చి మాకు అంటగడుతున్నారని మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడమే తప్పా సీఎంకు ఇంకో ఆలోచన లేదన్నారు. కల్వకుంట్ల కుటుంబం అంటే కట్టుబాట్లతో కూడిన కుటుంబం అన్నారు.మేము ఎప్పుడూ ప్రొటోకాల్‌ను ఉల్లంఘించలేదు .కానీ రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు రాజ్యాంగేత శక్తులుగా వ్యవహరిస్తున్నారు.ప్రధానిని కలిసిన తర్వాత తన సోదరుడు తిరుపతి రెడ్డి తన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ అని సీఎం చెప్పుకున్నారు. పార్టీ పరంగా ఇన్‌ఛార్జ్ అయితే మాకు ఇబ్బంది లేదు.. కానీ అధికారిక సమావేశాల్లో ఎందుకు పాల్గొంటున్నారు. తిరుపతి రెడ్డికి కలెక్టర్ ఎందుకు ఎదురెళ్లి స్వాగతం చెబుతున్నారు రాజ్యాంగేతర శక్తులను ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తున్నట్లు కదా? అని ప్రశ్నించారు. మా కుటుంబంలో అధికారికంగా, రాజ్యాంగబద్ధంగా ఎన్నికల్లో ఎన్నికయ్యి ప్రజాసేవ చేస్తున్నామని, కానీ సీఎం సోదరులు ఇష్టారీతినా వ్యవహరిస్తున్నారు. గుమ్మడి నర్సయ్య వంటి మహోన్నతమైన వ్యక్తిని గేటు బయట నిలబెట్టి రేవంత్ రెడ్డి అహంకారాన్ని ప్రదర్శించారు. తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంగా ఉన్న కేసీఆర్ కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని ఇబ్బందిపెట్టాలన్నది సీఎం దురాలోచన అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి తెలంగాణకు రక్షణకవచంగా ఉన్న బీఆర్ఎస్‌పై కుట్రలు చేస్తున్నాయి. న్యాయవాది సంజీవ రెడ్డి కోర్టులో వాదిస్తూ అందరి ముందే ఆరు నెలల కిందట గుండెపోటుతో మరణించారు. భూపాలపల్లిలో భూతగాదాల వల్లనే హత్య జరిగినట్లు జిల్లా ఎస్పీ చెప్పారు.దుబాయ్‌లో ఒక వ్యక్తి నిద్రలోనే చనిపోయారని పత్రికల్లోనే వచ్చింది. అయినా సీఎం అబద్ధాలు ప్రచారం చేస్తూ.. మీడియాకు లీకులు ఇస్తూ బీఆర్‌ఎస్‌కు ఆ మరణాలను ఆపాదిస్తున్నారని కవిత ఫైర్‌ అయ్యారు.

First Published:  27 Feb 2025 1:26 PM IST
Next Story