Telugu Global
Telangana

పశువుల అందాల పోటీలు.. ఎడ్ల పందాలు

తెలంగాణలో వివిధ జిల్లాల్లో సంక్రాంతి జోష్‌

పశువుల అందాల పోటీలు.. ఎడ్ల పందాలు
X

సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వివిధ పోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వరంగల్‌ జిల్లా నర్సంపేటలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా పాడి పశువుల అందాటల పోటీలు నిర్వహించారు. శాంతి సేన రైతు సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏడాదిలాగే మూగ జీవాలైన జోడెద్దులు, ఆవు దూడలు, గొర్రె పొట్టేలు, మేకలతోపాటు సాదు జంతువులైన కుక్కలు, పిల్లులు, కోళ్లు, పుంజులు, సీమ కోళ్లు, బాతులు తదితర జంతువులకు అందాల పోటీలు నిర్వహించారు. వాటిని పెంచేవారు జంతువులను అందంగా ముస్తాబు చేసుకుని వచ్చారు. ఆవులకు కలర్లు వేసి అలంకరించారు. గొర్రెలకు, మేకల కొమ్ములకు రిబ్బన్లు కట్టారు. కొందరైతే కుక్కలు, పిల్లులకు రిబ్బన్లు కట్టి ముస్తాబు చేశారు. కోడి కాళ్లకు, మెడకు గిఫ్ట్‌ రిబ్బన్లు కట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి విజేతలకు బహుమతులు అందజేశారు.

ఆసిఫాబాద్‌లో ఎడ్ల పందాలు

కుమురం భీమం ఆసిఫాబాద్‌ జిల్లా ఆసిఫాబాద్‌ మండలం బాబాపూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలో సంక్రాంతిని పందాల పోటీలలో పాల్గొన్నారు. బాబాపూర్‌ గ్రామ శివారులోని వాగు వద్ద గత పదేళ్లుగా సంక్రాంతి పండుగ రోజు ఎడ్ల పందాలను నిర్వహించడం ఆనవాయితీ వస్తున్నద. ఈ క్రమంలో వాగు వద్ద పండుగ పొద్దున ఎడ్ల పందాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎంపీపీ అరిగెల మల్లికార్జున్‌ జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. ఈ పోటీలో గెలిచిన వారికి ప్రథమ బహుమతిగా రూ. 10 వేలు, ద్వితీయ బహుమతిగా రూ. 5 వేలు ఇస్తారు. అలాగే ఏటా బాబాపూర్‌ గ్రామంలో ఎడ్ల పందాలతో పాటు ముగ్గులు, కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు. ఎడ్ల పందాల పోటీలను తిలకించడానికి జిల్లాలోని నలుమూలల నుంచి ప్రజలు భారీగా చేరుకున్నారు. ఈ కార్యక్రమం కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా జరిగింది.

First Published:  14 Jan 2025 4:01 PM IST
Next Story