కుల గణన సర్వే తప్పుల తడక
బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపించారు : శాసన మండలి ప్రతిపక్షనేత మధుసూదనాచారి
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే తప్పుల తడక అని శాసన మండలి ప్రతిపక్షనేత మధుసూదనాచారి మండిపడ్డారు. బుధవారం తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రులు, సీనియర్ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం అసెంబ్లీ, కౌన్సిల్‌లో ప్రవేశపెట్టిన కుల గణన సర్వే రిపోర్టును బీసీల సంఘాలతో పాటు రాజకీయ పార్టీలు ఒప్పుకోవడం లేదన్నారు. బీసీలకు అన్యాయం చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 3.35 కోట్ల మంది ఓటర్లున్నారని ఎన్నికల కమిషన్ లెక్కలు చెప్తున్నాయని, ఓట్లు లేని 18 ఏళ్లలోపు వాళ్లు ఇంకో 25 శాతం జనాభా ఉంటారని తెలిపారు. వారి వివరాలను పరిగణలోకి తీసుకోకుండానే కుల గణన సర్వే ఇదేనని తప్పుడు రిపోర్టును సభలో ప్రవేశపెట్టి బీసీలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. బ్రిటిష్ వాళ్లు, నిజాం రాజు సైతం కుల గణన చేశారని.. దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు కుల గణన చేయించలేదో సమాధానం చెప్పాలన్నారు.
అసెంబ్లీ, కౌన్సిల్‌లో తమ గొంతు నొక్కారని.. నిన్నటి రోజు బీసీలకు పీడ దినమని అన్నారు. ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దుకోవాలన్నారు. ఒక సామాజికవర్గం జనాభా పెరిగినట్టు చూపించారని.. బీసీలకు న్యాయం చేసే వరకు ఉద్యమిస్తామన్నారు. ఇప్పుడు బీఆర్‌ఎస్ పార్టీలో ముగ్గురికి ప్రొటోకాల్ ఉంటే వారిలో ఇద్దరు బీసీలేనని అన్నారు. అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్ పదవులు బీసీలకు ఇచ్చింది కేసీఆరేనని గుర్తు చేశారు. అసెంబ్లీలో ప్రభుత్వం బోగస్ సర్వే ప్రవేశ పెట్టిందని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బీహార్ ప్రభుత్వం బీసీ కమిషన్ ద్వారా కాకుండా ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ ద్వారా సర్వే చేయిస్తే హైకోర్టు కొట్టేసిందని గుర్తు చేశారు. తెలంగాణలోనూ అలాంటి పొరపాటే జరిగిందన్నారు. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి తమను బుల్డోజ్ చేశారని.. సగం ఇండ్లను కూడా సర్వే చేయకుండా రిపోర్టు ఇవ్వడం ఏమిటని మండిపడ్డారు. పదేళ్లలో జనాభా పెరుగుదల 13 శాతం ఉంటుందని.. ఆ లెక్కన చూస్తే 4.25 కోట్లకు జనాభా చేరాలని అన్నారు. కానీ ప్రభుత్వం రాష్ట్ర జనాభాను 3.75 కోట్లకే పరిమితం చేసిందన్నారు. దాదాపు 40 లక్షల మంది బీసీలను కనుమరుగు చేశారన్నారు. ముస్లిం బీసీలను కలుపకుండానే బీసీల జనాభా 56 శాతం ఉంటుందని, కేవలం 46 శాతమేనని కులగణనలో చూపించారని అన్నారు. అన్నికులాల జనాభా పెరిగితే బీసీల జనాభా ఎలా తగ్గిందని ప్రశ్నించారు. వెంటనే రీ సర్వే చేసి బీసీల జనాభాను తేల్చాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో నిన్న సోషల్ ఇంజస్టిస్ డే అని బీఆర్‌ఎస్ అసెంబ్లీ విప్ కేపీ వివేకానంద అన్నారు. మంగళవారం బడుగు, బలహీన వర్గాలకు చీకటి రోజు అన్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న బాగా నటించారని.. ఆ నటనను బీసీలెవ్వరూ నమ్మబోరన్నారు. సీఎం మానసిక ఉన్మాదిలా ప్రవర్తించారని అన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కు కాంగ్రెస్ పార్టీ మంగళం పాడిందన్నారు. నీలం సంజీవ రెడ్డి నుంచి రేవంత్ రెడ్డి వరకు కాంగ్రెస్ సీఎంలందరూ బీసీలను మోసం చేసిన వారేనన్నారు. రాజీవ్‌గాంధీ పార్లమెంట్‌లో ఓబీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడారని.. ఆ రికార్డులను బయట పెడుతామన్నారు. తెలంగాణ సమాజం రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పి తీరుతుందన్నారు. తమ పార్టీ అధినేత కేసీఆర్‌తో చర్చించి బీసీల కోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. చట్టసభల సాక్షిగా కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసిందని ఎమ్మెల్సీ ఎల్. రమణ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయే స్థానాలనే కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు పార్టీపరంగా ఇస్తామనడం బీసీలను దగా చేయడమేనన్నారు. బీసీల రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించే వరకు కాంగ్రెస్ పార్టీని విడిచి పెట్టేది లేదన్నారు. అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి బీసీలను సమాయత్తం చేస్తామన్నారు. ప్రెస్‌మీట్ లో మాజీ మంత్రి జోగు రామన్న, నాయకులు పల్లె రవికుమార్ గౌడ్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.