భూ భారతి ప్రకటనలపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
స్పీకర్ కు అందజేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
అసెంబ్లీ ఆమోదం పొందని భూ భారతి బిల్లును చట్టంగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పత్రికల్లో ప్రకటనలు ఇచ్చిందని.. ఇది ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాకుండా శాసన సభ్యుల హక్కులకు భంగం కలిగించే చర్య అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. శుక్రవారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కలిసి సభా హక్కుల ఉల్లంఘన నోటీసు అందజేశారు. 19వ తేదీన అన్ని ప్రముఖ పత్రికల్లో భూభారతి చట్టం విశిష్టతల పేరుతో భారీ ప్రకటనలను ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు. అసెంబ్లీలో బిల్లు రూపంలోనే ఉండగా దానిని చట్టంగా పేర్కొనడం చట్టసభల రాజ్యాంగ హక్కులను అగౌరవ పరచడమేనని తెలిపారు. అసెంబ్లీ ఆమోదించని బిల్లును చట్టమని చెప్తూ ప్రజలపై రుద్దే ప్రయత్నాన్ని ఈ ప్రభుత్వం చేసిందని తెలిపారు. ఈ చర్యకు పాల్పడిన ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నోటీస్ ఇచ్చిన వారిలో మాజీ మంత్రులు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, విజేయుడు, మాణిక్ రావు, కౌశిక్ రెడ్డి, లక్ష్మారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు.