రామగుండంలో బీఆర్‌ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్
ఎన్‌టీపీసీ రెండో దశ ప్రాజెక్టు భూసేకరణ కోసం నేడు ప్రజాభిప్రాయ సేకరణ

పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎన్‌టీపీసీ రెండో దశ ప్రాజెక్టు భూసేకరణ కోసం 2400 మెగావాట్ల విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి నేడు ప్రజాభిప్రాయ సేకరణ జరగనున్నది. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీహర్ష ఆధ్వర్యంలో రామగుండం జడ్పీ పాఠశాలలో ప్రజాభిప్రాయ సేకరణ జరగనున్నది. ప్రజాభిప్రాయ సేకరణను వ్యతిరేకిస్తూ బీఆర్‌ఎస్ బంద్ పిలుపునివ్వడంతో ఆ పార్టీ నేతలను ముందస్తుగా అరెస్టు చేసి జైపూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ప్రజాభిప్రాయ సేకరణ అంటూ ప్రకటనలు ఇస్తూ ప్రజల, ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కివేయడం సరైంది కాదని గులాబీ శ్రేణులు మండిపడుతున్నారు. ఈ ప్రాంతం కాలుష్యకోరల్లో చిక్కుకుంటే ఎన్టీపీసీ యాజమాన్యం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 4,200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలున్న రామగుండంలో మరో 2400 మెగావాట్ల విద్యుత్ కేంద్రాలను నెలకొల్పడం ద్వారా పూర్తి ఉత్పత్తి 6,600 మెగావాట్లకు చేరుకుంటుందన్నారు. దీనికోసం రోజుకు సుమారు 80 వేల టన్నుల బొగ్గును మండించాల్సి ఉంటుందని, దీనివల్ల సల్ఫర్ డయాక్సైడ్ ఉద్గారాలు భారీగా వెలువడుతాయని స్థానికులు చెబుతున్నారు. వీటితోపాటు పరిసర ప్రాంతంలో ఆర్‌ఎఫ్‌సీఎల్, రామగుండం బీ-థర్మల్ కేంద్రం, కేశోరాం సిమెంట్ కర్మాగారాలు ఉన్నాయని.. వీటి నుంచి కూడా కాలుష్య కారకాలు వెలువడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.