కులగణనపై బీజేపీ వైఖరి చెప్పాలి
బీసీలంటే ఆ పార్టీకి లెక్క లేదా : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
బీసీ కులగణనపై తమ వైఖరి ఏమిటో బీజేపీ చెప్పాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బీసీలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, కామారెడ్డి డిక్లరేషన్ అమలుపై తెలంగాణ ప్రభుత్వాన్ని బీజేపీ ఎందుకు నిలదీయడం లేదని ఆమె ప్రశ్నించారు. బీసీలంటే బీజేపీకి లెక్కలేదా అని నిలదీశారు. గురువారం కుమ్మరి సంఘం నాయకులు హైదరాబాద్లో ఎమ్మెల్సీ కవితను తన నివాసంలో కలిశారు. బీసీలు, ముఖ్యంగా కులవృత్తుల వారు ఎదుర్కొంటున్న సమస్యలను వారు ఆమె దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. కేసీఆర్ కులవృత్తులకు అన్ని విధాలా మద్ధతిచ్చారని, కాంగ్రెస్ ప్రభుత్వం కులవృత్తులను కుదేలు చేస్తోందన్నారు. ముఖ్యంగా బీసీల సంక్షేమాన్ని, అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసిందని ధ్వజమెత్తారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీని విస్మరిస్తున్నా బీజేపీ స్పందించకపోవడం శోచనీయమన్నారు. బీసీలు జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు అవడం బీజేపీకి ఇష్టం లేదా అని ప్రశ్నించారు. బీసీ కులగణన విషయంలో ప్రభుత్వం తాత్సారం చేయడం సరికాదన్నారు. దేశవ్యాప్తంగా కులగణనకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చట్టం తీసుకొస్తే అన్ని రాష్ట్రాల్లో కులగణన జరుగుతుందని, కానీ కేంద్రం ఆ దిశగా అడుగులు వేయకపోవడం అంటే బీసీలపై ప్రేమ లేనట్లే మనం అర్థం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో యునైటెడ్ ఫులే ఫ్రంట్ నాయకులు బొల్ల శివ శంకర్, తెలంగాణ రాష్ట్ర శాలివాహన సంఘ నాయకులు దుగుంట్ల నరేష్, నిమ్మలూరి శ్రీనివాస్, రేపాక రాంబాబు, తెలంగాణ రాష్ట్ర ఆరెకటిక సంఘం నాయకులు హకీంకారి సురేందర్, జీకే జహంగీర్, జీకే పరమేశ్వర్, ఎ. వెంకటేశ్వర్, అఖిల బాయి తదితరులు పాల్గొన్నారు.