రేవంత్ కు రక్షణ కవచంలా బీజేపీ
కేసీఆర్ పార్టీని ఖతం చేసేందుకే కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు : కేటీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ రక్షణ కవచంలా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్ పార్టీని ఖతం చేయడానికే కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయన్నారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గానికి చెందిన మాజీ జెడ్‌పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్కిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి సహా కాంగ్రెస్ కార్యకర్తలు మంగళవారం తెలంగాణ భవన్ లో బీఆర్‌ఎస్‌లో చేరారు. కేటీఆర్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ప్రధాని తెలంగాణకు వచ్చి రేవంత్ రెడ్డి అక్రమాలపై, ఆర్ ఆర్ ట్యాక్స్ పై ఆరోపణలు చేస్తారే తప్ప ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. రేవంత్ బామ్మర్ది కంపెనీకి అమృత్ టెండర్లు కట్టబెట్టారని.. తాను స్వయంగా ఈ టెండర్లపై కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేసి ఆరు నెలలవుతున్నా ఎలాంటి చర్యలు లేవన్నారు. మంత్రి పొంగులేటిపై ఈడీ రెయిడ్ చేసిందని.. ఏం జరిగిందో కాని ఇంతవరకు ఎవరూ నోరు విప్పడం లేదన్నారు. ఇవన్నీ దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఎవరిని ఎవరు కాపాడుతున్నారో ఈ ఘటనలు స్పష్టం చేస్తున్నాయన్నారు. రేవంత్ రెడ్డి బీజేపీపై ఎందుకు మాట్లాడటం లేదని.. కేసీఆర్ మీదనే ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం చేసుకోవాలన్నారు. తెలంగాణలో కేసీఆర్ పార్టీ ఉంటే.. కాంగ్రెస్, బీజేపీ ఆటలు సాగవని తెలుసు కాబట్టే ఆ ఇద్దరు కలిసి కేసీఆర్ పార్టీని ఖతం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంపై ఎన్‌డీఎస్‌ఏ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ''కాళేశ్వరంలో ఒక బరాజ్‌లో ఒక పర్రె వడితే.. కాంగ్రెస్ నేతలతో పాటు మీడియా ప్రతినిధులు కూడా లొల్లి పెట్టిండ్రు. మరి ఇవాళ సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే ఎవరు మాట్లాడరు. కాంగ్రెస్, బీజేపోడు నోరెత్తడు. ఎస్ఎల్‌బీసీ టన్నెల్ కూలిపోతే మాట్లాడరు. ఖమ్మం వద్ద పెద్దవాగు కొట్టుకుపోతే ఎవరు మాట్లాడరు. రేవంత్ రెడ్డికి రక్షణ కవచంలా బీజేపీ ఉంది. కాళేశ్వరంలో ఒక పిల్లర్‌కు పర్రె వడితే.. ఎన్డీఎస్ఏ వాలిపోయింది. మరి ఇవాళ ఎస్ఎల్‌బీసీలో టన్నెల్ కూలి దాదాపు 72 గంటలు అవుతుంది మరి ఎందుకు ఎన్డీఎస్ఏ రాలేదు. ఏ బీజేపోడు మాట్లాడడు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు మాట్లాడం లేదు. ఏం ఇబ్బంది వచ్చింది. సుంకిశాల కూలిపోతే గవినోళ్ల శ్రీనివాస్ ఆర్టీఐ కింద రఖాస్తు పెట్టుకుంటే.. ఇది దేశ భధ్రతకు సంబంధించిన అంశం.. సమాధానం ఇవ్వమని చెప్పారు'' అని వివరించారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంపై జ్యూడిషియల్ ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మీతో పాటు తులం బంగారం ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి మోసం చేశాడని.. రైతులను అన్నివర్గాలను మోసం చేశాడని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 450 రోజులు అవుతోందని.. రోజుకు ఒకరు చొప్పున 450 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. కేసీఆర్ పాలనలో రైతు ఆత్మహత్యలను తగ్గించారని.. మళ్లీ కాంగ్రెస్ రాగానే రైతు ఆత్మహత్యలు మొదలయ్యాయన్నారు. ఇది కాలం తెచ్చిన కరువా..? కాంగ్రెస్ తెచ్చిన కరువా..? అర్థం చేసుకోవాలన్నారు. కేసీఆర్ మీద కోపంతోనే మేడిగడ్డ రిపేర్ చేయడం లేదన్నారు. శివుడు గంగను కిందకు తీసుకువస్తే.. కేసీఆర్ కాళేశ్వరంతో గంగను 618 మీటర్ల పైకి తీసుకువచ్చారని తెలిపారు. అధికార కాంగ్రెస్ ను వదిలేసి ప్రతిపక్ష బీఆర్ఎస్‌లో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు చేరుతున్నారంటే రేవంత్ ప్రభుత్వం పతనానికి ఇదే సంకేతమన్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు 35 సార్లు ఢిల్లీ వెళ్లి చేసిందేమిటని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లోనూ పట్నం నరేందర్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్‌లో చేరారని అన్నారు. గడిచిన 48 గంటల్లో రాష్ట్రంలో ఏడుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదం జరిగి 8 మంది కార్మికులు చిక్కుకుపోయారని, రేవంత్ రెడ్డి మాత్రం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాడన్నారు. ఆ ఎన్నికతో గవర్నమెంట్ మారేది లేదు.. ప్రభుత్వం తలకిందులు అయ్యేది లేదు. కానీ దాని కోసం హెలీకాప్టర్‌లో పోయి ప్రచారం చేయడం ఏమిటని నిలదీశారు.
రైతు ఆత్మహత్య చేసుకుంటున్నా.. కార్మికులు సొరంగంలో ఇరుక్కుపోయారనే సోయి లేకుండా రేవంత్ రెడ్డి గాల్లో చక్కర్లు కొడతున్నారని అన్నారు. 35 సార్లు ఢిల్లీకి పోయినా కనీసం మంత్రివర్గ విస్తరణ కూడా చేసుకోలేని అసమర్థుడు రేవంత్ అన్నారు. ఆయన కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తానంటున్నాడు అని ఎద్దేవా చేశారు. ''రేవంత్ తెల్లారిలేస్తే కేసీఆర్ జపం చేయని రోజు ఉండదు. నిద్రలో కూడా కేసీఆరే యాదికి వస్తున్నట్లుంది. వాస్తవం ఏందంటే.. రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు ముందు దగ్గరి దోస్తులకు ఇలా చెప్పుకున్నడంట.. మనం గెలుస్తలేం.. ప్రతిపక్షంలో ఉండి గట్టిగా కొట్లాడాలి.. కేసీఆర్ ఉన్నన్ని రోజుల గెలువం అని చెప్పుకున్నడట. కానీ ప్రజలు లక్కీ లాటరీలో ఆయనను గెలిపించారు..'' అన్నారు. లగచర్లలో తన అల్లుడి ఫ్యాక్టరీకి భూములు ఇవ్వనందుకే అక్కడి రైతులపై రేవంత్ రెడ్డి అక్రమ కేసులు పెట్టి జైలులో పెట్టిండని.. వాళ్ల కోసం ఢిల్లీ వరకు వెళ్లి కొట్లాడి బెయిల్ ఇప్పించామన్నారు. కడియం శ్రీహరికి దమ్ముంటే రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఎమ్మెల్యేలు పార్టీ మారిన పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయని.. బీఆర్‌ఎస్ బంపర్ మెజార్టీతో గెలుస్తుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఏడాదికి రూ.40 వేల కోట్ల అప్పు చేసి ప్రాజెక్టులు, పవర్ ప్రాజెక్టులు కట్టిందని.. ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 14 నెలల్లో రూ.1.50 లక్షల కోట్ల అప్పు చేసి ఏం చేసిందో చెప్పాలన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం రాజీలేకుండా కొట్లాడేది కేసీఆర్, గులాబీ సైన్యమేనన్నారు. పార్టీ రజతోత్సవ సంబరాలను ఘనంగా జరుపుకుందామని పిలుపునిచ్చారు.