Telugu Global
Telangana

భూ భారతి భూ హారతి అయ్యేలా కనిపిస్తోంది

భూమేతకే ఇది దారి తీస్తుంది.. ఇది తిరోగమన చర్య : కౌన్సిల్‌లో ఎమ్మెల్సీ కవిత

భూ భారతి భూ హారతి అయ్యేలా కనిపిస్తోంది
X

రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూ భారతి చట్టం భూ హారతి అయ్యేలా కనిపిస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. శాసన మండలిలో భూభారతిపై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ పోర్టల్‌ భూమేతకు దారి తీస్తుందేమోనని సందేహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్‌ అంటే భూ రక్షణ సమితి అని రైతులు, ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. భూమి కోసం ప్రాణమిచ్చేది సైనికుడు, రైతు మాత్రమేనన్నారు. ఏమైనా సమస్యలు వస్తే వాటిని పరిష్కరించుకొని ముందుకెళ్లాలి తప్పా వ్యవస్థనే రద్దు చేయడం సరికాదన్నారు. ధరణిలో కుట్ర కోణం ఉన్నదని ప్రభుత్వం చెప్పడం దారుణమన్నారు. తెలంగాణలో 2.8 కోట్ల ఎకరాల భూమి ఉంటే అందులో 1.5 కోట్ల ఎకరాలు సాగు భూమి అని.. 17.8 లక్షల ఎకరాలు మాత్రమే వివాదాల్లో ఉన్నాయని తెలిపారు. ధరణి పోర్టల్‌ అమల్లోకి వచ్చిన తర్వాత భూమోసాలు లేకుండా పోయాయన్నారు. రాష్ట్ర రైతలకు ఇది రక్షణ కవచంలా నిలిచిందన్నారు. ధరణితో ఆటలాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చరిత్ర క్షమించదని, ప్రజలు వెంటబడి మరీ ధరణిని తిరిగి సాధించుకుంటారని తేల్చిచెప్పారు.

గతంలో కౌలుదారులు కేసులు వేస్తే 20 నుంచి 25 ఏళ్ల పాటు రైతులు కోర్టుల చుట్టు తిరిగే పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. అందేకే కేసీఆర్ రైతుకు మాత్రమే భూమికి యాజమన్య హక్కు ఉండే విధంగా మార్పులు చేశారన్నారు. ధరణితో అనేక భూ సమస్యలు పరిష్కారమయ్యాయని, వంద రోజుల్లో రెవెన్యూ రికార్డులు ప్రక్షాళన చేశారన్నారు. ఆ తర్వాతే భూముల వివరాలు ధరణిలో నమోదు చేశారన్నారు. ధరణి కన్నా ముందు చార్మినార్‌ కూడా రిజిస్ట్రేషన్‌ చేసుకునే పరిస్థితి ఉండేదన్నారు. ధరణి పోర్టల్‌తో ప్రభుత్వ భూములను కాపాడారని తెలిపారు. రిజిస్ట్రేషన్ల వ్యవస్థను ప్రభుత్వం ప్రజలకు చేరువ చేసిందన్నారు. రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ ఒకేసారి చేయడంతో రైతులకు మేలు కలిగిందన్నారు. భూ రికార్డుల సరిగ్గా ఉండడంతోనే భూములు రేట్లు పెరిగాయని రాష్ట్ర సంపద పెరిగిందన్నారు. మాన్యువల్ పహాణీలతో రాష్ట్రంలో అనేక వివాదాలు ఉండేవని వాటిని ధరణి తీర్చిందన్నారు.

రాష్ట్రంలో 66 లక్షల మందికి రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు ఇచ్చిందని, గతంలో పంట రుణాలు కూడా వచ్చేవి కావని, ధరణి వచ్చిన తర్వాత బ్యాంకులు పంట రుణాలు ఇవ్వడం మొదలుపెట్టాయన్నారు. తద్వారా ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి రైతులు విముక్తులయ్యారని తెలిపారు. భూదాన్, అటవీ, ప్రభుత్వ భూములు అన్యక్రాంతం కాకుండా ఉండేందుకు వాటిని పార్ట్ బీ లో చేర్చామన్నారు. ఎంజాయ్ మెంట్ సర్వే చేయిస్తామని ప్రభుత్వం చెప్తోందని, దీని వల్ల గ్రామాల్లో లేని తగాదాలు మొదలువుతాయన్నారు. పల్లెలు ప్రశాంతంగా ఉండాలంటే ఎంజాయ్ మెంట్ సర్వే తేనెతుట్టెను కదపొద్దన్నారు. మళ్లీ 32 కాలమ్ లతో పహాణీలు తెస్తే మళ్లీ పాత వ్యవస్థ వస్తుందన్నారు. రైతుల మధ్య వివాదాలు తలెత్తుతాయి, కేసులు, ఆర్థిక భారం అవుతుందన్నారు. రాష్ట్రమంతా ఒకే సారి కాకుండా దశల వారీగా రీసర్వే చేయాలన్నారు. ఎవరూ ట్యాంపర్ చేయడానికి వీలు లేకుండా పాస్ బుక్ లు ఉన్నాయని అలాంటప్పుడు భూధార్‌ కార్డులు ఎందుకని ప్రశ్నించారు. హైదరాబాద్ చుట్టుముట్టున్న ఆబాదీ భూములపై ప్రభుత్వం పెద్దల కన్ను పడిందని ప్రచారం జరుగుతోందని, భూభారతి వల్ల తప్పు జరిగితే ప్రభుత్వ ఉద్యోగులకు శిక్ష వేస్తామని భయపెట్టడం సరికాదన్నారు. భూభారతిలో కౌలుదారులు, అనుభవదారుల కాలమ్ పెట్టే ఆలోచనను విరమించుకోవాలని, కౌలుదారులను వేరే విధంగా ఆదుకోవాలని సూచించారు.

First Published:  21 Dec 2024 5:21 PM IST
Next Story