కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలు కోసం ఆటోడ్రైవర్లు ఆందోళనలకు సిద్ధమయ్యారు. ఈనెల 15న రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆటో డ్రైవర్ల జేఏసీ స్టేట్ కన్వీనర్ వెంకటేశం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 24న అన్ని రాజకీయ పార్టీల నేతలతో సమావేశమై తమ ఆందోళనకు మద్దతునివ్వాలని కోరుతామన్నారు. గతంలో తాము సమ్మెకు పిలుపునిస్తే ఇంటికి పిలిచి చర్చలు జరిపిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ నాలుగు నెలలు గడుస్తున్నా హామీల అమలును పట్టించుకోవడం లేదన్నారు. ఆటో డ్రైవర్లకు నెలకు రూ.12 వేలు ఇస్తామని హామీ ఇచ్చినా ఆ పథకం అమలు చేయలేదన్నారు. మహాలక్ష్మీ పథకంతో తామంతా రోడ్డున పడ్డామన్నారు. త్వరలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారని.. ఈ నేపథ్యంలో ఆటో కార్మికుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, రూ.10 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Add A Comment