బీజేపీ మనువాద పార్టీ అని అమిత్ షా వ్యాఖ్యలు నిరూపించాయి
ఎమ్మెల్యేలు మాణిక్ రావు, అనిల్ జాదవ్, విజేయుడు
బీజేపీ మనువాద పార్టీ అని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు మరోసారి నిరూపించాయని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు. గురువారం తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, విజేయుడుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్‌ను అమిత్ షా తీవ్రంగా అవమానించారని.. ఆయనను ఎన్నికల్లో ఓడించిన చరిత్ర కాంగ్రెస్, జన సంఘ్‌లదని గుర్తు చేశారు. అంబేద్కర్ నిజంగా దేవుడేనని చెప్పారు. ఆయనను ఎవరు అవమానించినా తప్పేనన్నారు. అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ పార్టీ తరపున ఖండిస్తున్నామని చెప్పారు. బీజేపీ నిజస్వరూపాన్ని అమిత్ షా బయట పెట్టారని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. అంబేద్కర్ తమ పాలిట దేవుడేనని చెప్పారు. అంబేద్కర్‌పై కాంగ్రెస్ మొసలి కన్నీళ్లు కారుస్తోందన్నారు. ఆయనను కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు ఓడించిందని గుర్తు చేశారు. 400 ఎంపీ సీట్లు ఇస్తే బీజేపీ రాజ్యాంగాన్ని మార్చేసదని అమిత్ షా వ్యాఖ్యలు రుజువు చేస్తున్నాయన్నారు. అసెంబ్లీ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం కాంగ్రెస్ సొంతమన్నట్టుగా వ్యవహరిస్తున్నారని.. తాము అక్కడ నిరసన తెలిపేందుకు అనుమతివ్వాలని డిమాండ్ చేశారు.