రాజ్యాంగంపై గౌరవంతోనే ఏసీబీ ఆఫీస్‌కు వచ్చా
నేను మర్యాదగా విచారణకు సహకరిస్తుండగా.. ఇంతమంది పోలీసులు ఎందుకు ? అని కేటీఆర్ ప్రశ్న
ఫార్ములా- ఈ కార్ రేసు కేసులో ఏసీబీ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ప్రశ్నించనున్నది. విదేశీ సంస్థకు నిధుల బదిలీ, నిబంధనల ఉల్లంఘనపై విచారణ జరగనున్నది. కేటీఆర్ విచారణకు హాజరుకానుండటంతో ఏసీబీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.ఏసీబీ ఆఫీస్‌కు బయలుదేరే ముందు కేటీఆర్ తన న్యాయవాదులతో చర్చించారు. మరోవైపు ఈ కేసులో కేటీఆర్‌ను విచారించడానికి డీజీ విజయ్ కుమార్, డైరెక్టర్ తరుణ్ జోషి ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. కేటీఆర్ నందినగర్‌లోని నివాసం నుంచి తన న్యాయవాదుల తో కలిసి ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఇవాళ ఏసీబీ ఆఫీసుకు రమ్మన్నారు. నన్ను అడుగుతున్న సమాచారమం మొత్తం ప్రభుత్వం వద్దనే ఉన్నది. గతంలో ఒక మంత్రిగా, ప్రభుత్వంలో నేను నిర్ణయం తీసుకున్నాను. నా వద్ద సమాచారం ఉన్నదని అపోహ పడుతున్నారు. అయితే వారు అపోహ పడుతున్న సమాచారంమంతా ప్రభుత్వం వద్దనే ఉన్నది. నా వాదన ఇప్పటికే కోర్టులో చెప్పాను. కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. హైకోర్టు, చట్టాలు, రాజ్యాంగంపై గౌరవంతోనే ఏసీబీ ఆఫీస్‌కు వచ్చాను. ఈ క్రమంలోనే ఏసీబీ విచారణకు పోలీసులు అడ్వకేట్‌ను అనుమతించలేదు. దీనిపై కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. నాకు న్యాయవాదిని తీసుకొచ్చే హక్కు ఉందని తెలిపారు. నా లాయర్‌ను నాతో రావద్దని చెబుతున్నారు. నా లాయర్‌ను వెంటపెట్టుకుని విచారణకు వచ్చే అధికారం ఉందని అనుకుంటున్నాను అన్నారు. భారత రాజ్యాంగం నడుస్తుందని అనుకుంటున్నాను. అయితే తెలంగాణలో రేవంత్‌రెడ్డి రాజ్యాంగమే నడుస్తుందని వాళ్లు అంటున్నారు. హైకోర్టు తీర్పు రిజర్వ్ చేశాక నన్ను పిలవాల్సిన అవసరం లేదు. నేను మర్యాదగా విచారణకు సహకరిస్తుండగా.. ఇంతమంది పోలీసులు ఎందుకు ? అని ప్రశ్నించారు. న్యాయవాదిని అనుమతించమని ఏసీబీ వాళ్లు చెప్పాలని, మీరెందుకు చెబుతున్నారని కేటీఆర్ పోలీసులను ప్రశ్నించారు.