ద్రవిడ్, కోహ్లీ సరసన జైస్వాల్.. గవాస్కర్ రికార్డుపై కన్ను
ఒక సిరీస్‌లో 600కు పైగా పరుగులను గవాస్కర్, కోహ్లీ రెండేసిసార్లు సాధించారు. దిలీప్ సర్దేశాయ్, రాహుల్ ద్రవిడ్ కూడా ఈ ఘనత సాధించారు. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు 618 పరుగులు చేసిన జైస్వాల్ వారి సరసన నిలబడటం విశేషం.
ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మ్యాచ్ మ్యాచ్‌కూ రికార్డుల సంఖ్య పెంచుకుంటూ పోతున్నాడు. వరుసగా రెండు డబుల్ సెంచరీలతో గత మ్యాచ్‌లో రికార్డు సృష్టించాడు. నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 73 పరుగులు చేయడం ద్వారా ఒక సిరీస్‌లో 600కు పైగా పరుగులు చేసిన ఆటగాడిగా గవాస్కర్, ద్రవిడ్, కోహ్లి వంటి దిగ్గజాల సరసన చేరాడు.
ఒక సిరీస్‌లో 600కు పైగా పరుగులను గవాస్కర్, కోహ్లీ రెండేసిసార్లు సాధించారు. దిలీప్ సర్దేశాయ్, రాహుల్ ద్రవిడ్ కూడా ఈ ఘనత సాధించారు. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు 618 పరుగులు చేసిన జైస్వాల్ వారి సరసన నిలబడటం విశేషం. అయితే ఒక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగుల రికార్డు 774 పరుగులతో గవాస్కర్ పేరిట ఉంది. ఈ సిరీస్‌లో మరో మూడు ఇన్నింగ్స్‌లకు అవకాశం ఉన్నందున జైస్వాల్ ఆ రికార్డునూ తుడిచిపెట్టేస్తాడా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.
రెండు సెంచరీలు మిస్..
ఇంగ్లాండ్‌తో సిరీస్లో వరుస మ్యాచ్‌ల్లో డబుల్ సెంచరీలు బాదిన జైస్వాల్ మరో రెండు సెంచరీలు మిస్ చేసుకున్నాడు. తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 80 పరుగులకు, నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 73 పరుగులకు ఔటయ్యాడు. ఈ రెండూ కూడా సెంచరీలుగా మలచదగ్గ ఇన్నింగ్స్‌లే. తాజాగా 73 పరుగులకు అవుటైనదైతే క్లియర్‌గా నాటౌట్ అని తేలినా అంపైర్ కాల్‌కు బలయ్యాడు.