Telugu Global
Sports

బీసీసీఐ వార్షిక కాంట్రాక్టు జాబితాలో యశస్వి, శివం దూబే!

2023-24 సీజన్ కు బీసీసీఐ వార్షిక కాంట్రాక్టుల్లో భారీగా మార్పులు చేర్పులు చోటు చేసుకోనున్నాయి. మొత్తం 26 మంది క్రికెటర్లతో కూడిన నాలుగు గ్రేడ్ల కాంట్రాక్టు వివరాలను బోర్డు సిద్ధం చేస్తోంది.

బీసీసీఐ వార్షిక కాంట్రాక్టు జాబితాలో యశస్వి, శివం దూబే!
X

2023-24 సీజన్ కు బీసీసీఐ వార్షిక కాంట్రాక్టుల్లో భారీగా మార్పులు చేర్పులు చోటు చేసుకోనున్నాయి. మొత్తం 26 మంది క్రికెటర్లతో కూడిన నాలుగు గ్రేడ్ల కాంట్రాక్టు వివరాలను బోర్డు సిద్ధం చేస్తోంది.

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ బోర్డు బీసీసీఐ వార్షిక కాంట్రాక్టులకు కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. 2023-2024 సీజన్ కోసం బోర్డు మొత్తం 26 మంది సభ్యుల క్రికెటర్ల జాబితాను సిద్ధం చేస్తోంది.

ఆటగాళ్ల అనుభవం, ఆడే ఫార్మాట్లను బట్టి గ్రేడ్లను నిర్ణయించనుంది. కాంట్రాక్టు జాబితాలో చోటు సంపాదించిన ఆటగాళ్లకు 7 కోట్ల రూపాయల నుంచి కోటి రూపాయల వరకూ గ్యారెంటీ మనీని ఆడినా, ఆడకపోయినా చెల్లించనున్నారు.

కాంట్రాక్టు జాబితాలో ముంబై యువజోడీ...

ముంబై యువజోడీ యశస్వీ జైశ్వాల్, శివం దూబే సరికొత్తగా వార్షిక కాంట్రాక్టు జాబితాలో చోటు దక్కించుకోడం ఖాయంగా కనిపిస్తోంది. అప్ఘనిస్థాన్ తో వన్డే సిరీస్ లో అద్భుతంగా రాణించిన శివం దూబేతో పాటు..టెస్టు క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న యశస్వి జైశ్వాల్ కు గ్రేడ్- సీ కాంట్రాక్టు దక్కనుంది.

గతేడాది జులైలో వెస్టిండీస్ ప్రత్యర్థిగా టెస్టు అరంగేట్రం చేసిన యశస్వి జైశ్వాల్ ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్ లోని రెండోటెస్టులో డబుల్ సెంచరీ సాధించడం ద్వారా వార్షిక కాంట్రాక్టు ఖాయం చేసుకోగలిగాడు.

భారత్ తరపున 16 టీ-20 మ్యాచ్ లు ఆడిన రికార్డు సైతం 22 సంవత్సరాల యశస్వికి ఉంది. 16 మ్యాచ్ లలో 498 పరుగులతో 163.81 స్ట్ర్రయిక్ రేట్, 35.57 సగటు సాధించాడు. ప్రస్తుత సిరీస్ లోని మూడో టెస్టు వరకా 7 మ్యాచ్ లు ఆడిన యశస్వి ఓ డబుల్ సెంచరీ, సెంచరీతో పాటు రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. 500 కు పైగా పరుగులు సాధించాడు.

టీ-20ల్లో శివం దూబే మెరుపులు..

దేశవాళీ రంజీట్రోఫీలో ముంబై తరపున, ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున అంచనాలకు మించి రాణిస్తున్న శివం దూబే..అఫ్గనిస్థాన్ తో ముగిసిన టీ-20 సిరీస్ లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు.

ఇప్పటి వరకూ ఆడిన 20 టీ-20 మ్యాచ్ ల్లో 275 పరుగులు సాధించడంతో పాటు 8 వికెట్లు పడగొట్టాడు. హార్థిక్ పాండ్యా కు బదులుగా స్టాండ్ బై ఆల్ రౌండర్ గా శివం

సత్తా చాటుకొన్నాడు. బీసీసీఐ వార్షిక కాంట్రాక్టులో శివం దూబేకు సీ-గ్రేడ్ దక్కనుంది.

బీసీసీఐ వార్షిక కాంట్రాక్టుల్లో భాగంగా... ఏ+ గ్రేడ్ ఆటగాళ్లకు ఏడాదికి 7 కోట్ల రూపాయలు, ఏ - గ్రేడ్ క్రికెటర్లకు 5 కోట్ల రూపాయలు, బీ- గ్రేడ్ క్రికెటర్లకు 3 కోట్ల రూపాయలు, సీ- గ్రేడ్ ఆటగాళ్లకు కోటి రూపాయలు చొప్పున బీసీసీఐ చెల్లించనుంది.

భారత వన్డే, టెస్టు, టీ-20 జట్లలో చోటు దక్కినా..దక్కక పోయినా కాంట్రాక్టు జాబితాలో ఉన్న ఆటగాళ్లకు గ్యారెంటీ మనీగా కాంట్రాక్టు మొత్తాన్ని అంద చేస్తారు.

భారత కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ, వైస్ కెప్టెన్ జస్ ప్రీత్ బుమ్రా మాత్రమే ఏ+ గ్రేడ్ ఆటగాళ్లుగా ఏడాదికి 7 కోట్ల రూపాయలు చొప్పున అందుకొంటున్నారు.

మార్చి 26న బీసీసీఐ వార్షిక కాంట్రాక్టు జాబితాను విడుదల చేయనుంది.

First Published:  20 Feb 2024 8:19 AM IST
Next Story