Telugu Global
Sports

హాట్ ఫేవరెట్ ఢిల్లీ.. మహిళా ఐపీఎల్ టైటిల్ పోరుకు రెడీ!

2024 మహిళా ఐపీఎల్ టైటిల్ సమరానికి హాట్ ఫేవరెట్ ఢిల్లీ క్యాపిటల్స్, డార్క్ హార్స్ బెంగళూరు రాయల్ చాలెంజర్స్ సై అంటే సై అంటున్నాయి.

హాట్ ఫేవరెట్ ఢిల్లీ.. మహిళా ఐపీఎల్ టైటిల్ పోరుకు రెడీ!
X

2024 మహిళా ఐపీఎల్ టైటిల్ సమరానికి హాట్ ఫేవరెట్ ఢిల్లీ క్యాపిటల్స్, డార్క్ హార్స్ బెంగళూరు రాయల్ చాలెంజర్స్ సై అంటే సై అంటున్నాయి.

దేశంలోని లక్షలాదిమంది అభిమానులను గత రెండువారాలుగా అలరిస్తూ వచ్చిన 2024 సీజన్ మహిళా ఐపీఎల్ పోరు తుది అంకానికి చేరింది. న్యూఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాత్రి 7-30కి ప్రారంభమయ్యే టైటిల్ పోరులో గతేడాది రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ కు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సవాలు విసురుతోంది.

ఢిల్లీని ఊరిస్తున్న టైటిల్...

ఐదుజట్ల రౌండ్ రాబిన్ లీగ్ లో అత్యధిక విజయాలతో పాటు 12 పాయింట్లు సాధించడం ద్వారా నేరు ఫైనల్లో అడుగుపెట్టిన మెగ్ లానింగ్ నాయకత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ..హాట్ ఫేవరెట్ గా టైటిల్ సమరానికి సిద్ధమయ్యింది.

గతేడాది ఫైనల్లో ముంబై ఇండియన్స్ చేతిలో 7 వికెట్ల పరాజయం పొందిన ఢిల్లీజట్టు వరుసగా రెండోసీజన్ లోనూ ఫైనల్స్ చేరడం ద్వారా సత్తా చాటుకోగలిగింది.

లీగ్ దశ ఆఖరి రౌండ్ లో గుజరాత్ జెయింట్స్ ను చిత్తు చేసిన ఆత్మవిశ్వాసంతో ఫైనల్లో ఢిల్లీ పోటీకి దిగుతోంది.

హోంగ్రౌండ్లో ఢిల్లీకి అంతా అనుకూలమే...

లీగ్ దశ మ్యాచ్ లన్నీ హోంగ్రౌండ్ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఆడటమే కాదు..అత్యధిక విజయాలతో 12 పాయింట్లు సాధించడం ద్వారా ఢిల్లీ క్యాపిటల్స్ ఎనలేని ఆత్మవిశ్వాసంతో టైటిల్ వేటకు సిద్ధమయ్యింది.

సీనియర్ బ్యాటర్ మెగ్ లానింగ్, వీరబాదుడు షెఫాలీవర్మతో పాటు..జెమీమా రోడ్రిగేజ్ సైతం నిలకడగా రాణిస్తూ కళ్లు చెదిరే ఫామ్ లో ఉండటం ఢిల్లీకి అదనపు బలంగా ఉంది. బ్యాటింగ్ ఆర్డర్లో అలీస్ కాప్సే, జెస్ జోనాస్ సన్, రాథాయాదవ్, తాన్యా భాటియా, బౌలింగ్ విభాగంలో మార్జీనా కాప్, మిన్ను మణి, టిటాస్ సాధు లాంటి బౌలర్లతో పటిష్టంగా కనిపిస్తోంది.లానింగ్, షెఫాలీ, జెమీమాలలో ఏ ఇద్దరు రాణించినా బెంగళూరు బౌలర్లకు కష్టాలు తప్పవు,

బెంగళూరుకు భలే చాన్సులే...

ఐదుజట్ల రౌండ్ రాబిన్ లీగ్ లో మూడోస్థానంలో నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు..ఎలిమినేటర్ రౌండ్లో ముంబై ఇండియన్స్ ను 5 పరుగులతో కంగు తినిపించడం ద్వారా తొలిసారిగా ఫైనల్లో అడుగుపెట్టింది.

ఆల్ రౌండర్ ఎల్సీ పెర్రీతో పాటు స్పిన్ త్రయం శ్రీయాంకా పాటిల్, సోఫీ మోలినెక్స్, ఆషా శోభన తమజట్టు ఫైనల్ చేరడంలో ప్రధానపాత్ర వహించారు. ఫైనల్లో సైతం నిలకడగా రాణించగలిగితేనే పవర్ ఫుల్ ఢిల్లీని నిలువరించే అవకాశం ఉంటుంది.

స్మృతి మంధన నాయకత్వంలోని బెంగళూరుజట్టు స్థాయికి తగ్గట్టుగా రాణించగలిగితేనే ఐపీఎల్ విజేత కాగలుగుతుంది. అయితే భీకర బ్యాటింగ్ లైనప్ కలిగిన ఢిల్లీ కి పగ్గాలు వేయడం ఏమంత తేలికకాబోదు. బెంగళూరు విజేతగా నిలవాలంటే సీనియర్ ఆల్ రౌండర్ ఎల్సీ పెర్రీతో పాటు కెప్టెన్ కమ్ ఓపెనర్ స్మృతి మంధన అత్యుత్తమంగా రాణించి తీరక తప్పదు.

ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన జట్టు 140 నుంచి 150 పరుగుల స్కోరు సాధించగలిగితేనే విన్నర్ గా నిలిచే అవకాశం ఉంది.

ఢిల్లీ జట్టుకు పంత్, పాంటింగ్ బెస్టాఫ్ లక్...

మహిళా ఐపీఎల్ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజేతగా నిలవాలని కోరుతూ పురుషులజట్టు కెప్టెన్ రిషభ్ పంత్, కోచ్ రికీ పాంటింగ్ శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి ఒత్తిడిలేకుండా స్థాయికి తగ్గట్టుగా ఆడాలని సలహా ఇచ్చారు.

First Published:  17 March 2024 5:00 PM IST
Next Story