Telugu Global
Sports

మహిళల టీ20 వరల్డ్‌ కప్‌: కివీస్‌ సెమీస్‌కు.. ఇండియా ఇంటికి

ఈ మ్యాచ్‌లో పాక్‌ గెలిస్తే భారత్‌ సెమీస్‌కు చేరే అవకాశం ఉండేది.. కానీ న్యూజిలాండ్‌ చేతిలో చిత్తుగా ఓడిన పాక్‌

మహిళల టీ20 వరల్డ్‌ కప్‌: కివీస్‌ సెమీస్‌కు.. ఇండియా ఇంటికి
X

ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌లో టీమిండియాకు నిరాశే మిగిలింది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ చిత్తుగా ఓడిపోవడంతో భారత్‌ సెమీస్‌ అవకాశాలు గల్లంతయ్యాయి. మొదట బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 110 రన్స్‌ చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన పాక్‌ జట్టు 11.4 ఓవర్లలో 56 రన్స్‌కే ఆలౌటై చతికిలపడింది. ఈ విజయంతో న్యూజిలాండ్‌ సెమీస్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ గెలిచి ఉంటే భారత్‌ సెమీస్‌కు చేరే అవకాశం ఉండేది.

పాక్‌ బ్యాటర్లలో ఫాతిమా సనా (21) టాప్‌ స్కోరర్‌. మునీబా అలీ (15) రన్స్‌ చేసింది. మిగతా వాళ్లంతా సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. పాకిస్థాన్‌ జట్టులో ఏకంగా నలుగురు డకౌట్‌ అయ్యారు. న్యూజిలాండ్‌ బౌలర్లు సమిష్టిగా రాణించారు. అమేలియా కేర్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. ఈడెన్‌ కార్సన్‌ రెండు, రోజ్‌మేరీ మైర్‌, లీ తాహుహు, ఫ్రాన్‌ జోనాస్‌లు ఒక్కో వికెట్‌ తీశారు. 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో మూడోస్థానంలో కొనసాగిన కివీస్‌.. తాజా గెలుపుతో సెమీస్‌ బెర్త్‌ ఖాయం చేసుకున్నది.

అంతకుముందు మొదట బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ ఓపెనర్లు సుజీ బేట్స్‌ (28), జార్జియా ప్లిమ్మర్‌ (17) శుభారంభాన్ని అందించారు. ఈ జోడి మొదటి వికెట్‌కు 41 రన్స్‌ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. తర్వాత కివీస్‌ స్వల్ప వ్యవధిలోనే మూడు వికెట్లు చేజార్చుకోవడంతో స్కోర్‌ బోర్డు వేగం మందగించింది. బ్రూక్‌ (22), సోఫి డివైన్‌ (19) రన్స్‌ చేయడంతో న్యూజిలాండ్‌ 100కు పైగా స్కోర్‌ చేయగలిగింది. పాక్‌ బౌలర్లలో నష్రా సంధు (3/18) అదరగొట్టగా.. సైదా ఇక్బాల్‌, ఒమైమా, నిదా దార్‌ చెరో వికెట్‌ తీశారు.

First Published:  14 Oct 2024 6:04 PM GMT
Next Story