Telugu Global
Sports

కుస్తీ క్రీడకు ఓ దండం- సాక్షి మాలిక్ కన్నీరు మున్నీరు!

కుస్తీ క్రీడలో తాను పాల్గొనేది లేదని ఒలింపిక్స్ మెడలిస్ట్ సాక్షి మాలిక్ మరోసారి స్పష్టం చేసింది...

కుస్తీ క్రీడకు ఓ దండం- సాక్షి మాలిక్ కన్నీరు మున్నీరు!
X

కుస్తీ క్రీడలో తాను పాల్గొనేది లేదని ఒలింపిక్స్ మెడలిస్ట్ సాక్షి మాలిక్ మరోసారి స్పష్టం చేసింది...

భారత్ కు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన మల్లయోధురాలు, ఒలింపిక్స్ మెడలిస్ట్ సాక్షీ మాలిక్ మరోసారి గొంతు విప్పింది. పారిస్ ఒలింపిక్స్ లో మాత్రమే కాదు..కుస్తీ బరిలోకి తిరిగి దిగే ఆలోచన తనకు లేదని తేల్చిచెప్పింది.

దోషులు దర్జాగా తిరుగుతుంటే కుస్తీ ఎలా?

ఏడుగురు మహిళా వస్తాదులను లైంగికంగా వేధించిన జాతీయ కుస్తీ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ ఎలాంటి శిక్ష లేకుండా దర్జాగా తిరుగుతుంటే తాను కుస్తీ క్రీడలో తిరిగి ఎలా పాల్గొనగలనని సాక్షి ప్రకటించింది.

రియో ఒలింపిక్స్ లో భారత్ సాధించిన పతకాలలో సాక్షి మాలిక్ గెలిచిన కాంస్య పతకం సైతం ఉంది. ఆసియా, ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్ లో సైతం భారత్ కు పతకాలు సంపాదించి పెట్టిన ఘనత సాక్షి మాలిక్ కు ఉంది.

అయితే..బ్రిజ్ భూషణ్ ను అరెస్టు చేసి శిక్షించాలంటూ సహ రెజ్లర్లు వినీత పోగట్, బజరంగ్ పూనియాలతో కలసి సాక్షి మాలిక్ గత కొద్దిమాసాలుగా అలుపెరుగని పోరాటమే చేసింది.

అధికార పార్టీ దన్నుతో....

భారత కుస్తీ సమాఖ్య అధ్యక్షుడిగా పదేళ్లకాలం పాటు చక్రం తిప్పిన బ్రిజ్ భూషణ్ పలువురు మహిళా వస్తాదులను లైంగికంగా, మానసికంగా వేధించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఏడుగురు బాధిత రెజ్లర్లతో సహా మొత్తం 30 మంది వస్తాదులు తిరుగుబాటు చేసి న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నెలరోజులపాటు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

బ్రిజ్ భూషణ్ శరణ్ బీజెపీ ఎంపీ కావడంతో ఎలాంటి శిక్ష లేకుండా తప్పించుకోగలిగారు. అధికార పార్టీ అండదండలు పుష్కలంగా ఉండడంతో దర్జాగా తిరుగుతూ ఉండడంతో సాక్షి మాలిక్ తీవ్రనిరాశకు గురయ్యింది.

బ్రిజ్ భూషణ్ తో పోరాటంలో తాను మానసికంగా అలసి పోయానని, ఓ నిందితుడు, ఆయన అనుచరుడు సంజయ్ సింగ్ చేతిలో జాతీయ కుస్తీ సమాఖ్య ఉన్నంతకాలం తాను కుస్తీ బరిలో నిలిచే ప్రసక్తే లేదంటూ 31 సంవత్సరాల సాక్షి తన రిటైర్మెంట్ ను కొద్ది మాసాల క్రితమే ప్రకటించింది.

జాతీయ కుస్తీ సమాఖ్య అధ్యక్ష పదవి నుంచి బ్రిజ్ భూషణ్ ను తీవ్రఒత్తిడి, విమర్శల నడుమ తొలగించారు. ఆ తరువాత నిర్వహించిన ఎన్నికల్లో సైతం బ్రిజ్ భూషణ్ చేతిలో కీలుబొమ్మలాంటి సంజయ్ సింగ్ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టడంతో సాక్షి మాలిక్ మరింతగా కృంగిపోయింది.

మహిళావస్తాదులను లైంగికంగా వేధించి, ఎలాంటి శిక్ష పడకుండా దర్జాగా తిరుగుతూ తమ చేతుల్లోనే జాతీయ కుస్తీ సమాఖ్యను ఉంచుకోడం దారుణం అంటూ మండిపడింది. తన కంఠంలో ఊపిరి ఉన్నంత వరకూ తిరిగి కుస్తీ పోటీలలో పాల్గొనే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.

ఒలింపిక్స్ కుస్తీ మహిళల విభాగంలో దేశానికి పతకం తెచ్చిన తొలి రెజ్లర్ తానేనని, తాను కాంస్యం మాత్రమే సాధించానని, తమ వారసులుగా వచ్చే వస్తాదులు రజత, స్వర్ణ పతకాలు సాధించడం ద్వారా దేశానికి గర్వకారణంగా నిలవాలంటూ పిలుపు నిచ్చింది.

సాక్షి, బజరంగ్ ఒకే మాట....

బ్రిజ్ భూషణ్ తొత్తు సంజయ్ సింగ్ జాతీయ కుస్తీ సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్నంతకాలం, బ్రిజ్ భూషణ్ కనుసన్నలలో కుస్తీ సమాఖ్య మనుగడ సాగించినంత కాలం తాము భారత్ తరపున అంతర్జాతీయ కుస్తీ పోటీలలో పాల్గొనేది లేదని బజరంగ్ పూనియాతో పాటు సాక్షి మాలిక్ సైతం స్పష్టం చేసింది. కుస్తీ సమాఖ్య నిర్వహించిన ఒలింపిక్స్ అర్హత పోటీలకు సైతం బజరంగ్, సాక్షి దూరంగా ఉన్నారు.

వందలాది మంది అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు సైతం తమను తిరిగి కుస్తీ పోటీలలో పాల్గొనాలంటూ కోరుతున్నారని, నిందితులు, దోషులు కుస్తీ సమాఖ్యను నడుపుతున్నంత కాలం తాము కుస్తీ బరిలోకి దిగకుండా ఉండటమే మంచిదని సాక్షి స్పష్టం చేసింది.

బ్రిజ్ భూషణ్ తనను లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురి చేయటాన్ని తాను మరచిపోలేకపోతున్నానని, తాము పడిన కష్టాలు జూనియర్ రెజ్లర్ల పడరాదనే పోరాటం చేశామని, తమ కెరియర్ ను సైతం త్యాగం చేశామని సాక్షి వివరించింది.

ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి బ్రిజ్ భూషణ్, ఆయన తొత్తుల నుంచి కుస్తీ సమాఖ్యను విముక్తం చేయాలని, తన చిత్తశుద్ధిని చాటుకోవాలని సాక్షి కోరింది.

ఒలింపిక్స్ లో దేశానికి కచ్చితంగా పతకాలు సాధించి పెట్టగల సత్తా , అనుభవం ఉన్న బజరంగ్ పూనియా, సాక్షిమాలిక్ లేకుండానే పారిస్ ఒలింపిక్స్ లో భారత్ తన అదృష్టం పరీక్షించుకోనుంది.

First Published:  5 March 2024 4:26 PM IST
Next Story