Telugu Global
Sports

న్యూయార్క్ పిచ్ పైన విరాట్ ఎందుకిలా?

భారీ అంచనాలతో 2024-టీ-20 ప్రపంచకప్ బరిలోకి దిగిన భారత స్టార్ బ్యాటర్ వరుసగా మూడుమ్యాచ్ ల్లోనూ విఫలం కావడం చర్చనీయాంశంగా మారింది.

న్యూయార్క్ పిచ్ పైన విరాట్ ఎందుకిలా?
X

భారీ అంచనాలతో 2024-టీ-20 ప్రపంచకప్ బరిలోకి దిగిన భారత స్టార్ బ్యాటర్ వరుసగా మూడుమ్యాచ్ ల్లోనూ విఫలం కావడం చర్చనీయాంశంగా మారింది...

2024- ఐసీసీ టీ-20 ప్రపంచకప్ గ్రూప్- ఏ లీగ్ మొదటి మూడుమ్యాచ్ ల్లోనూ భారత రన్ మెషీన్ విరాట్ కొహ్లీ విఫలం కావడం టీమ్ మేనేజ్ మెంట్ ను ఉక్కిరిబిక్కిరి చేయటమే కాదు...విమర్శకుల నోటికి సైతం పని చెబుతోంది.

బ్యాటింగ్ పిచ్ లపై హిట్..బౌలింగ్ పిచ్ లపై ఫట్..!

టీ-20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందు భారత్ వేదికగా జరిగిన ఐపీఎల్ -17వ సీజన్ లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఓపెనర్ గా విరాట్ కొహ్లీ 704 పరుగులతో

అత్యుత్తమ బ్యాటర్ గా నిలవడంతో పాటు ఆరెంజ్ క్యాప్ ను సైతం కైవసం చేసుకొన్నాడు. ఐపీఎల్ కోసం తయారు చేసిన బ్యాటింగ్ పిచ్ లపైన విరాట్ కొహ్లీ విశ్వరూపమే ప్రదర్శించాడు. సెంచరీలు, హాఫ్ సెంచరీలతో చెలరేగిపోయాడు. అంతేకాదు..తన కెరియర్ లో పాల్గొంటున్న ఆఖరి టీ-20 ప్రపంచకప్ టోర్నీలో ఏకంగా భారత ఓపెనర్ స్థానాన్ని..యువఓపెనర్ యశస్వి జైశ్వాల్ నుంచి రాబట్టుకొన్నాడు.

అమెరికా, వెస్టిండీస్ క్రికెట్ బోర్డుల సంయుక్త ఆతిథ్యంలో జరుగుతున్న 9వ టీ-20 ప్రపంచకప్ లో కెప్టెన్ రోహిత్ తో కలసి విరాట్ బ్యాటింగ్ ప్రారంభించడానికి నిర్ణయించాడు. విరాట్ ఆలోచనను రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలోని టీమ్ మేనేజ్ మెంట్ సైతం గౌరవించి..పూర్తిస్థాయిలో సహకరించింది.

బలిపశువుగా యశస్వీ జైశ్వాల్...

భారత క్రికెట్లో అత్యంత నిలకడగా రాణిస్తున్నయువ, స్పెషలిస్ట్ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ ను ప్రపంచకప్ జట్టు కోసం ఎంపిక చేసినా..విరాట్ కొహ్లీ కోసం టీమ్ మేనేజ్ మెంట్ బెంచ్ కే పరిమితం చేసింది.

విరాట్ కోసం యశస్వీ లాంటి ప్రతిభావంతుడైన బ్యాటర్ ను పక్కనపెట్టడం పైన విమర్శలు కూడా వెల్లువెత్తాయి. పలువురు క్రికెట్ విశ్లేషకులు టీమ్ మేనేజ్ మెంట్ ఈ నిర్ణయాన్ని సైతం తప్పుపట్టాయి.

దీనికితోడు..గ్రూప్- ఏ లీగ్ లో భాగంగా..న్యూయార్క్ లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఐర్లాండ్, పాకిస్థాన్, అమెరికాజట్లతో జరిగిన మొదటి మూడురౌండ్ల మ్యాచ్ ల్లోనూ విరాట్ దారుణంగా విఫలమయ్యాడు.

ఫాస్ట్ బౌలింగ్ కు అనువుగా తయారు చేసిన పిచ్, వాతావరణంలో విరాట్ మూడుకు మూడుమ్యాచ్ ల్లోనూ చేతులెత్తేశాడు. కొత్తబంతిని దీటుగా ఎదుర్కొనలేక గుడ్లుతేలేశాడు.

బౌలింగ్ పిచ్ లపైన విరాట్ కు కష్టమేనా?

అంతర్జాతీయ క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ టన్నుల కొద్దీ పరుగులు సాధించడంతో పాటు డజన్లకొద్దీ రికార్డులు నెలకొల్పిన విరాట్ ను..ఫాస్ట్, స్వింగ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొనలేని బలహీనత ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది.

స్వింగ్, సీమ్, పేస్ బౌలర్లకు అనువుగా ఉన్న న్యూయార్క్ పిచ్ వేదికగా పసికూన ఐర్లాండ్ తో జరిగిన పోరులో ఒక్క పరుగు మాత్రమే చేసిన విరాట్...అదే వేదికలో పాకిస్థాన్ తో జరిగిన పోరులో 2 పరుగులకు అవుటయ్యాడు. అంతేకాదు..ఆతిథ్య అమెరికాతో అదే గ్రౌండ్లో జరిగిన మూడోమ్యాచ్ లో గోల్డెన్ డక్ గా వెనుదిరిగాడు.

అమెరికాజట్టులోని భారత సంతతి పేసర్ సౌరవ్ నేత్రవల్కర్ బౌలింగ్ లో విరాట్ పరుగులేవీ చేయకుండానే అవుటయ్యాడు.

న్యూయార్క్ అంచె మొదటి మూడుమ్యాచ్ ల్లో భారత ఓపెనర్ గా విరాట్ సాధించిన స్కోర్లు 1, 2, 0 కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. స్టార్ బ్యాటర్లున్న భారత్ బ్యాటింగ్ ఆర్డర్లో అసలు విరాట్ అవసరం ఉందా అనికూడ క్రికెట్ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. యశస్వి జైశ్వాల్, సంజు శాంసన్ లాంటి ప్రతిభావంతులైన బ్యాటర్లను డగౌట్ కే పరిమితం చేసి..వరుస వైఫల్యాలు చవిచూస్తున్న విరాట్ ను ఎందుకు కొనసాగిస్తున్నారంటూ ఆకాశ్ చోప్రా, ఇర్ఫాన్ పఠాన్ లాంటి విశ్లేషకులు నిలదీస్తున్నారు.

విరాట్ ను వెనకేసుకొస్తున్న గవాస్కర్...

మరోవైపు..భారత మాజీ కెప్టెన్, సీనియర్ కామెంటీటర్ సునీల్ గవాస్కర్ మాత్రం..విరాట్ వరుస వైఫల్యాలతో భారతజట్టుకు వచ్చిన నష్టం ఏమీలేదని, స్టార్ బ్యాటర్ స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోడాన్ని చూసిచూడనట్లు వదిలేయాలని సలహా ఇచ్చాడు.

విరాట్ విఫలమైనా భారత్ మూడుకు మూడుమ్యాచ్ లూ నెగ్గి సూపర్-8 రౌండ్ చేరిందని, విరాట్ సత్తా చాటుకోవాల్సిన మ్యాచ్ లు ఇకముందున్నాయని అన్నాడు.

సూపర్-8, సెమీఫైనల్స్, ఫైనల్స్ మ్యాచ్ ల్లో విరాట్ అనుభవం, ప్రతిభ భారతజట్టుకు అత్యంత అవసరమని, విరాట్ గాడిలో పడటానికి ఒక్క ఇన్నింగ్స్ చాలని తెలిపాడు.

డాలస్ వేదికగా పసికూన కెనడాతో జరిగే లీగ్ ఆఖరి రౌండ్ పోరులో విరాట్ భారీస్కోరు సాధించడం ఖాయమని గవాస్కర్ తేల్చి చెప్పాడు. భారత్ మరోసారి టీ-20 ప్రపంచకప్ విజేతగా నిలవాలంటే కెప్టెన్ రోహిత్ తో పాటు..విరాట్ సైతం పూర్తిస్థాయిలో రాణించడం అనివార్యమని గవాస్కర్ అంటున్నాడు.

First Published:  13 Jun 2024 11:45 AM GMT
Next Story