ఐపీఎల్ లో దంచికొట్టిన ఆంధ్ర కుర్రోడు!
ఐపీఎల్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ కు ఆడుతున్న ఆంధ్రకుర్రోడు తన ఆల్ రౌండ్ ప్రతిభతో సత్తా చాటుకోడమే కాదు..తనజట్టు విజయంలో ప్రధానపాత్ర వహించాడు.
ఐపీఎల్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ కు ఆడుతున్న ఆంధ్రకుర్రోడు తన ఆల్ రౌండ్ ప్రతిభతో సత్తా చాటుకోడమే కాదు..తనజట్టు విజయంలో ప్రధానపాత్ర వహించాడు.
ఐపీఎల్ 17వ సీజన్ పోరులో కోట్ల రూపాయల మ్యాచ్ ఫీజులు అందుకొంటున్న అంతర్జాతీయ స్టార్లు వెలవెలపోతుంటే..20 లక్షల రూపాయల కనీసధరకు ఆడుతున్న దేశవాళీ క్రికెటర్లు మాత్రం అంచనాలకు మించి రాణించడం ద్వారా తమతమ ఫ్రాంచైజీలు పైసా వసూల్ అనుకొనేలా చేస్తున్నారు.
ఆంధ్ర క్రికెటర్లలో ఒకే ఒక్కడు....
ప్రస్తుత 2024 సీజన్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ కు కేవలం 20 లక్షల రూపాయల ధరకే ఆడుతున్న విశాఖ కుర్రాడు, 20 సంవత్సరాల నితీశ్ కుమార్ రెడ్డి కేవలం తన రెండోమ్యాచ్ ద్వారానే మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు.
మొహాలీ సమీపంలోని ముల్లాన్ పూర్ లో సరికొత్తగా నిర్మించిన మహారాజా యాదవింద్ర సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన థ్రిల్లర్ మ్యాచ్ నితీశ్ షోగా ముగిసింది.
ఆఖరి ఓవర్ ఆఖరు బంతి వరకూ నువ్వానేనా అన్నట్లుగా సాగిన ఈ కీలకపోరులో హైదరాబాద్ సన్ రైజర్స్ 2 పరుగుల తేడాతో కింగ్స్ పంజాబ్ పై సంచలన విజయం సాధించింది.
సన్ రైజర్స్ విజయంలో ప్రధానపాత్ర వహించిన నితీశ్ కుమార్ రెడ్డికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
సన్ రైజర్స్ కు ఊపిరి పోసిన నితీశ్...
ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ నాలుగు టాపార్డర్ వికెట్లు కోల్పోయి ఎదురీదుతున్న తరుణంలో క్రీజులోకి అడుగుపెట్టిన నితీశ్ ఎంతో అనుభవం ఉన్న బ్యాటర్ లా ఆడి 64 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
రెండోడౌన్ లో బ్యాటింగ్ కు దిగిన నితీశ్ 37 బంతుల్లోనే 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 64 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. చివరకు సన్ రైజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 182 పరుగుల స్కోరు సాధించగలిగింది.
సమాధానంగా 183 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 180 పరుగులు మాత్రమే చేయగలిగింది.
3 క్యాచ్ లు చేజారినా సన్ రైజర్స్ లక్కీ విన్......
మ్యాచ్ నెగ్గాలంటే ఆఖరి 6 బంతుల్లో 29 పరుగులు చేయాల్సిన పంజాబ్ ను మిడిలార్డర్ బ్యాటర్లు శశాంక్ సింగ్ ( 46 నాటౌట్ ), అశుతోష్ (33 నాటౌట్ ) విజయం అంచుల వరకూ తీసుకెళ్లినా సఫలం కాలేకపోయారు.
ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేయటానికి దిగిన సీనియర్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ మూడు వైడ్లతో సహా 26 పరుగులు సమర్పించుకొన్నా..సన్ రైజర్స్ ఫీల్డర్లు 3 క్యాచ్ లు జారవిడిచినా..పంజాబ్ కు పరాజయం తప్పలేదు.
నితీశ్ తన కోటా 4 ఓవర్లలో 3 ఓవర్లు బౌల్ చేసి 33 పరుగులిచ్చి 1 వికెట్ పడగొట్టి తనవంతు పాత్ర నిర్వర్తించాడు. కేవలం తన రెండో ఐపీఎల్ మ్యాచ్ లోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకొన్నాడు.
విశాఖ నుంచి ఐపీఎల్ క్రికెట్లోకి....
స్టీల్ సిటీకి చెందిన నితీశ్ కుమార్ రెడ్డి దేశవాళీ క్రికెట్లో ఆంధ్రజట్టు సభ్యుడిగా సత్తా చాటుకోడం ద్వారా ఐపీఎల్ లోకి దూసుకు రాగలిగాడు. మీడియం పేస్ ఆల్ రౌండర్ గా పేరున్న నితీశ్ రంజీట్రోఫీలో చాంపియన్ ముంబై ప్రత్యర్థిగా అత్యుత్తమంగా రాణించాడు.2020 సీజన్ ద్వారా రంజీ అరంగేట్రం చేసిన నితీశ్ కేరళ పై 60 బంతుల్లో 39 కీలక పరుగులు సాధించడం ద్వారా అందరి దృష్టి ఆకర్షించాడు.
ఇప్పటి వరకూ తన కెరియర్ లో 17 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడిన నితీశ్ కు 20.96 సగటుతో 566 పరుగులు, బౌలర్ గా 22.96 సగటుతో 52 వికెట్లు పడగొట్టిన రికార్డు ఉంది.
దేశవాళీ అండర్ -19 ( వినూమన్కడ్ ట్రోఫీ ) 2018-19 ట్రోఫీలో వన్ డౌన్ స్థానంలో బ్యాటింగ్ కు దిగిన నితీశ్..అండర్ -19 చాలెంజర్ ట్రోఫీలో వన్ డౌన్ లేదా రెండోడౌన్లో ఆడుతూ సత్తా చాటుకొన్నాడు.
అండర్ -16 స్థాయి నుంచే కొత్తబంతితో బౌలింగ్ చే్స్తూ వచ్చిన నితీశ్ కు నాణ్యమైన స్వింగ్ కమ్ పేస్ బౌలర్ గా కూడా గుర్తింపు ఉంది. 2022 సీజన్లో మహారాష్ట్ర్రతో జరిగిన మ్యాచ్ లో 5 వికెట్లు పడగొట్టిన నితీశ్..2023 సీజన్లో ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో 7వ డౌన్లో బ్యాటింగ్ కు దిగి 66 పరుగుల స్కోరు సాధించడం ద్వారా సత్తా చాటుకొన్నాడు.
ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ కు వీరాభిమానిగా ఉన్న నితీశ్ లోని ఆల్ రౌండ్ ప్రతిభను గుర్తించిన సన్ రైజర్స్ యాజమాన్యం 2023 సీజన్ కోసం 20 లక్షల రూపాయల కనీస ధరకు జట్టులో చేర్చుకొంది. అయితే 2024 సీజన్లో కానీ నితీశ్ కు వరుసగా రెండుమ్యాచ్ లు ఆడే అవకాశం దక్కలేదు.
పంజాబ్ తో జరిగిన పోరులో తమజట్టు విజయంలో ప్రధానపాత్ర వహించిన యువఆల్ రౌండర్ నితీశ్ పై సన్ రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఏమాత్రం ఒత్తిడిలేకుండా చిన్నవయసులోనే నితీశ్ అలవోకగా బ్యాటింగ్ చేసిన తీరు తనను ఆకట్టుకొందని కొనియాడాడు.
మొత్తం మీద..నితీశ్ రూపంలో భారత్ కు మరో పేస్ బౌలింగ్ కమ్ బ్యాటింగ్ ఆల్ రౌండర్ దక్కినట్లే.
ముంబై ఫ్రాంచైజీకి ఆడుతున్న తిలక్ వర్మ, హైదరాబాద్ ఫ్రాంచైజీకి ఆడుతున్న నితీశ్ మాత్రమే..ప్రస్తుత సీజన్ ఐపీఎల్ లో ఆడుతున్న తెలుగు రాష్ట్ర్రాల క్రికెటర్లు అనడంలో ఏమాత్రమే సందేహం లేదు.