Telugu Global
Sports

ఐపీఎల్ వేలంలో మరో అరుదైన ఘట్టానికి కౌంట్ డౌన్!

దుబాయ్ వేదికగా మరికొద్దిగంటల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్ -2024 సీజన్ మినీ వేలంలో ఓ అరుదైన ఘట్టానికి రంగం సిద్ధమయ్యింది.

ఐపీఎల్ వేలంలో మరో అరుదైన ఘట్టానికి కౌంట్ డౌన్!
X

దుబాయ్ వేదికగా మరికొద్దిగంటల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్ -2024 సీజన్ మినీ వేలంలో ఓ అరుదైన ఘట్టానికి రంగం సిద్ధమయ్యింది.

ఐపీఎల్ వేలం చరిత్రలో మరో అరుదైన ఘట్టానికి దుబాయి వేదికగా మంగళవారం తెరలేవనుంది. 2008 నుంచి 2023 సీజన్ల వరకూ జరిగిన వేలం కార్యక్రమాలకు భిన్నంగా 2024 సీజన్ మినీ వేలం కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఐపీఎల్ బోర్డు రంగం సిద్ధం చేసింది.

మహిళా ఆక్షనీర్ ఆధ్వర్యంలో వేలం...

ఉత్కంఠభరితంగా సాగే ఐపీఎల్ వేలం కార్యక్రమాన్ని పురుష ఆక్షనీర్లే నిర్వహించడం గత 15 సీజన్లుగా ఓ ఆనవాయితీగా వచ్చింది. అయితే..2024 సీజన్ కోసం..

దుబాయ్ వేదికగా డిసెంబర్ 19న నిర్వహించే వేలంలో మాత్రం ఓ అరుదైన ఘట్టం చోటు చేసుకోనుంది. రిచర్డ్ మాడ్లే, ఎడ్మిడేస్ లాంటి విఖ్యాత పురుషు ఆక్షనీర్లకు బదులుగా ఓ మహిళా ఆక్షనీర్ తో వేలం కార్యక్రమం నిర్వహించాలని ఐపీఎల్ పాలకమండలి భావిస్తోంది.

మల్లికా సాగర్ సరికొత్త చరిత్ర...

2008 ప్రారంభ ఐపీఎల్ నుంచి 2017 సీజన్ వరకూ రిచర్డ్ మాడ్లే వేలం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తూ వచ్చారు. అయితే..2018 సీజన్ నుంచి మాడ్లే స్థానంలో ఎడ్మీడేస్ ను ఆక్షనీర్ గా ఐపీఎల్ బోర్డు నిర్వహించింది.

బెంగళూరు ఐటీసీ గార్డెనియా హోటెల్ వేదికగా గత సీజన్ వేలం కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో ఎడ్మిడేస్ కళ్ళుతిరిగి కుప్పకూలిపోయారు. దీంతో విఖ్యాత కామెంటీటర్ చారు శర్మను హుటాహుటిన రప్పించడం ద్వారా వేలం కార్యక్రమాన్ని ముగించగలిగారు.

అయితే..దుబాయ్ వేదికగా కేవలం ఒక్కరోజు మాత్రమే జరిగే 2024 సీజన్ ఐపీఎల్ మినీ వేలాన్ని మాత్రం తొలిసారిగా ఓ మహిళకు నిర్వహించే అవకాశమిచ్చారు. ఆ అరుదైన అవకాశాన్ని మల్లికా సాగర్ సొంతం చేసుకొంది.

2024 సీజన్ వేలానికి ఎడ్మిడేస్ సేవలు అవసరం లేదని..ఆ బాధ్యతల్ని మల్లికా సాగర్ నిర్వహిస్తారని బోర్డు వర్గాలు ఇప్పటికే అనధికారికంగా ప్రకటించాయి. ఎడ్మిడేస్ తన 38 సంవత్సరాల ఆక్షనీర్ కెరియర్ లో 2500 వేర్వేరు వేలం కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ప్రపంచ మేటి ఆక్షనీర్ గా గుర్తింపు సంపాదించుకొన్నారు. వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ మెగా వేలం కార్యక్రమాన్ని ఎడ్మిడేస్ చేత నిర్వహింప చేయాలని ఐపీఎల్ బోర్డు నిర్ణయించింది.


ఎవరీ మల్లికా సాగర్...?

మహిళా ఐపీఎల్ తొలి వేలం కార్యక్రమాన్ని అత్యంత సమర్థవంతంగా, ఆత్మవిశ్వాసంతో నిర్వహించడం ద్వారా ముంబై యువతి మల్లికా సాగర్ అందరి దృష్టిని ఆకర్షించారు. పురుషులకు మహిళలు ఏమాత్రం తీసిపోరని తెలియచెప్పారు.

కొద్దిగంటలపాటు ఎలాంటి అంతరాయం లేకుండా సాగిన ఈ వేలంలో ఐదు ఫ్రాంచైజీలకు చెందిన బృందాలు, పలువురు బీసీసీఐ ప్రముఖులు, మీడియా సభ్యులు పాల్గొన్నారు.

వేలం కార్యక్రమాన్ని నిర్వహించే బాధ్యతను ముంబైకి చెందిన మల్లిక సాగర్ కు బీసీసీఐ అప్పజెప్పింది. వేలం జాబితాలోని మొత్తం 408 ప్లేయర్ల పేర్లను చదువుతూ..చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో, అలవోకగా వేలం కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా తనకుతానే సాటిగా నిలిచింది.

మల్లికకు స్వతహాగా.. పురాత‌న‌ పెయింటింగ్స్‌, శిల్పాలు, కళాఖండాలు సేక‌రించ‌డ‌మంటే చాలా ఇష్టం.

మ‌ధ్య భార‌తదేశం, ఆధునిక భార‌త దేశానికి సంబంధించిన పెయింటింగ్స్‌ను మ‌ల్లిక ఎక్కువ‌గా సేకరిస్తూ ఉంటారు. ఆమె ప్ర‌స్తుతం ఆర్ట్ ఇండియా క‌న్స‌ల్టంట్స్ కంపెనీలో ప‌నిచేస్తోంది.

కళాఖండాల వేలం కార్యక్రమాల నిర్వహణ అనుభవంతో మల్లిక ఐపీఎల్ వేలం కార్యక్రమాన్ని అలవోకగా నిర్వహించగలిగింది. ప్రారంభ మహిళా ఐపీఎల్ వేలాన్ని నిర్వహించిన తొలిమహిళగా మల్లికా సాగర్ రికార్డుల్లో చేరింది.

వేలం కార్యక్రమాన్ని మల్లిక నిర్వహించిన తీరును చూసి భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ అబ్బురపడిపోయాడు. మల్లికను చూసి భారత్ గర్విస్తోందని, మల్లికతో వేలం కార్యక్రమాన్ని నిర్వహించేలా చేసిన బీసీసీఐని కొనియాడక తప్పదంటూ ట్విట్ చేశాడు.


మహిళా ఐపీఎల్ నుంచి పురుషుల ఐపీఎల్ వరకూ...

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ బోర్డు బీసీసీఐ గత 15 సీజన్లుగా నిర్వహిస్తూ వస్తున్నఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం కార్యక్రమాలను బ్రిట‌న్‌కు చెందిన‌ హ‌గ్ ఎడ్మిడెస్, ఇంగ్లండ్ టీవీ ప్ర‌జెంట‌ర్‌ రిచ‌ర్డ్ మ‌డ్లే, భార‌త కామెంటేట‌ర్ చారు శర్మ నిర్వహించడం ద్వారా సరికొత్త గ్లామర్ తెచ్చారు.

ఐపీఎల్ వేలం కార్యక్రమాన్ని నిర్వహించడం ఓ కళ అని చెప్పకనే చెప్పారు.

గంటలపాటు సాగే వేలం కార్యక్రమాన్ని విసుగు విరామం లేకుండా..అత్యంత సమర్థవంతంగా, ఆకర్షణీయంగా, ఆసక్తికరంగా నిర్వహించాలంటే ఎంతో నేర్పు, ఓర్పు, ప్రజ్ఞ, సమయస్ఫూర్తి ఉండి తీరాలి.

ఇప్పటి వరకూ పురుషుల ఐపీఎల్ వేలం కార్యక్రమాలను పురుషులే నిర్వహించారు. అయితే పురుషుల ఐపీఎల్ వేలాన్ని నిర్వహించే తొలి మహిళగా మల్లికా సాగర్ చరిత్ర సృష్టించనున్నారు.

రెండుసార్లు మహిళా ఐపీఎల్, 2021 సీజన్ ప్రో-కబడ్డీ లీగ్ వేలం కార్యక్రమాలు నిర్వహించిన రికార్డు మల్లికాసాగర్ కు ఉంది.

రంగం ఏదైనా తగిన అవకాశాలు కల్పించి, వెన్నుతట్టి ప్రోత్సహిస్తే.. పురుషులతో సమానంగా మహిళలూ రాణించగలరనడానికి మల్లికా సాగరే తాజానిదర్శనం.

First Published:  18 Dec 2023 1:30 PM
Next Story