Telugu Global
Sports

అశ్విన్ కోసం విశాఖ వేదికగా 5 రికార్డుల ఎదురుచూపులు!

విశాఖ వేదికగా ఇంగ్లండ్ తో వచ్చే ఐదురోజులూ జరిగే టెస్ట్ మ్యాచ్ లో ఆతిథ్య భారత్ కోసం ఏడు రికార్డులు ఎదురుచూస్తున్నాయి.

అశ్విన్ కోసం విశాఖ వేదికగా 5 రికార్డుల ఎదురుచూపులు!
X

విశాఖ వేదికగా ఇంగ్లండ్ తో వచ్చే ఐదురోజులూ జరిగే టెస్ట్ మ్యాచ్ లో ఆతిథ్య భారత్ కోసం ఏడు రికార్డులు ఎదురుచూస్తున్నాయి. జాదూ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 500 వికెట్ల మైలురాయిని చేరడంతో ఐదు సరికొత్త రికార్డులు నెలకొల్పే అవకాశం ఉంది.

క్రికెట్ అంటే ..పరుగులు, వికెట్లు, సెంచరీలు మాత్రమే కాదు..నిరంతరం మారిపోతూ ఉండే రికార్డులు కూడా. దానికి జట్లు, ఆటగాళ్లు సైతం ఏమాత్రం మినహాయింపు కాదు.

ఐసీసీ టెస్టు లీగ్ లో భాగంగా ఇంగ్లండ్ తో మన స్టీల్ సిటీ విశాఖ పట్నం వేదికగా వచ్చే ఐదురోజులపాటు జరిగే కీలక రెండోటెస్టులో రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టు కనీసం ఏడు సరికొత్త రికార్డులు నెలకొల్పే అవకాశం కనిపిస్తోంది. ఇందులో కెప్టెన్ రోహిత్ శర్మ కోసం రెండు, స్పిన్ గ్రేట్ రవిచంద్రన్ అశ్విన్ కోసం ఐదు సరికొత్త రికార్డులు ఎదురుచూస్తున్నాయి.

500 వికెట్ల రికార్డుకు చేరువగా అశ్విన్...

సాంప్రదాయ టెస్టు క్రికెట్ చరిత్రలో 500 వికెట్లు పడగొట్టిన బౌలర్లు ఇప్పటి వరకూ ఎనిమిదిమంది మాత్రమే ఉన్నారు. సరికొత్తగా వారి సరసన నిలవటానికి భారత ఎవర్ గ్రీన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తహతహలాడుతున్నాడు.

తన కెరియర్ లో ఇటీవలి హైదరాబాద్ మ్యాచ్ వరకూ ఆడిన 96 టెస్టుల్లో అశ్విన్ 496 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుత విశాఖ టెస్టులో మరో నాలుగు వికెట్లు పడగొట్టగలిగితే అశ్విన్ 500 వికెట్ల మైలురాయిని చేరుకోడమే కాదు..ఈ ఘనత సాధించిన తొమ్మిదో టెస్టు బౌలర్ గా చరిత్ర సృష్టించగలుగుతాడు. భారత్ తరపున ఇప్పటి వరకూ లెగ్ స్పిన్నర్ అనీల్ కుంబ్లేకు మాత్రమే 500 వికెట్ల రికార్డు నెలకొల్పిన ఘనత ఉంది.

ఇంగ్లండ్ ప్రత్యర్థిగా 100 వికెట్ల రికార్డు...

ఇంగ్లండ్ ప్రత్యర్థిగా 100 టెస్టు వికెట్లు పడగొట్టిన భారత తొలిబౌలర్ రికార్డును సైతం నెలకొల్పే అరుదైన అవకాశం అశ్విన్ కోసం ఎదురుచూస్తోంది. భారత్- ఇంగ్లండ్ జట్ల నడుమ 1930 నుంచి జరుగుతున్న ద్వైపాక్షిక టెస్టు సిరీస్ ల్లో అత్యధికంగా 95 వికెట్లు పడగొట్టిన భారత బౌలర్ రికార్డు లెగ్ స్పిన్నర్ భగవత్ సుబ్రమణ్య చంద్రశేఖర్ పేరుతో ఉంది. ఆ తర్వాతి స్థానంలో 93 వికెట్ల తో కొనసాగుతున్న అశ్విన్ ప్రస్తుత సిరీస్ లోని విశాఖ టెస్టులో మరో 7 వికెట్లు పడగొట్టగలిగితే..100 వికెట్ల రికార్డును అందుకోగలుగుతాడు.

ఇంగ్లండ్ పేస్ బౌలర్ జేమ్స్ యాండర్సన్ కు భారత్ పై 100 వికెట్లు పడగొట్టిన బౌలర్ రికార్డు ఉంది. ఇంగ్లండ్- భారత్ ద్వైపాక్షిక సిరీస్ ల్లో ఈ ఘనత సాధించిన రెండోబౌలర్ గా అశ్విన్ నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.

అత్యధిక 5 వికెట్ల రికార్డు....

టెస్టు చరిత్రలో అత్యధిక 5 వికెట్లు పడగొట్టిన రికార్డు సైతం అశ్విన్ ను ఊరిస్తోంది. ఓ ఇన్నింగ్స్ లో బౌలర్ 5 వికెట్లు పడగొడితే ..అది సెంచరీతో సమానంగా పరిగణిస్తారు. తన కెరియర్ లో ఇప్పటి వరకూ ఆడిన 96 టెస్టుల్లో అశ్విన్ కు 34 సార్లు 5 వికెట్లు పడగొట్టిన రికార్డు ఉంది. అయితే భారత బౌలర్లలో అనీల్ కుంబ్లేకి మాత్రమే 35సార్లు 5 వికెట్లు పడగొట్టిన రికార్డు ఉంది.

కుంబ్లే పేరుతో ఉన్న ఈ రికార్డును అశ్విన్ సమం చేయాలన్నా లేదా అధిగమించాలన్నా విశాఖటెస్టు రెండు ఇన్నింగ్స్ లోనూ 5 వికెట్లు చొప్పున పడగొట్టాల్సి ఉంది.

విశాఖ టెస్టులో కాకున్నా ప్రస్తుత సిరీస్ లోనే అశ్విన్ ఈ రికార్డు అందుకొనే అవకాశం లేకపోలేదు.

ఐసీసీ టెస్టులీగ్ లో 100 వికెట్ల రికార్డు...

ఐసీసీ టెస్టు లీగ్ చరిత్రలో 100 వికెట్లు పడగొట్టిన భారత రెండో బౌలర్ గా నిలిచే రికార్డు వైస్ కెప్టెన్ జస్ ప్రీత్ బుమ్రా కోసం సిద్ధంగా ఉంది. ఇప్పటి వరకూ టెస్టు లీగ్ లో 100 వికెట్లు పడగొట్టిన మొనగాడిగా అశ్విన్ మాత్రమే ఉన్నాడు. టెస్టులీగ్ లో భాగంగా ఇప్పటి వరకూ ఆడిన 27మ్యాచ్ ల్లో బుమ్రా 97 వికెట్లు సాధించాడు. మరో 3 వికెట్లు విశాఖ టెస్టులో బుమ్రా పడగొడితే వికెట్ల సెంచరీ సాధించిన భారత రెండోబౌలర్ గా నిలిచిపోతాడు.

అత్యధిక టెస్టు లీగ్ పరుగుల రికార్డుకు రోహిత్ గురి..

టెస్టులీగ్ లో అత్యధికంగా 2235 పరుగులు సాధించిన రికార్డు విరాట్ కొహ్లీ పేరుతో ఉంది. ఆ రికార్డును ప్రస్తుత భారత కెప్టెన్ అధిగమించాలంటే విశాఖటెస్టులో 21 పరుగులు చేస్తే చాలు. రోహిత్ ప్రస్తుత సిరీస్ లోని హైదరాబాద్ టెస్టు వరకూ ఆడిన 28 మ్యాచ్ ల్లో 2215 పరుగులు సాధించాడు.

ద్రావిడ్ రికార్డుకు చేరువగా రోహిత్...

భారత్ తరపున తన కెరియర్ లో 48 శతకాలు బాదడం ద్వారా మూడోస్థానంలో కొనసాగుతున్న ప్రస్తుత టీమ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ రికార్డును సమం చేసే అవకాశం రోహిత్ శర్మకు చిక్కింది. తన కెరియర్ లో ఇప్పటి వరకూ 468 అంతర్జాతీయమ్యాచ్ లు ఆడి 46 శతకాలు బాదిన రోహిత్ ప్రస్తుత విశాఖ టెస్టు లేదా సిరీస్ లో మరో రెండు శతకాలు బాదితే ద్రావిడ్ రికార్డును సమం చేయగలుగుతాడు. మూడు శతకాలు బాదితే ద్రావిడ్ రికార్డును అధిగమించే అవకాశం ఉంది.

టెస్టు చరిత్రలో అత్యధిక అంతర్జాతీయ శతకాల ( 100 ) రికార్డు మాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరుతో ఉంది. 80 సెంచరీలతో విరాట్ కొహ్లీ రెండోస్థానంలో కొనసాగుతున్నాడు.

గత 4464 రోజుల్లో ఇదే తొలిటెస్టు.....

గత 12 సంవత్సరాల 3 నెలల కాలంలో...కీలక బ్యాటర్లు విరాట్ కొహ్లీ, రవీంద్ర జడేజా, చతేశ్వర్ పూజారా, అజింక్యా రహానేలు లేకుండా భారతజట్టు టెస్టు బరిలోకి దిగడం ఇదే మొదటి సారి. ఈ నలుగురిలో కనీసం ఒక్కరైనా గత పుష్కరకాలంగా తుదిజట్టులో ఉంటూ వచ్చారు. అయితే ..ప్రస్తుత విశాఖ టెస్టులో మాత్రమే ఈ నలుగురు కీలక ఆటగాళ్లలో ఒక్కరూ తుదిజట్టులో లేకపోడం ఇదే మొదటిసారి.

బెన్ స్టోక్స్ నూ ఊరిస్తున్న అరుదైన రికార్డు...

ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ను సైతం ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. విశాఖ టెస్టులోనూ ఇంగ్లండ్ ను విజేతగా నిలుపగలిగితే..గత పుష్కరకాలంలో భారత గడ్డపై భారత్ ప్రత్యర్థిగా బ్యాక్ టు బ్యాక్ టెస్టు విజయాలు సాధించిన తొలివిదేశీజట్టుగా రికార్డు నెలకొల్పగలుగుతుంది.

రానున్న ఐదురోజుల్లో రెండుజట్లూ, రెండుజట్ల కీలక ఆటగాళ్లు మరెన్ని రికార్డులు నెలకొల్పగలుగుతారో..వేచిచూడాల్సిందే.

First Published:  2 Feb 2024 7:45 AM IST
Next Story