Telugu Global
Sports

విశాఖను తాకిన టీ-20 తుపాన్!

భారత్- ఆస్ట్ర్రేలియాజట్ల ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లోని తొలిసమరానికి స్టీల్ సిటీ విశాఖ సిద్ధమయ్యింది. రాత్రి 7 గంటలకు ఈ పోరు ప్రారంభంకానుంది.

విశాఖను తాకిన టీ-20 తుపాన్!
X

భారత్- ఆస్ట్ర్రేలియాజట్ల ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లోని తొలిసమరానికి స్టీల్ సిటీ విశాఖ సిద్ధమయ్యింది. రాత్రి 7 గంటలకు ఈ పోరు ప్రారంభంకానుంది.

క్రికెట్ సిరీస్ లు, లీగ్ లు, ప్రపంచకప్ టోర్నీలు చూసి చూసి అభిమానులు అలసి, విసిగిపోతున్నారేమో కానీ...అటు ఐసీసీ, ఇటు బీసీసీఐ ఏమాత్రం అలసిపోడం లేదు.

క్రికెట్ వేల కోట్ల రూపాయల గ్లోబల్ వ్యాపారంగా మారిపోడంతో..బ్రాడ్ కాస్టర్ల కోసమైనా నెలరోజులకో సిరీస్ నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ పరంపరలో భాగంగానే..వన్డే ప్రపంచకప్ ముగిసిందో లేదో..కేవలం నాలుగురోజుల వ్యవధిలోనే భారత్- ఆస్ట్ర్రేలియాజట్ల పాంచ్ పటాకా టీ-20 సిరీస్ కు కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది.

మిస్టర్ టీ-20 నాయకత్వంలో.....

దేశంలోని 10 నగరాలు వేదికగా.. గత ఆరున్నరవారాలుగా సాగిన 2023- ఐసీసీ వన్డే ప్రపంచకప్ ముగిసిన వెంటనే టీ-20 సిరీస్ ను బీసీసీఐ నిర్వహిస్తోంది.

వన్డే ప్రపంచకప్ లో రన్నరప్ గా నిలిచిన భారతజట్టులోని 12 మంది ప్రధాన ఆటగాళ్లకు ఎంపిక సంఘం విశ్రాంతినివ్వడంతో..మిస్టర్ టీ-20, ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో యువజట్టుతో పోటీకి దిగుతోంది.

మరోవైపు..ఆస్ట్ర్రేలియాజట్టుకు వికెట్ కీపర్ బ్యాటర్ మాథ్యూ వేడ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.

డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియం వేదికగా...

ఈ ఐదుమ్యాచ్ ల సిరీస్ లోని తొలి సమరానికి ఆతిథ్యమిచ్చే అవకాశం స్టీల్ సిటీ విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియానికి దక్కింది.గతేడాది జూన్ లో చివరిసారిగా ఓ అంతర్జాతీయమ్యాచ్ కు వేదికగా నిలిచిన ఈ స్టేడియానికి భారత లక్కీగ్రౌండ్ గా పేరుంది.

ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ భారత్, 4వ ర్యాంకర్ ఆస్ట్ర్రేలియాజట్ల నడుమ జరిగే ఈ పోటీ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయినట్లు నిర్వాహక ఆంధ్రక్రికెట్ సంఘం ప్రకటించింది.

దేశంలోని 53 అంతర్జాతీయ క్రికెట్ వేదికల్లో విశాఖ స్టేడియానికి సైతం బీసీసీఐ తగిన ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. తెలుగు రాష్ట్ర్రాలలోని రెండు ప్రధాన అంతర్జాతీయ క్రికెట్ వేదికల్లో ఒకటిగా ఉన్న ఈ వేదికలో ఎప్పుడు అంతర్జాతీయమ్యాచ్ లు నిర్వహించినా స్టేడియం కిటకిటలాడిపోడం ఆనవాయితీగా వస్తోంది.

యువరక్తంతో భారత్...

రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ, రాహుల్, బుమ్రా, షమీ, జడేజా లాంటి పలువురు సూపర్ స్టార్లకు విశ్రాంతినివ్వడం, గాయంతో హార్థిక్ పాండ్యా అందుబాటులో లేకపోడంతో భారతజట్టు పగ్గాలను సూర్యకుమార్ యాదవ్ కు అప్పజెప్పారు.

తెలుగు రాష్ట్ర్రాలకు చెందిన తిలక్ వర్మ ఒక్కడే ప్రస్తుత భారతజట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఓపెనర్ రుతురాజ్ గయక్వాడ్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.

జట్టులోని ఇతర సభ్యుల్లో ఇషాన్ కిషన్ ( వికెట్ కీపర్ ), యశస్వి జైశ్వాల్, శివం దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్నోయ్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ కృష్ణ, ముకేశ్ కుమార్, వాషింగ్టన్ సుందర్, ఆవేశ్ ఖాన్, జితేశ్ శర్మ ఉన్నారు.

హేమాహేమీలతో కంగారూజట్టు...

భారత్ తో పోల్చుకొంటే మాథ్యూ వేడ్ నాయకత్వంలోని ఆస్ట్ర్రేలియాజట్టులోని అనుభవం కలిగిన ఆటగాళ్లు ఎక్కువమంది ఉన్నారు. ప్రపంచకప్ ఫైనల్స్ హీరో ట్రావిస్ హెడ్, మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్ వెల్, మార్కుస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, సీన్ అబ్బోట్, ఆడం జంపా, నేథన్ ఇల్లిస్, జేసన్ బెహ్రెన్ డోర్ఫ్, తన్వీర్ సంగా, కేన్ రిచర్డ్‌సన్, ఆరోన్ హార్డీ సభ్యులుగా ఉన్నారు.

విశాఖ స్టేడియం పిచ్ బ్యాటింగ్ తో పాటు బౌలర్లకూ అనువుగా ఉండడంతో 175కు పైగా పరుగులు సాధించిన జట్టుకే విజయావకాశాలు ఉంటాయని క్యూరేటర్ చెబుతున్నారు.

నిర్భయంగా..దూకుడుగా ఆడండి....

భారత టీ-20 జట్టుకు తొలిసారిగా ఓ పూర్తి సిరీస్ లో నాయకుడిగా వ్యవహరిస్తున్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ..తన జట్టు సభ్యులకు నిర్భయంగా..దూకుడుగా ఆడండంటూ పిలుపునిచ్చాడు. స్థాయికి తగ్గట్టుగా రాణించడం ద్వారా అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోమని సలహా ఇచ్చాడు.

రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈపోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.

First Published:  23 Nov 2023 8:08 AM IST
Next Story