విరాట్ ను తప్పించలేదు.. రోహిత్ ను ఓప్పించాం- సౌరవ్!
భారతజట్టు కెప్టెన్ గా విరాట్ కొహ్లీని తప్పించలేదని బీసీసీఐ మాజీ చైర్మన్ సౌరవ్ గంగూలీ మరోసారి తేల్చి చెప్పారు.
భారతజట్టు కెప్టెన్ గా విరాట్ కొహ్లీని తప్పించలేదని బీసీసీఐ మాజీ చైర్మన్ సౌరవ్ గంగూలీ మరోసారి తేల్చి చెప్పారు...
భారత క్రికెట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కొహ్లీని తప్పించినట్లుగా జరుగుతున్న ప్రచారానికి బీసీసీఐ మాజీ చైర్మన్ సౌరవ్ గంగూలీ తెరదించారు. నాయకత్వబాధ్యతల నుంచి విరాట్ తనకుతానుగానే తప్పుకొన్నాడని వివరణ ఇచ్చారు.
విరాట్ వద్దంటేనే రోహిత్ కు చాన్స్....
2021 టీ-20 ప్రపంచకప్ వైఫల్యం తరువాత కెప్టెన్ గా తాను తప్పుకొంటానని విరాట్ ప్రకటించాడు. ఆ సమయంలో బీసీసీఐ చైర్మన్ గా ఉన్న సౌరవ్ గంగూలీ మాత్రం..
వన్డే జట్టుకు మాత్రమే కాదు, టీ-20 జట్టుకు సైతం కెప్టెన్ గా కొనసాగాలని విరాట్ కు సూచించారు. అయితే..విరాట్ మాత్రం అందుకు నిరాకరించి మొత్తం మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకోడం వివాదాస్పదమయ్యింది.
విరాట్ ను బలవంతంగా నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకొనేలా చేయడంలో సౌరవ్ గంగూలీ ప్రధానపాత్ర పోషించినట్లుగా మీడియాలో ప్రచారం జరిగింది. భారీగా కథనాలు రావడంతో సౌరవ్ పదేపదే వివరణ ఇచ్చినా ఇంకా కొనసాగుతూనే ఉంది.
టెస్టు ఫార్మాట్ కు ఒకరు, టీ-20, వన్డే ఫార్మాట్లకు ఒకరు కెప్టెన్లుగా ఉంటే బాగుంటుందని, అదే విషయాన్ని అప్పట్లో విరాట్ కు వివరించామని, కనీసం వైట్ బాల్ ఫార్మాట్లో జట్టు కెప్టెన్ గా కొనసాగాలని కోరామని సౌరవ్ వివరించారు.
రోహిత్ అంతగా ఇష్టపడలేదు....
విరాట్ స్థానంలో భారతజట్టు కెప్టెన్ గా బాధ్యతలు తీసుకోడానికి మొదట్లో రోహిత్ శర్మ అంతగా ఆసక్తి చూపలేదని, తానే బలవంతంగా ఒప్పించానని సౌరవ్ గుర్తు చేసుకొన్నారు.
తాను బీసీసీఐ చైర్మన్ గా ఉన్న సమయంలోనే ఇది జరగడంతో నాయకత్వ బాధ్యతల నుంచి విరాట్ ను తానే తప్పించినట్లుగా ప్రచారం జరుగుతోందని, ఆ ప్రచారాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారంటూ దాదా అసంతృప్తి వ్యక్తం చేశారు.
టీ-20 జట్టు కెప్టెన్ గా ఉండటానికి ఇష్టం లేకపోతే వన్డే జట్టు నాయకత్వ బాధ్యతల్ని విడిచిపెట్టాలని విరాట్ ను కోరామని చెప్పారు. క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ భారతజట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన విరాట్ ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. అయితే..వరుసగా మూడేళ్లపాటు ప్రధాన బ్యాటర్ గా విరాట్ దారుణంగా విఫలమయ్యాడు. 36 మాసాలపాటు కనీసం ఒక్క సెంచరీ సాధించలేకపోయినా జట్టులో కీలక సభ్యుడిగా కొనసాగగలిగాడు.
మరోవైపు..భారతజట్టు కు మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్ గా ఉండటానికి రోహిత్ ఏమాత్రం ఇష్టపడలేదని..అయితే తాను పదేపదే చర్చించి, ఒప్పించానని, తన మాటను రోహిత్ మన్నించడం తనను గౌరవించడం లాంటిదేనని సౌరవ్ తెలిపారు.
ఆటగాళ్ల చేతుల్లోనే జయాపజయాలు...
క్రికెట్లో జయాపజయాలను నిర్ణయించాల్సింది జట్టు సభ్యులు మాత్రమేనని, క్రికెట్ పాలకుల చేతుల్లో ఏమీ ఉండదని, దారితప్పిన భారత క్రికెట్ ను గాడిలో పెట్టడానికి తనను బీసీసీఐ చైర్మన్ గా ఎంపిక చేశారని, తనవంతుగా బాధ్యతల్ని నిర్వర్తించానని దాదా సంతృప్తి వ్యక్తం చేశారు.
తాము ఏడేళ్లపాటు..అహరహం శ్రమిస్తే కానీ దారితప్పిన భారత క్రికెట్ తిరిగి గాడిలో పడలేదని, తాను భారత కెప్టెన్ గా మాత్రమే కాదు..బోర్డు చైర్మన్ గానూ వందకు 120 శాతం కష్టపడ్డానని, బాధ్యతల నిర్వర్తించే సమయంలో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశానని, కీలక బాధ్యతలు అప్పజెప్పిన బీసీసీఐకి తాను రుణపడి ఉంటానని సౌరవ్ కృతజ్ఞతలు తెలిపారు.
భారత క్రికెట్ జట్టు అత్యంత విజయవంతమైనది నిలవడం వెనుక అప్పటి చీఫ్ కోచ్ రవి శాస్త్రి, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీల కృషి అంతాఇంతా కాదని కొనియాడారు.
గత పుష్కరకాలంలో కనీసం ఒక్క ఐసీసీ ప్రపంచ టైటిల్ సాధించలేకపోయినా..క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ భారతజట్టే ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ లో నిలుస్తూ వస్తోంది.
ఐసీసీ టెస్టు లీగ్ లో వరుసగా రెండోసారి రన్నరప్ సాధించిన భారతజట్టు..కొద్దిరోజుల క్రితమే ముగిసిన 2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో సైతం రన్నరప్ స్థానంతోనే సరిపెట్టుకోక తప్పలేదు.
మరో 8 మాసాలలో కరీబియన్ ద్వీపాలు, అమెరికా దేశాల సంయుక్త ఆతిథ్యంలో జరుగనున్న 2024 టీ-20 ప్రపంచకప్ లో నైనా భారత్ విజేతగా నిలవాలని ఆశపడుతోంది.