షారుక్, ప్రియాంకాలను మించిన విరాట్!
ఆసియాఖండంలోనే అత్యంత జనాదరణ కలిగిన ప్రముఖుడిగా భారత మాజీ కెప్టెన్, సూపర్ స్టార్ క్రికెటర్ విరాట్ కొహ్లీ నిలిచాడు.
భారత క్రికెట్ నయామాస్టర్ విరాట్ కొహ్లీ క్రికెట్ ఫీల్డ్ లో మాత్రమే కాదు..వెలుపలా రికార్డుల మోత మోగిస్తున్నాడు. బాలీవుడ్ సూపర్ స్టార్లు షారుక్ ఖాన్, ప్రియాంక చోప్రాలనే మించపోడం ద్వారా మరో అరుదైన ఘనత సొంతం చేసుకొన్నాడు....
ఆసియాఖండంలోనే అత్యంత జనాదరణ కలిగిన ప్రముఖుడిగా భారత మాజీ కెప్టెన్, సూపర్ స్టార్ క్రికెటర్ విరాట్ కొహ్లీ నిలిచాడు. క్రికెట్ ఫీల్డ్ లో మాత్రమే కాదు..వెలుపలా తనకు తిరుగేలేదని మరోసారి చాటుకొన్నాడు.
2023 క్రికెట్ సీజన్ ను అరుదైన రికార్డులతో, అత్యంత విజయవంతంగా ముగించడం ద్వారా విరాట్ తన పాపులారిటీని మరింతగా పెంచుకొన్నాడు.
ఆసియా నంబర్ వన్ విరాట్ కొహ్లీ...
ఆసియాఖండంలోనే అత్యంత జనాదరణ పొందిన సూపర్ స్టార్ గా, భారత సెలెబ్రిటీగా నిలిచాడు. ఇప్పటికే ఇన్ స్టాగ్రామ్ తో సహా పలు సోషల్ మీడియా వేదికలుగా బాలీవుడ్ సూపర్ స్టార్లను మించిపోయిన విరాట్ చివరకు వికీపీడియాలోనూ పైచేయి సాధించాడు.
విరాట్ కొహ్లీ గురించి తెలుసుకోడానికి వికీపీడియా పేజీలను సందర్శించినవారి సంఖ్య 10.7 మిలియన్లసంఖ్యను దాటిపోయింది. వికీపీడియా వేదికగా ఇప్పటి వరకూ అత్యంత జనాదరణ పొందిన ఆసియా సూపర్ స్టార్లుగా ఉన్న షారుక్ ఖాన్, ప్రియాంక చోప్రాలను విరాట్ తొలిసారిగా అధిగమించాడు.
తమ వేదిక ద్వారా విరాట్ ను అనుసరించేవారి సంఖ్య 10 లక్షల 70వేలుగా వికీపీడియా అధికారికంగా ప్రకటించింది.
విరాట్ కొహ్లీ వివరాలతో వికీపీడియా తయారు చేసిన పేజీని 10 లక్షల మందికి పైగా సందర్శించడం ఓ అరుదైన రికార్డుగా మిగిలిపోతుందని వికీపీడియా వివరించింది.
ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లోని తొలి టెస్టులో విరాట్ పలు అరుదైన రికార్డులు నెలకొల్పాడు. ఏడు వేర్వేరు సీజన్లలో 2వేలకు పైగా పరుగులు సాధించిన తొలి, ఏకైక క్రికెటర్ గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును అధిగమించాడు.
అంతేకాదు..దక్షిణాఫ్రికా గడ్డపై వివిధ ఫార్మాట్లలో అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాటర్ గా సచిన్ పేరుతో ఉన్న రికార్డును సైతం విరాట్ తిరగరాశాడు.
సచిన్ పేరుతో ఉన్న 1724 పరుగుల రికార్డును విరాట్ అధిగమించగలిగాడు.
సెంచూరియన్ వేదికగా ముగిసిన తొలిటెస్టు వరకూ దక్షిణాఫ్రికా ప్రత్యర్థిగా ఆడిన 29 మ్యాచ్ ల్లో విరాట్ ఐదు సెంచరీలతో సహా 1750 పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు.
వన్డే ఫార్మాట్లో దక్షిణాఫ్రికాపై విరాట్ కు 898 పరుగులతో 74.83 సగటు సాధించిన రికార్డు సైతం ఉంది.