Telugu Global
Sports

విరాట్ రెడీ, నేడే అప్ఘన్ తో భారత్ రెండో టీ-20!

టీ-20 పదవ ర్యాంకర్ అప్ఘనిస్థాన్ తో తీన్మార్ సిరీస్ ను 2-0తో ఖాయం చేసుకోడానికి టాప్ ర్యాంకర్ భారత్ తహతహలాడుతోంది. ఇండోర్ లోని హోల్కార్ స్టేడియం వేదికగా ఈ రోజు జరిగే రెండో టీ-20 ద్వారా విరాట్ కొహ్లీ రీ-ఎంట్రీ చేయనున్నాడు.

విరాట్ రెడీ, నేడే అప్ఘన్ తో భారత్ రెండో టీ-20!
X

టీ-20 పదవ ర్యాంకర్ అప్ఘనిస్థాన్ తో తీన్మార్ సిరీస్ ను 2-0తో ఖాయం చేసుకోడానికి టాప్ ర్యాంకర్ భారత్ తహతహలాడుతోంది. ఇండోర్ లోని హోల్కార్ స్టేడియం వేదికగా ఈ రోజు జరిగే రెండో టీ-20 ద్వారా విరాట్ కొహ్లీ రీ-ఎంట్రీ చేయనున్నాడు.

2024- టీ-20 ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా ప్రపంచ నంబర్ వన్ భారత్, నంబర్ టెన్ అప్ఘనిస్థాన్ జట్ల తీన్మార్ సిరీస్ కీలక దశకు చేరింది. సిరీస్ లో భాగంగా మొహాలీ వేదికగా జరిగిన తొలిసమరంలో భారత్ 6 వికెట్ల అలవోక విజయం సాధించడంతో 1-0తో పైచేయి సాధించగలిగింది.

14 మాసాల తరువాత విరాట్....!

బ్యాటర్ల స్వర్గధామం, పరుగుల గని ఇండోర్ హోల్కార్ స్టేడియం వేదికగా ఈ రోజు జరిగే రెండో మ్యాచ్ ఆతిథ్య భారత్ కు చెలగాటం, సంచలనాల అప్ఘనిస్థాన్ కు సిరీస్ సంకటంగా మారింది.

భారత రన్ మెషీన్ విరాట్ కొహ్లీ 14 మాసాల సుదీర్ఘ విరామం తరువాత తిరిగి టీ-20 అంతర్జాతీయ బరిలోకి దిగనున్నాడు. ఆస్ట్ర్రేలియా వేదికగా ముగిసిన 2022 టీ-20 ప్రపంచకప్ సెమీస్ తరువాత...ఈ ధూమ్ ధామ్ ఫార్మాట్ కు కెప్టెన్ రోహిత్ తో కలసి విరాట్ సైతం దూరంగా ఉంటూ వచ్చాడు. ఈ ఇద్దరు సూపర్ స్టార్ క్రికెటర్లు కేవలం టెస్టు, వన్డే మ్యాచ్ లకే పరిమితమవుతూ వచ్చారు.

అయితే..మరో ఆరుమాసాలలో అమెరికా, వెస్టిండీస్ సంయుక్త ఆతిథ్యంలో జరిగే 2024 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ కు రోహిత్ తో కలసి విరాట్ సైతం అందుబాటులోకి వచ్చాడు.

ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా విరాట్ తన తొలిమ్యాచ్ ను ఈ రోజు అప్ఘనిస్థాన్ తో ఆడనున్నాడు.

తుదిజట్టు నుంచి శుభ్ మన్ గిల్, తిలక్ వర్మ అవుట్...

తుంటినొప్పితో తొలిమ్యాచ్ కు దూరంగా ఉన్న ఓపెనర్ యశస్వి జైశ్వాల్ పూర్తి ఫిట్ నెస్ తో సిద్ధంకావడంతో స్టాప్ గ్యాప్ ఓపెనర్ శుభ్ మన్ గిల్ బెంచ్ కే పరిమితం కానున్నాడు.

వన్ డౌన్ బ్యాటర్ తిలక్ వర్మ స్థానంలో విరాట్ కొహ్లీ బ్యాటింగ్ కు దిగనున్నాడు. విరాట్ రాకతో భారత బ్యాటింగ్ ఆర్డర్ కు వెయ్యేనుగుల బలం వచ్చినట్లయ్యింది.

కెప్టెన్ రోహిత్, విరాట్ ఇద్దరూ స్థాయికి తగ్గట్టుగా బ్యాటింగ్ చేయగలిగితే రషీద్ ఖాన్ లేని అప్ఘన్ బౌలింగ్ ఎటాక్ కు కష్ట్రాలు తప్పవు.

హాట్ ఫేవరెట్ గా భారత్...

కురచ బౌండ్రీలైన్లతో బ్యాటింగ్ కు అనువుగా ఉండే ఇండోర్ స్టేడియానికి భారీస్కోర్ల గ్రౌండ్ గా పేరుంది. ఇదే వేదికగా రోహిత్ శర్మ నాయకత్వంలో మూడు టీ-20లు ఆడిన భారత్ కు 2 విజయాలు, ఓ పరాజయం రికార్డు ఉన్నాయి.

ఈ మ్యాచ్ లో 180 కి పైగా స్కోరు సాధించిన జట్టుకే విజయావకాశాలు ఉంటాయి. లెగ్ స్పిన్ జాదూ రషీద్ ఖాన్ గాయంతో జట్టుకు దూరం కావడంతో..యువ స్పిన్ జోడీ ముజీబుర్ రెహ్మాన్, నూర్ మహ్మద్ లతో కలసి వెటరన్ ఆల్ రౌండర్ మహ్మద్ నబీ కీలక పాత్ర పోషించనున్నారు.

భారత్ కు కీలకం అక్షర్ పటేల్...

ఆతిథ్య భారత్ కు స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ వరుసగా రెండోమ్యాచ్ లో సైతం కీలకం కానున్నాడు. తొలిపోరులో భారత్ 6 వికెట్ల విజయం సాధించడంలో ప్రధానపాత్ర వహించిన అక్షర్ కోటా 4 ఓవర్ల బౌలింగ్ అప్ఘన్ బ్యాటర్లకు అసలు సిసలు పరీక్షకానుంది.

ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్, లెగ్ స్పిన్నర్ రవి బిష్నోయ్ లతో పాటు పేస్ త్రయం అర్షదీప్ సింగ్, ముకేశ్ కుమార్, శివం దూబే సైతం ప్రధానపాత్ర వహించబోతున్నారు.

యువఆటగాళ్లు రహ్మతుల్లా గుర్బాజ్, అజం తుల్లా ఓమార్ జాయ్ , మహ్మద్ నబీ స్థాయికి తగ్గట్టుగా బ్యాటింగ్ చేయగలిగితే మ్యాచ్ రంజుగా సాగే అవకాశం ఉంది.

బౌలింగ్ లో నవీనుల్ హక్, ఫజల్ హక్ ఫరూకీ సైతం అప్ఘన్ కు కీలకం కానున్నారు.

భారత్ వరుసగా రెండో గెలుపుతో సిరీస్ ఖాయం చేసుకొంటుందా? లేక టాప్ ర్యాంకర్ భారత్ పై 10వ ర్యాంకర్ అప్ఘనిస్థాన్ సంచలన విజయంతో సిరీస్ ను 1-1తో సమం చేస్తుందా? తెలుసుకోవాలంటే రాత్రి 10 గంటల వరకూ వేచి చూడక తప్పదు. భారత కాలమాన ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఈ కీలక పోరు ప్రారంభంకానుంది.

First Published:  14 Jan 2024 9:15 AM IST
Next Story