Telugu Global
Sports

రెండుమాసాల విరామం తర్వాత 'ఫీల్డ్' లో విరాట్!

భారత క్రికెట్ సూపర్ స్టార్ విరాట్ కొహ్లీ రెండుమాసాల విరామం తరువాత తిరిగి క్రికెట్ ఫీల్డ్ లోకి అడుగుపెట్టాడు.

రెండుమాసాల విరామం తర్వాత ఫీల్డ్ లో విరాట్!
X

భారత క్రికెట్ సూపర్ స్టార్ విరాట్ కొహ్లీ రెండుమాసాల విరామం తరువాత తిరిగి క్రికెట్ ఫీల్డ్ లోకి అడుగుపెట్టాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున ఐపీఎల్ -17వ సీజన్ సమరానికి సిద్ధమయ్యాడు.

గత దశాబ్దకాలంగా అలుపుసొలుపు లేకుండా సిరీస్ వెంట సిరీస్ ఆడుతూ వచ్చిన విరాట్ కొహ్లీ లేని భారత క్రికెట్ ను ఊహించడం చాలా కష్టం .అయితే మూలవిరాట్టు లాంటి విరాట్ లేకుండానే రెండుమాసాలపాటు భారత క్రికెట్ కార్యక్రమం విజయవంతంగా ముగిసిపోయింది.

వ్యక్తిగత కారణాలతో....

ఐసీసీ టెస్టు లీగ్ లో భాగంగా ఇంగ్లండ్ తో ఇటీవలే ముగిసిన ఐదుమ్యాచ్ ల సిరీస్ కు విరాట్ కొహ్లీ వ్యక్తిగత కారణాలతో దూరంగా ఉన్నాడు. విరాట్ సుదీర్ఘ కెరియర్ లో రెండుమాసాలపాటు క్రికెట్ కు దూరం కావడం ఇదే మొదటిసారి.

ఫిట్ నెస్ కు మరో పేరైన విరాట్ లేకుండా భారతటెస్టుజట్టు ఏకంగా ఐదుమ్యాచ్ ల సిరీస్ లో పాల్గొనడం, విజేతగా నిలవడం కూడా ఇదే తొలిసారి.

విరాట్ భార్య అనుష్క ఓ మగబిడ్డకు జన్మనివ్వడం కోసం ఇంగ్లండ్ లో ఉండడంతో ఎనిమిదివారాలపాటు క్రికెట్ కు విరామం ఇవ్వక తప్పలేదు. భారత్ తరపున విరాట్ చివరిసారిగా జనవరిలో అప్ఘనిస్థాన్ ప్రత్యర్థిగా ఓ టీ-20 మ్యాచ్ ఆడాడు. అయితే..తన కుమారుడు అకాయ్ జన్మసమయంలో భార్య బాగోగులు చూసుకోడం కోసం క్రికెట్ నుంచి విరామం తీసుకొన్నాడు.

విరాట్ జట్టుకు దూరం కావడంతో భారత టీమ్ మేనేజ్ మెంట్..రజత్ పాటిదార్, సరఫ్రాజ్ ఖాన్, దేవదత్ పడిక్కల్ లాంటి యువబ్యాటర్లకు అవకాశం కల్పించగలిగింది.

ఐపీఎల్-17 తో రీ-ఎంట్రీ...

గత రెండుమాసాలుగా ఇంగ్లండ్ లోనే గడిపిన విరాట్..సరికొత్త ఐపీఎల్ సీజన్ కోసం బెంగళూరుకు తిరిగి వచ్చి సన్నాహాలు మొదలు పెట్టాడు. గత పుష్కరకాలంగా తాను క్రికెట్టే ఊపిరిగా బతికానని..అయితే..కుటుంబం కోసం తొలిసారిగా రెండుమాసాలు విరామం తీసుకొని..తిరిగి క్రికెట్ బరిలో నిలవడం తనకు ఏదో తెలియని ఉత్కంఠను కలిగిస్తున్నట్లు చెప్పాడు.

బెంగళూరుకు తిరిగి రావడంతోనే తనలో ఏదో తెలియని ఉత్సాహం వచ్చిందని, క్రికెట్ కు, మీడియాకు కొద్దివారాలపాటు దూరంగా ఉండటం తనకు ఓ వింత అనుభవమని తెలిపాడు.

రాయల్ చాలెంజర్‌ బెంగళూరు సన్నాహక శిబిరంలో తిరిగి చేరడం, ఐపీఎల్ సరికొత్త సీజన్ కోసం సమాయత్తం కావడం తనను ఉత్కంఠకు గురి చేస్తున్నట్లు వివరించాడు.

ఐపీఎల్ ఆల్ టైమ్ గ్రేట్ విరాట్...

2008 సీజన్లో ప్రారంభమైన ఐపీఎల్ గత 16 సీజన్ల చరిత్రలో విరాట్ ఓ దిగ్గజ బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు. పలు అరుదైన రికార్డులతో తనకుతానే సాటిగా నిలిచాడు.

2008 నుంచి 2023 సీజన్ వరకూ 237 మ్యాచ్ లు ఆడిన విరాట్ రికార్డుస్థాయిలో 7వేల 263 పరుగులు సాధించాడు. 7 సెంచరీలు, 50 హాఫ్ సెంచరీలతో సహా 130.02 స్ట్ర్రయిక్ రేటుతో 37.24 సగటు సాధించాడు.

మార్చి 22న చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగే ప్రారంభమ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున విరాట్ తిరిగి బరిలోకి దిగనున్నాడు.

ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో విరాట్ అత్యుత్తమంగా రాణించగలిగితేనే 2024 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే భారతజట్టులో చోటు దక్కించుకోగలుగుతాడు. లేకుంటే విరాట్ స్థానం కోసం ప్రతిభావంతులైన పలువురు యువబ్యాటర్లు పోటీపడుతున్నారు.

First Published:  19 March 2024 7:52 AM IST
Next Story